'మాన్వత్ మర్డర్స్' (సోనీలివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Manvat Murders

Manvat Murders Review

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో 'మాన్వత్ మర్డర్స్' 
  • 8 ఎపిసోడ్స్ గా రూపొందిన సిరీస్
  • ఇంట్రెస్టింగ్ గా సాగే మొదటి 5, మరియు చివరి ఎపిసోడ్ 
  • డల్ గా సాగే 6 - 7 ఎపిసోడ్స్
  • సహజత్వానికి దగ్గరగా కథాకథనాలు 
  • పాత్రలను మలిచిన తీరు హైలైట్  

మరాఠీలో 'మాన్వత్ మర్డర్స్' వెబ్ సిరీస్ రూపొందింది. ఆశిష్ అవినాష్ దర్శకత్వం వహించిన సిరీస్ ఇది. 1970లలో మహారాష్ట్రలోని 'మాన్వత్'లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ నిర్మితమైంది. 8 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్, ఈ నెల 4వ తేదీ నుంచి వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

అది మహారాష్ట్రలోని 'మాన్వత్' గ్రామం. అక్కడ 8 నెలలలో 7 మర్డర్స్ జరుగుతాయి. చనిపోయిన వాళ్లంతా ఆడపిల్లలు .. మహిళలు. ఎవరు చంపుతున్నారు? ఎందుకు చంపుతున్నారు? అనేది ఎవరికీ అర్థం కాదు. దాంతో పొద్దుపోతే బయటికి వెళ్లడానికి మహిళలు భయపడిపోతుంటారు. హంతకులను పోలీసులు పట్టుకోకపోవడం విమర్శలకు దారితీస్తుంది. దాంతో స్పెషల్ ఆఫీసర్ గా ఆ ఊరికి రమాకాంత్ కులకర్ణి (అశుతోష్ గోవారికర్) వస్తాడు. 
  
సాధ్యమైనంత త్వరగా హంతకులను పట్టుకోవాలనే ఉద్దేశంతో, అక్కడి పోలీస్ స్టేషన్ లోని సిబ్బందిని కులకర్ణి పరుగులు పెట్టిస్తాడు. హత్యలు ఎక్కడెక్కడ జరిగాయి? ఏ పద్ధతిలో జరిగాయి? శవాలు ఎక్కడ కనిపించాయి? అనే విషయాలను తెలుసుకుంటూ ఇన్వెస్టిగేషన్ లో కులకర్ణి మునుకు వెళుతూ ఉంటాడు. ఆఫీసర్స్ హోదాలో అక్కడ పనిచేసే శుక్లా - పరాంజీ మధ్య మనస్పర్థలు ఉన్నప్పటికీ, కులకర్ణి అంటే ఉన్న భయం వలన జాగ్రత్తగా మసలుకుంటూ ఉంటారు. 

ఆ గ్రామంలో శ్రీమంతులుగా ఉత్తమ్ రావు - శ్రీరంగం ఉంటారు. ఉత్తమ్ రావుకి ఇద్దరు భార్యలు. రెండో భార్య రుక్మిణికి సంతానం ఉండదు. ఈ విషయంలో ఆమె చాలా అసంతృప్తిగా ఉంటుంది. ఆమెకి 'సమింద్రి' అనే ఒక చెల్లెలు ఉంటుంది. సమింద్రిపై ఉత్తమ్ రావుకి కన్ను ఉంటుంది. ఈ విషయంలో ఆమెపై రుక్మిణి కోపంగా ఉంటుంది. ఉత్తమ్ రావు నాటుసారా బిజినెస్ చేస్తూ ఉంటాడు. ఆ వ్యవహారాలను సమింద్రినే దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. 

