'తలవన్' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

Thalavan

Thalavan Review

  • మలయాళంలో రూపొందిన 'తలవన్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్ 
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ 
  • ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగే కథాకథనాలు 
  • బిజూ మీనన్ - అసిఫ్ అలీ నటన హైలైట్

మలయాళంలో ఈ ఏడాదిలో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలలో 'తలవన్' ఒకటిగా కనిపిస్తుంది. బిజూ మీనన్ - అసిఫ్ అలీ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా, 25 కోట్లకి పైగా వసూలు చేసింది. జిస్ జోయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'సోనీ లివ్' లో అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు, తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. 

జయశంకర్ (బిజూ మీనన్) సీఐ గా ఉన్న స్టేషన్ కి కార్తీక్ (అసిఫ్ అలీ) ఎస్.ఐ.గా వస్తాడు. జయశంకర్ కొంచెం తలతిక్క మనిషి అనీ, ఆయన దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలని కార్తీక్ కి మిగతా సిబ్బంది చెబుతారు. ఇక కార్తీక్ ముక్కుసూటి మనిషి అనీ, అందువల్లనే ఏడాదిన్నరలోనే చాలాసార్లు బదిలీ అవుతూ వచ్చాడనే విషయం జయశంకర్ కి అర్థమవుతుంది. గతంలో జరిగిన  కారణంగా జయశంకర్ పై కానిస్టేబుల్ రఘు ( కొట్టాయం నజీర్) కోపంతో ఉంటాడు. 

సెల్లో ఉన్న మనుదాస్ అనే వ్యక్తి చిన్నప్పుడు తనతో కలిసి చదువుకున్నాడని కార్తీక్ తెలుసుకుంటాడు. చేయని నేరానికి తనని సెల్లో వేశారనీ, మరో రెండు రోజుల్లో తన పెళ్లి అని మనుదాస్ చెప్పడంతో కార్తీక్ వదిలేస్తాడు. తనతో చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల కార్తీక్ పై జయశంకర్ ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తాడు. మనుదాస్ ను తిరిగి అరెస్టు చేస్తాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. 

ఈ పరిస్థితుల్లోనే జయశంకర్ భార్య సునీత (మియా జార్జ్)పై హత్యా ప్రయత్నం జరుగుతుంది. కత్తితో దాడి చేసిన 'జోషి' అనే వ్యక్తిని అరెస్టు చేసి జైల్లో పెడతారు. పెద్ద మనసుతో తన భర్తను వదిలేయమంటూ అతని భార్య 'రమ్య'  జయశంకర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జోషి జైల్లో ఉంటే తమ ఏడేళ్ల కూతురు భవిష్యత్తు దెబ్బతింటుందని అభ్యర్థిస్తూ ఉంటుంది. ఒక రోజున సునీత ఇంట్లో లేని సమయంలో .. జయశంకర్ ఇంట్లో జోషి భార్య 'రమ్య' శవం బయటపడుతుంది.   

రమ్యతో జయశంకర్ కి అక్రమ సంబంధం ఉండేదనీ, ఆమె మరణానికి అతనే కారకుడనే వార్త గుప్పుమంటుంది. దాంతో జయశంకర్ ను అరెస్టు చేస్తారు .. ఆ తరువాత 14 రోజుల రిమాండుకు తరలిస్తారు. రమ్య చనిపోయిన దగ్గర నుంచి ఆమె కూతురు కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారుతుంది. కొన్ని కారణాల వలన ఈ కేసును పరిష్కరించే బాధ్యతను కార్తీక్ కి  అప్పగిస్తారు. అప్పుడు కార్తీక్ ఏం చేస్తాడు? జయశంకర్ భార్యపై జోషి దాడి చేయడానికి కారణమేమిటి? జోషి భార్యను హత్య చేసింది ఎవరు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది. 
  
ఒక ఊరు .. పోలీస్ స్టేషన్ .. అక్కడి సిబ్బంది .. ఒక మర్డర్ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ మధ్య 'ఈగో' ఫీలింగ్స్ ను టచ్ చేస్తూ సాగే ఈ కథ, నిదానంగా చిక్కబడుతూ వెళుతుంది. కథ ఎటు వైపు వెళుతోంది? ఏం జరుగుతోంది? అనేది ప్రేక్షకులు గెస్ చేయలేరు. అంత నేర్పుతో వేసిన స్క్రీన్ ప్లే తో ఈ సినిమా కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాత్రలు వచ్చి చేరుతూ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంటాయి. 

సెకండాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథ పాకాన పడుతూ .. కుతూహలాన్ని పెంచుతూ పోతుంటుంది. ఇన్వెస్టిగేషన్ జరిగే తీరు ..  ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ దృశ్యాలు ఉత్కంఠ భరితంగా సాగుతాయి. ఒకసారి ఈ కథలోకి ఎంటరైతే ఆగకుండా చూసేలా .. ఎక్కడా అనవసరమైన సన్నివేశమనేది లేకుండా ఆకట్టుకుంటుంది. బిజూ మీనన్ - అసిఫ్ అలీ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. శరణ్ వేలాయుధం ఫొటోగ్రఫీ .. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం .. సూరజ్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.  


పోలీస్ ఆఫీసర్లు ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ అవుతూ ఉంటారు. వాళ్లు చేసే డ్యూటీ వలన కొంతమంది శత్రువులు ఏర్పడటం సహజం. అయితే తమ ద్వేషాన్ని దాచుకోలేక బయటపడేవాళ్లు కొందరైతే, ఈ ప్రపంచానికి తమ ఉనికి తెలియకుండా సైలెంట్ గా ఉంటూ ప్రతీకారం తీర్చుకునేవారు కొందరు. అలాంటివారి వలన ఎంతటి ప్రమాదమనేది చూపించే సినిమా ఇది. 

ఈ కథ మొదటి నుంచి చివరివరకూ ఆసక్తికరంగా కొనసాగుతుంది. హత్య .. పోలీసుల విచారణ చుట్టూ ఈ కథ తిరుగుతున్నప్పటికీ, ఎక్కడా అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపించవు.  అలాగే హింస .. రక్తపాతం కూడా సన్నివేశానికి మించి ఉండవు. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించినదే అయినా, ఫ్యామిలీతో కలిసి చూసే కంటెంట్ అనే చెప్పాలి. 

Movie Name: Thalavan

Release Date: 2024-09-10
Cast: Biju Menon ,Asif Ali, Miya George , Anusree , Dileesh Pothan
Director:Jis Joy
Producer: Arun Narayan
Music: Deepak Dev
Banner: Arun Narayan Productions

Rating: 3.00 out of 5

More Reviews