శ్రీసింహా కథానాయకుడిగా 2019లో వచ్చిన 'మత్తువదలరా' సినిమాను యూత్ ఇంకా మరిచిపోలేదు. కామెడీ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ ను చేశారు. 'మత్తు వదలరా 2'గా ఈ సినిమా ఈ రోజున థియేటర్లకు వచ్చింది. వెన్నెల కిశోర్ .. సత్య .. ఫరియా అబ్దుల్లా .. అజయ్ .. రోహిణి ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
హీ టీమ్ (హెడ్ ఆఫ్ ఎమర్జెన్సీ)లో బాబు మోహన్ (శ్రీ సింహా) ఏసుదాసు ( సత్య) ఏజెంట్స్ గా చేరతారు. అదే బ్యాచ్ లో మైఖేల్ (సునీల్) సక్సేనా ( రాజా) నిధి ( ఫరియా అబ్దుల్లా) పనిచేస్తూ ఉంటారు. వీళ్లందరికీ బాస్ గా దీప (రోహిణి) వ్యవహరిస్తూ ఉంటుంది. బాబు మోహన్ - ఏసుదాసు ఒక జట్టుగా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఇద్దరూ కూడా కిడ్నాప్ కేసులను ఎక్కువగా ఒప్పుకుంటూ ఉంటారు. కిడ్నాప్ కాబడినవారిని రక్షిస్తూ .. కిడ్నాప్ చేసినవారిని పట్టిస్తూ ఉంటారు. అయితే డబ్బులో మాత్రం కొంత నొక్కేస్తూ ఉంటారు.
ఇక సిటీలో ఆకాశ్ (అజయ్) డ్రగ్స్ తో కూడిన అక్రమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాడు. ఒక లాడ్జ్ ను నిర్వహిస్తూ .. బెడ్ రూమ్స్ లో కెమెరాలు పెట్టి యువతులను బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అతను నిర్వహించే 'కర్మ హబ్'కి యూత్ స్టార్ 'యువ' (వెన్నెల కిశోర్) ఎక్కువగా వెళుతూ ఉంటాడు. యూత్ లో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఈ నేపథ్యలోనే డబ్బు - అధికారం కలిగిన దామిని కూతురు 'రియా' కిడ్నాప్ చేయబడుతుంది. తమ బాస్ కి తెలియకుండా ఆ కేసును బాబు మోహన్ - ఏసుదాసు ఒప్పుకుంటారు.
అది 2 కోట్ల రూపాయలకు సంబంధించిన కిడ్నాప్ కావడంతో, అందులో ఎంతోకొంత నొక్కేయవచ్చని ఇద్దరూ రంగంలోకి దిగుతారు. అయితే చివరి నిమిషంలో కిడ్నాప్ చేసిన వ్యక్తి .. కిడ్నాప్ అయిన వ్యక్తి ఇద్దరూ మాయమవుతారు. దాంతో బాబు మోహన్ - ఏసుదాసు ఇద్దరూ అయోమయంలో పడతారు. అప్పుడు అసలైన దామిని 'హీ టీమ్' ఆఫీసుకు వచ్చి, తన కూతురు కిడ్నాప్ అయినట్టుగా ఫిర్యాదు చేస్తుంది.
ఇంతకుముందు తమని కలిసిన దామిని .. తాము రక్షించిన ఆమె కూతురు 'రియా' కల్పిత పాత్రలనీ, కిడ్నాప్ అంతా ఒక డ్రామా అని తెలిసి బాబు మోహన్ - ఏసుదాసు నివ్వెరపోతారు. ఎవరు ఎందుకోసం ఈ డ్రామాను ఆడారనేది వాళ్లకి అర్థం కాదు. ఇప్పుడు తమ కళ్లముందున్నది నిజమైన దామిని. ఆమె కూతురు 'రియా' నిజంగానే కిడ్నాప్ అయింది. ఆ అమ్మాయిని తాము రక్షించాలని అనుకుంటారు. అంతలో దీపకి ఒక వీడియో షేర్ అవుతుంది. 'రియా'ను బాబు మోహన్ - ఏసుదాసు కిడ్నాప్ చేస్తున్న వీడియో అది.