ఇక శ్రీరంగం విషయానికి వస్తే, సొంత ఊళ్లో అతనికి పొలాలు .. వ్యాపారాలు ఉంటాయి. ఒకటి రెండు శవాలు ఆయన పొలాల్లో దొరుకుతాయి. అంతే కాకుండా ఆయన పొలంలో నిధులు ఉన్నాయనీ, వాటిని బయటికి తీయడానికి క్షుద్ర పూజలు చేయించాడనే గుసగుసలు వినిపిస్తూ ఉంటాయి. 'కాజూ' అనే ఒక క్షుద్ర మాంత్రికుడి పేరు తెరపైకి వస్తుంది. దాంతో అతణ్ణి పట్టుకోవడానికి కులకర్ణి టీమ్ రంగంలోకి దిగుతుంది.      

హత్య చేసిన తరువాత శవాల నుంచి హంతకులు రక్తాన్ని సేకరించినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇది కచ్చితంగా క్షుద్ర మాంత్రికుల పనే అనే విషయం కులకర్ణికి అర్థమవుతుంది. దాంతో అతను 'కాజూ'ని తనదైన స్టైల్లో విచారణ జరుపుతారు. అప్పుడు గణపతి పేరు తెరపైకి వస్తుంది. గణపతి ఎవరు? జరిగిన హత్యలకు అతనికి సంబంధం ఉంటుందా? కులకర్ణి ఏం చేస్తాడు? ఆ ఏడు హత్యలు ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అనేది కథ.

1970లలో మహారాష్ట్రలోని 'మాన్వత్'లో జరిగిన యథార్థ సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన వెబ్ సిరీస్ ఇది. ఈ కథను 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. మొదటి ఐదు ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతాయి. 6-7 ఎపిసోడ్స్ కాస్త డల్ గా అనిపిస్తాయి. 8వ ఎపిసోడ్ కరెక్టుగా వెళుతుంది. హత్యలకు సంబంధించిన అంశాలను రివీల్ చేసే ఎపిసోడ్ ఇది. 70లలో జరిగే కథ కావడం వలన, కథనాన్ని కాస్త స్లోగా నడిపించారేమో అనిపిస్తుంది.

6-7 ఎపిసోడ్స్ లో కథనం జోరు తగ్గినప్పటికీ, దర్శకుడు తాను చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం మనకి కనిపిస్తుంది. ఇక ఈ సిరీస్ లో పాత్రల సంఖ్య కాస్త ఎక్కువే. అయినప్పటికీ ఎక్కడా కన్ఫ్యూజ్ చేయకుండా ఆ పాత్రలను కనెక్ట్ చేశారు. ప్రతి పాత్రకి ప్రత్యేకత ఉంటుంది .. వెంటనే రిజిస్టర్ అవుతాయి. 5 ఎపిసోడ్స్ వరకూ పతి ఎపిసోడ్ నెక్స్ట్ ఏం జరగనుందనే కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. కాకపోతే హింస ఎక్కువగానే కనిపిస్తుంది. 

ఇది క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ, దర్శకుడు ఈ సిరీస్ ను సస్పెన్స్ తో ముందుకు తీసుకుని వెళుతూ .. డ్రామాను నడిపించడంలో సక్సెస్ అయ్యాడు.సత్యజిత్ శోభ - శ్రీరామ్ ఫొటోగ్రఫీ, సాకేత్ కనిత్కర్ నేపథ్య సంగీతం మెప్పిస్తాయి.ఫైసల్ ఎడిటింగ్ బాగుంది. 6 -7 ఎపిసోడ్స్ అనుకున్న స్థాయిలో పరిగెత్తవు. ఆ సమయంలో కాస్త ఓపిక పడితే, క్రైమ్ థ్రిల్లర్ కథలు నచ్చేవారికి ఈ సిరీస్ కూడా నచ్చుతుంది. 

Movie Name: Manvat Murders

Release Date: 2024-10-04
Cast: Ashutosh Gowariker, Sai Tamhankar, Makarand Anaspure, Sonali Kulkarni
Director:Ashish Avinash Bende
Producer: Mahesh Kothare - Addinath
Music: Saket Kanetkar
Banner: Storyteller's Nook

Rating: 3.00 out of 5

Trailer

More Reviews