రావు రమేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడంలో ఆయన సిద్ధహస్తుడు. ఒక వైపున విలన్ గా .. మరో వైపున ఇతర కీలకమైన పాత్రలలోను మెప్పిస్తూ వెళుతున్న ఆయన, తానే ప్రధాన పాత్రగా 'మారుతీనగర్ సుబ్రమణ్యం' చేశాడు. ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఏమిటనేది ఇప్పుడు చూద్దాం. 

సుబ్రమణ్యం (రావు రమేశ్) మధ్యతరగతి కుటుంబీకుడు. భార్య రాణి (ఇంద్రజ) కొడుకు అర్జున్ (అంకిత్) తో కలిసి మారుతీనగర్ లో నివసిస్తూ ఉంటాడు. సుబ్రమణ్యం ప్రభుత్వ ఉద్యోగం చేయవలసినవాడు. అయితే అందుకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్ లో ఉండటం వలన, ఆయన కోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తూ ఇంటిపట్టునే ఉండిపోతాడు. మరో ఉద్యోగం చేయడం ఆయనకి ఇష్టం ఉండదు. దాంతో పాతికేళ్లుగా తన జాబ్ తోనే రాణి ఆ కుటుంబాన్ని నడుపుతూ ఉంటుంది.  

ఇక సుబ్రమణ్యం కొడుకు అర్జున్ పై సినిమాల ప్రభావం ఎక్కువ. తన తండ్రి అల్లు అరవింద్ అనీ .. విలాసవంతమైన జీవితాన్ని అలవాటు చేయకూడదనే ఉద్దేశంతో ఆయన తనని సుబ్రమణ్యం దగ్గర వదిలాడని భావిస్తుంటాడు. రేపో మాపో తన అసలు తండ్రి వచ్చి తనని తీసుకుని వెళతాడని ఎదురుచూస్తూ, 'అల వైకుంఠపురములో' కథను ఊహించుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో సుబ్రమణ్యం ఎంతగా చెప్పినా ప్రయోజనం లేకుండా పోతుంది.    
   
సుబ్రమణ్యం ఇంటికి దగ్గరలోనే భాస్కర్ (హర్షవర్ధన్) ఉంటాడు. అతని కూతురు కాంచన (రమ్య) హాస్టల్ నుంచి వస్తుంది. తొలిచూపులోనే అర్జున్ ఆమెపై మనసు పారేసుకుంటాడు. తమ మనసులు కలుస్తాయా లేదో చూద్దామని భావించి డేటింగ్ చేయడం మొదలుపెడతారు. సుబ్రమణ్యం అత్తగారు చనిపోవడంతో, పుణ్యతీర్థాలలో ఆమె అస్థికలు కలపడం కోసం రాణి వెళుతుంది. భార్య ఊళ్లో లేకపోవడంతో సిగరెట్ - మందు తాగే విషయంలో  సుబ్రమణ్యానికి స్వేచ్ఛ లభిస్తుంది. 

సుబ్రమణ్యం మందు తాగడానికి కారణాలు ఉన్నాయి. పాతికేళ్లుగా ఖాళీగా ఉన్నాననే ఒక గిల్ట్ ఆయనకి ఉంటుంది. ఎప్పుడూ భార్యను డబ్బు అడగలేక ఊళ్లో వాళ్ల దగ్గర చేసిన అప్పులు ఉన్నాయి. గతంలో తాను మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన సొంత ఇల్లు అలాగే ఉండిపోయింది.  ఇన్ని సమస్యల నుంచి ఎలా బయటపడాలా అని ఆయన తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో సుబ్రమణ్యం అకౌంటులో 10 లక్షల పడతాయి.

తన ఎకౌంటులో అంత డబ్బు ఎవరు వేశారు? అని సుబ్రమణ్యం ఆలోచన చేస్తూ ఉండగా, వడ్డీ వ్యాపారి గోవిందరాజులు (అజయ్) వస్తాడు. అతని మాటలు కోపాన్ని తెప్పించడంతో వెంటనే లక్షరూపాయలు ట్రాన్స్ ఫర్ చేస్తాడు. అతని ద్వారా విషయం తెలిసి, తమ అప్పు కూడా తీర్చమంటూ మరికొంతమంది సుబ్రమణ్యం ఇంటిమీద పడతారు. అలా అకౌంటులోని 7 లక్షలు ఖర్చు అవుతాయి. ఆ డబ్బు ఆయన ఎకౌంటులోకి ఎలా వస్తుంది? అది ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతుంది? కాంచనతో అర్జున్ వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ. 

ఏదైనా ఒక విషయంపై ఒక వ్యక్తి బలంగా నిలబడినప్పుడు, ఆ విషయంలో అతను సక్సెస్ అయితే దానిని పట్టుదల అంటారు. సక్సెస్ కాకపోతే మొండితనం అంటారు. ఈ కథ అంతా కూడా ఈ లైన్ పైనే నడుస్తుంది. జీవితంలో గెలిచినవాడి మాట ఎవరైనా వింటారు .. గెలుపు కోసం ఎదురుచూసేవాడి మాటను మాత్రం ఎవరూ పట్టించుకోరు. పది తరాలుగా కష్టపడి సంపాదించుకున్న పరువైనా, పది రూపాయలు అప్పు అడగ్గానే పడిపోతుంది అనే అంశాన్ని కూడా కలుపుకుని ఈ కథ నడుస్తుంది. 

ఈ కథలో హీరో .. హీరోయిన్ ఉండరు. లవ్ .. రొమాంటిక్ సాంగ్స్ ఉండవు. ఫైట్లు అసలే కనిపించవు. మరి ఏముంటాయి? అంటే, వాస్తవానికి దగ్గరగా అనిపించే జీవితం ఉంటుంది. మన కిటికీలో నుంచి పక్కింట్లోకి తొంగి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. పైన చెప్పిన అంశాలు ఏవీ లేకపోయినా, వినోదపరమైన అంశాలకు లోటు లేకుండా హాయిగా నవ్విస్తూ ముందుకు తీసుకుని వెళుతుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఆసక్తికరమైన మలుపులతో సాగుతూ, ఆడియన్స్ ను మరింత ఎంటర్టైన్ చేస్తాయి.  
  
సినిమా చూస్తున్నంత సేపు మనకి రావు రమేశ్ కాకుండా, 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' కనిపిస్తుంటాడు. అంకిత్ పోషించిన అర్జున్ పాత్రను డిజైన్ చేసిన తీరు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రలకి న్యాయం చేశారు. బాల రెడ్డి ఫొటోగ్రఫీ .. కల్యాణ్ నాయక్ నేపథ్య సంగీతం .. నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ ఓకే.   

నిజానికి ఇప్పుడున్న ట్రెండులో ఇలాంటి ఒక సినిమా చేయడం సాహసమేనని చెప్పాలి. కథపై బలమైన నమ్మకం ఉండటం వల్లనే మేకర్స్ ఇంతటి సాహసం చేశారనే విషయం ఈ సినిమా చూసిన తరువాత అర్థమవుతుంది. కథ .. కథనాల అల్లిక బాగుంది. వినోదపరమైన అంశాల బిగింపు బాగుంది. ఏ సన్నివేశం తన పరిధి దాటి వెళ్లడం కనిపించదు. కుటుంబ సమేతంగా చూస్తూ హాయిగా నవ్వుకునే సినిమాల జాబితాలో 'మారుతీ నగర్ సుబ్రమణ్యం' మనకి తప్పకుండా కనిపిస్తాడు.