అది చూసిన దామిని .. వెంటనే ఆ ఇద్దరినీ పట్టుకోమని దీపవాళ్లతో చెబుతుంది. దాంతో తప్పించుకోవడం కోసం కారు దగ్గరికి పరిగెత్తిన ఇద్దరూ, లోపల రియా డెడ్ బాడీ ఉండటం చూసి బిత్తరపోతారు. రియాను ఎవరు చంపుతారు? ఆ కేసులోకి బాబు మోహన్ - ఏసుదాసు ఎలా లాగబడ్డారు? ఆకాశ్ కీ .. యూత్ స్టార్ యువకి మధ్యనున్న సంబంధం ఏమిటి? ఈ మర్డర్ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనేది మిగతా కథ.
కేవలం డబ్బు కోసం మాత్రమే ఆశపడే .. ఆరాటపడే హీరో .. అతని ఫ్రెండ్ ఇద్దరూ కూడా ఒక మర్డర్ కేసులో చిక్కుకుంటారు. ఆ మర్డర్ కి కారకులు ఎవరు? హీరోను .. అతని స్నేహితుడిని ఇరికించడానికి కారణం ఏమిటి? అందుకోసం వాళ్లు పన్నిన వ్యూహం ఏమిటి? అనేది కథ. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన సినిమా. మొదటి నుంచి చివరివరకూ కూడా కామెడీ టచ్ తోనే సాగుతుంది.
ఈ కథను మనం సీరియస్ గా పట్టించుకో కూడదు .. లాజిక్కులు వెదకకూడదు. సరదాగా నవ్విస్తూ సాగిపోయే ఒక కంటెంట్ ఇది. మొదలైన దగ్గర నుంచి చివరివరకూ నవ్విస్తూనే ఉంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ఈ రెండూ కూడా ఈ కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. హీరో శ్రీ సింహానే అయినా, ఆడియన్స్ దృష్టి అంతా సత్య పైనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఆయనకి దొరికిన ఒక మంచి రోల్ ఇది అని చెప్పుకోవచ్చు. నాన్ స్టాప్ కామెడీతో నవ్వించాడు.
క్లైమాక్స్ లో ఒక వైపున కాల్పులు జరుగుతున్నా, సత్య పాత్ర ద్వారా కామెడీని పిండుకోవడం బాగుంది. ఒక వైపున సునీల్ .. మరో వైపున వెన్నెల కిశోర్ సీన్లో ఉన్నప్పటికీ, కామెడీ పరంగా సత్య చెలరేగిపోయాడు. ఫరియా కాస్త సన్నబడి నాజూకుగా మెరిసింది. కాలభైరవ నేపథ్య సంగీతం ప్రధానమైన బలంగా నిలిచింది. సురేశ్ సారంగం కెమెరా పనితనం .. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ ఓకే. సంభాషణలు బాగున్నాయి .. ముఖ్యంగా సత్య పాత్రకి రాసినవి.
ఈ కథలో లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్స్ .. ఎమోషన్స్ గట్రా ఉండవు. కనిపించేదంతా కామెడీనే. దర్శకుడు ఈ కథను చాలా నీట్ గా చెప్పాడు. తక్కువ పాత్రలతో .. పరిమితమైన లొకేషన్స్ లో కావలసినంత కామెడీని అందించాడు. ఆ కామెడీకి ట్విస్టులతో కూడిన డ్రామా కూడా తోడవడంతో ఈ కంటెంట్ ఆడియన్స్ ను కదలకుండా కూర్చోబెట్టేస్తుంది. కాసేపు హాయిగా నవ్వుకోవాంటే ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే సినిమానే ఇది.
'మత్తు వదలరా 2' - మూవీ రివ్యూ!
Mathu Vadalara 2 Review
- 2019లో వచ్చిన 'మత్తు వదలరా'
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సీక్వెల్
- అందంగా మెరిసిన ఫరియా అబ్దుల్లా
- సత్య కామెడీ హైలైట్
- యూత్ కీ .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్
Movie Name: Mathu Vadalara 2
Release Date: 2024-09-13
Cast: Sri Simha, Faria Abdulah, Sathya, Vennela Kishore, Suneel, Rohini
Director:Ritesh Rana
Producer: Pedamallu Chiranjeevi - Hemalatha
Music: Kalabhairava
Banner: Mythri Movies
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer