'రఘు తాత' (జీ 5) మూవీ రివ్యూ!

Raghu Thatha

Raghu Thatha Review

  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'రఘు తాత'
  • 1960ల కాలంలో నడిచే కథ 
  • ఆకట్టుకోలేకపోయిన కథాకథనాలు
  • వినోదపరమైన అంశాలకు దూరం 
  • సాదాసీదాగా కనిపించే కంటెంట్

తమిళంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా రూపొందిన సినిమా 'రఘు తాత'. హోంబలే వంటి పెద్ద బ్యానర్ నిర్మించిన ఈ సినిమాకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా అక్కడి థియేటర్లలో విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు జీ 5లో అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్ తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ కథ 1960లలో నడుస్తుంది .. కయల్ (కీర్తి సురేశ్) ఒక మారుమూల గ్రామంలో .. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆధునిక ఆలోచనలు .. స్వతంత్ర భావాలు కలిగిన యువతి. కేపీ పేరుతో ఆమె కవితలు .. కథలు రాస్తూనే, ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది. స్త్రీలు బలహీనులు కాదు .. పురుష ఆధిపత్యాన్ని సహించవలసిన అవసరం లేదు అనేది ఆమె ఉద్దేశం. మాతృభాషకి ఏం తక్కువయిందని హిందీ భాషను ఆశ్రయించాలి అనేది ఆమె వాదన. 

ప్రభుత్వం ప్రజలపై బలవంతంగా హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తుందనీ, ఇష్టమైతే నేర్చుకోవడంలో తప్పులేదనేది ఆమె అభిప్రాయం. ఆమె అభిప్రాయాలకు విలువనిచ్చేది ఆమె తాత రఘు ఉత్తమన్. మనవరాలంటే ఆయనకి ప్రాణం. ఆధునిక భావాలు .. ఆదర్శ భావాలు .. భాషాభిమానం అంటూ ఆమె పెళ్లిని పక్కన పెడుతూ ఉండటం తల్లిదండ్రులకు అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది. 

అలాంటి సమయంలోనే కయల్ కి సెల్వన్ తారసపడతాడు. ఆమెతో కలిసి రోజూ బస్సులో  ప్రయాణం చేస్తూ .. ఆమె రచనలను మెచ్చుకుంటూ సాన్నిహిత్యాన్ని పెంచుకుంటాడు. అలాంటి సమయంలోనే ఆమె అన్నయ్య శంకర్, భానుమతి అనే వేరే కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు. పెద్దల సమక్షంలో శంకర్ - భానుమతిలకు పెళ్లి చేయాలని తండ్రి నిర్ణయించుకుంటాడు. సాధ్యమైనంత త్వరగా కయల్ కు సంబంధం చూసి, రెండు పెళ్లిళ్లను ఒకేసారి జరిపించాలని భావిస్తాడు. 

రఘు తాతకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అతణ్ణి హాస్పిటల్లో చూపిస్తారు. అతనికి వ్యాధి నిర్ధారణ చేసిన వైద్యులు, ఆయన ఎక్కువకాలం బ్రతకడని చెబుతారు. ఆ విషయం రఘు తాత గ్రహిస్తాడు. కయల్ పెళ్లి చూసిన తరువాత తాను చనిపోయినా ఫరవాలేదని నిర్ణయించుకుంటాడు. దాంతో కయల్ .. సెల్విన్ ప్రేమను అంగీకరిస్తుంది. అతణ్ణి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే విషయాన్ని ఇంట్లో చెబుతుంది. దాంతో చకచకా ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటాయి.

ఒక రోజున సెల్విన్ ప్రవర్తనపై కయల్ కి అనుమానం వస్తుంది. దాంతో అతను ఇంట్లో లేని సమయం చూసి వెళుతుంది. సెల్విన్ తల్లికి వేరే కారణం చెప్పి అతని రూంలోకి వెళుతుంది. అక్కడ అతని డైరీని ఓపెన్ చేస్తుంది. తన భావాలకు పూర్తి విరుద్ధమైన భావాలతో అతను ఉన్నాడనే విషయం కయల్ కి అర్థమవుతుంది. పైగా పెళ్లి తరువాత తనని ఎలా నియంత్రించాలా అనే విషయంలో అతను ఎంత క్లారిటీతో ఉన్నాడనే విషయం స్పష్టమవుతుంది. అప్పుడు కయల్ ఏం చేస్తుంది? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేది కథ. 

స్త్రీలు .. అభ్యుదయం .. ఆదర్శం .. సమానత్వం .. భాషాభిమానం ..  ఇలాంటి అంశాలను టచ్ చేస్తూ గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కథతో వచ్చినదే ఈ సినిమా. ఈ సినిమా టైటిల్ 'రఘు తాత'. అందువలన తాత - మనవరాలు సెంటిమెంట్ ఒక రేంజ్ లో ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఆశించిన స్థాయి ఎమోషన్స్ ఆ పాత్రల మధ్య కనిపించవు. అంత బాండింగ్ ను దర్శకుడు చూపించలేకపోయాడు. కథకి .. టైటిల్ కి మధ్య సంబంధం తక్కువగా కనిపిస్తుంది.

వినోదపరమైన ఆశలు లేకుండా కథ చాలా సీరియస్ గా .. నిదానంగా నడుస్తూ ఉంటుంది. కీలకమైన సన్నివేశాలు కూడా అంతగా కనెక్ట్ కావు. భాషాభిమానంతో కయల్ చేసే పోరాటం కూడా బలం లేనిదిగా కనిపిస్తుంది.  నిజానికి ఒక డాక్యుమెంటరీ చూసిన ఫిలింగ్ కలిగేదే. అయితే ఈ కథ నడిచే లొకేషన్స్ చాలా అందంగా కనిపిస్తాయి. ఆ పల్లె అందాలను చూస్తూ ఉండిపోవచ్చు. ఆ లొకేషన్స్ నేపథ్యంలో నడిచే కథ .. సన్నివేశాలు మాత్రం తేలిపోతుంటాయి.

యామినీ యజ్ఞమూర్తి ఫొటోగ్రఫీ బాగుంది. ఏ మాత్రం అవకాశం దొరికినా పల్లెలోని ప్రకృతి అందాలను సన్నివేశాలకు జోడించడంలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది. సీన్ రోల్డన్ నేపథ్య సంగీతం .. సురేశ్ ఎడిటింగ్ కథకు తగినట్టుగానే అనిపిస్తాయి.1960 కాలానికి చెందిన వాతావరణాన్ని తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అయితే కథ నేపథ్యానికి .. ఆర్టిస్టుల సామర్థ్యానికి తగిన సన్నివేశాలను అల్లుకోలేకపోయాడు. ప్రధానమైన కథకు వినోదాన్ని జోడించలేకపోయాడు. అందువల్లనే ఇది ఓ సాదాసీదా కథగా అనిపిస్తుందంతే. 

Movie Name: Raghu Thatha

Release Date: 2024-09-13
Cast: Keerthy Suresh, M S Bhaskar, Devadarshini, Ravindra Vijay, Anandsami
Director:Suman Kumar
Producer: Vijay Kiragandur
Music: Sean Roldan
Banner: Hombale Films

Rating: 2.50 out of 5

Trailer

More Reviews