'కళింగ' .. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన సినిమా. ధ్రువ వాయు ఈ సినిమాలో కథానాయకుడు .. అతనే ఈ సినిమా దర్శకుడు కూడా. ప్రజ్ఞా నయన్ ఈ సినిమాతో కథానాయికగా పరిచయమైంది. సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అది అడివిని ఆనుకుని ఉన్న ఒక గ్రామం. ఆ గ్రామంలోని యువకుడే లింగా .. అతను ఓ అనాథ. ఆ గ్రామస్తులు అతణ్ణి ఎంతో ఆత్మీతంగా చూసుకుంటూ ఉంటారు. అతని స్నేహితుడే మూర్తి (లక్ష్మణ్). లింగా - పద్దూ చాలా కాలంగా ప్రేమించుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని గురించి లింగా పద్దూ తండ్రినే నేరుగా అడుగుతాడు. అప్పుడు అతని ఆస్తిపాస్తులను గురించి పద్దూ తండ్రి ప్రస్తావిస్తాడు.
ఆ ఊరు పెద్దమనిషి ('ఆడుకాలం' నరేన్) దగ్గర లింగా తాత కాలం నుంచి రెండు ఎకరాల పొలం తాకట్టులో ఉంటుంది. ఆ పొలాన్ని విడిపించుకుంటే, తన కూతురు పద్దూను ఇచ్చి పెళ్లి చేస్తానని ఆమె తండ్రి అంటాడు. ఆ గ్రామపెద్ద కనుసైగలతో ఆ గ్రామమంతా నడచుకుంటూ ఉంటుంది. అతనికి ఎదురుచెప్పే ధైర్యం ఎవరూ చేయరు. కొన్ని రోజులుగా ఆ గ్రామంలో కొన్ని భయానక సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
ఆ గ్రామస్తులలో కొందరు తమ చెవులను .. చేతులను కోసుకుని తినేస్తూ ఉంటారు. మరికొందరు దారుణంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అందుకు కారకుడిగా 'కళింగ'తో ముడిపడిన 'అసుర భక్షి' అనే దుష్టశక్తి పేరు వినిపిస్తుంది. 18వ శతాబ్దంతో ముడిపడిన అతని కథను గురించి, 1922లో జరిగిన ఒక సంఘటన గురించి అంతా చెప్పుకుంటూ ఉంటారు. 'అసుర భక్షి' నుంచి తమ గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచన చేస్తుంటారు.
అలాంటి పరిస్థితులలో లింగా నేరుగా గ్రామపెద్ద దగ్గరికి వెళ్లి, తాకట్టులో ఉన్న తన పొలాన్ని అప్పగించమని అడుగుతాడు. అతని దగ్గర తన తాత చేసిన అప్పుకి, అసలు కంటే రెట్టింపే ముట్టిందని అంటాడు. తన పొలం కాగితాలు ఇవ్వనిదే కదిలేది లేదని తేల్చిచెబుతాడు. అతని రెండు ఎకరాల పొలాన్ని ప్రస్తుతం ఇవ్వలేననీ, అందుకు బదులుగా 'సంస్థానం' సమీపంలోని 4 ఎకరాలను రాసిస్తానని గ్రామపెద్ద అంటాడు. అందుకు లింగా అంగీకరిస్తాడు.
గ్రామపెద్ద అలా మాట్లాడటం పట్ల అతని తమ్ముడు 'బాలి' ఆలోచనలో పడతాడు. అతని ఉద్దేశం అర్థం కావడం లేదని అన్నయ్యతో అంటాడు. సంస్థానం దగ్గరికి వెళ్లినవారిలో ఇంతవరకూ ఎవరూ వెనక్కి తిరిగి రాలేదనీ, అలాగే తన పొలం కోసం అక్కడికి వెళ్లే లింగా కూడా తిరిగిరాడని బాలీతో అన్నయ్య అంటాడు. కళింగ ఎవరు? అడవిలో ఉన్న ఆ 'సంస్థానం' ఎవరిది? అక్కడికి వెళ్లినవారు ఎందుకు తిరిగి రాలేదు. తన 4 ఎకరాల పొలం కోసం వెళ్లిన లింగాకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? పద్దూతో అతని పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.
18వ శతాబ్దం నుంచి ఈ కథ మొదలవుతుంది. 1922వ సంవత్సరాన్ని టచ్ చేస్తూ, ప్రస్తుత కాలంలోకి వస్తుంది. తాను మనసుపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి కథానాయకుడు ఆ గ్రామపెద్దతో .. అసురభక్షి అనే దుష్టశక్తితో పోరాడవలసి వస్తుంది. ఈ విషయంలో అతను ఎదుర్కొనే పరిణామాలే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. అయితే అందుకు సంబంధించిన సన్నివేశాలను ఏ మాత్రం కనెక్ట్ చేయలేకపోయారు.
దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం లేకపోయినా, ఇంట్రెస్టింగ్ గా అనిపించే జోనర్ కనుక ఆడియన్స్ లో ఆసక్తి ఉంటుంది. దట్టమైన అడవి .. రాజులు .. నిధులు .. దెయ్యాలతో సంబంధించిన అంశాలు భయపెడుతూనే కుతూహలాన్ని రేపుతాయి. కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నాలేవీ జరగలేదు. కథ చెబుతున్నప్పుడు తెరపై చూపించిన యానిమేషన్ వర్క్ మాత్రం బాగుంది. అలా కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు ఆడియన్స్ ను అక్కడ హోల్డ్ చేయలేకపోయాడు.
ఇలాంటి కథలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడంలో విలనిజం ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఆడుకాలం నరేన్ వంటి పవర్ఫుల్ విలన్ ను పెట్టుకుని, అతని పాత్రను నామమాత్రం చేసి తేల్చేశారు. కథానాయకుడికి ఇది మొదటి సినిమా అనుకుంటా. అతని నటన అంతంత మాత్రం అన్నట్టుగా సాగుతుంది. ఇక గ్రామీణ నేపథ్యంలో హీరో - హీరోయిన్స్ మధ్య చక్కని పాటలను నడిపించవచ్చు. కానీ అక్కడా ప్రేక్షకుడికి నిరాశనే ఎదురవుతుంది.
ఇక్కడ హీరోనే దర్శకుడు .. ఈ రెండు విషయాలలోనూ అతను పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. పెర్ఫెక్ట్ కంటెంట్ ను తెరపై ప్రెజెంట్ చేయలేకపోయాడు. నిర్మాణ విలువలు ఫరవాలేదు. విష్ణు శేఖర - అనంత్ నారాయణన్ సంగీతం ఫరవాలేదు. అక్షయ్ రామ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఫారెస్టు నేపథ్యంలోని సన్నివేశాలను హృద్యంగా ఆవిష్కరించాడు. నిజానికి 'కళింగ' మంచి ఇంట్రెస్టింగ్ టైటిల్. కానీ ఆ స్థాయిలో కథను .. అందుకు తగినట్టుగా పాత్రలను మలచుకోకపోవడం, ఆసక్తికరమైన దృశ్యాలను ఆవిష్కరించలేకపోవడం లోపంగా అనిపిస్తుంది.
'కళింగ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Kalinga Review
- సెప్టెంబర్ 13న విడుదలైన 'కళింగ'
- సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- కొత్తదనం లేని కథాకథనాలు
- ఆకట్టుకోలేకపోయిన కంటెంట్
Movie Name: Kalinga
Release Date: 2024-10-04
Cast: Dhruva Vayu, Pragnya Nayan, Adukalam Naren, Lakshman
Director:DhruvaVayu
Producer: Deepthi - Pruthvi
Music: Vishnu Sekharaa
Banner: Big Hit Produtions
Review By: Peddinti
Rating: 2.00 out of 5
Trailer