'కలి' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Kali

Kali Review

  • ఈ నెల 4న థియేటర్లకు వచ్చిన సినిమా
  • 17వ తేదీ నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్ 
  • ఆత్మహత్యల నేపథ్యంలో నడిచే కథ 
  • వినోదపరమైన అంశాలకు దూరంగా కనిపించే కంటెంట్
  • ఆలోచింపజేసే సందేశం 

చాలా తక్కువ బడ్జెట్ లో .. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో .. దాదాపు సింగిల్ లొకేషన్ లోనే రూపొందే ప్రయోగాత్మక చిత్రాలు అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి. అలాంటి ఒక సినిమాగా 'కలి' కనిపిస్తుంది. ఈ నెల 4వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 17వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.   

శివరామ్ (ప్రిన్స్) ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉంటాడు. భార్య వేద (నేహా కృష్ణ) .. ఓ కూతురు .. ఇదే అతని కుటుంబం. తల్లిదండ్రులను కోల్పోయిన శివరామ్ శ్రీమంతుల కుటుంబానికి చెందినవాడే. అయితే అతని అతి మంచితనం వలన, ఆస్తిపాస్తులు తరిగిపోతూ వస్తుంటాయి. ఈ విషయంలో భార్య .. అత్తమామలు ఎంతగా చెప్పినా అతను వినిపించుకోడు. 

శివరామ్ మంచితనాన్ని ఆసరాగా చేసుకుని అందరూ మోసం చేస్తుంటారు. ఎవరి స్వార్థం కోసం వారు అతణ్ణి ఉపయోగించుకుంటూ ఉంటారు. వారి స్వరూప స్వభావాలు మారిపోతుండటం చూసి అతనికి జీవితంపై విరక్తి కలుగుతుంది. అలాంటి పరిస్థితుల్లోనే, ఇక అతనితో కలిసి జీవించడం తన వలన కాదని, బిడ్డను తీసుకుని భార్య పుట్టింటికి వెళుతుంది. ఆమె కూడా తనని అర్థం చేసుకోకపోవడం అతణ్ణి మరింత బాధిస్తుంది. 

దాంతో శివరామ్ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బలమైన ఆ సంకల్పం కారణంగా అతని ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి శివరామ్ ఉలిక్కిపడతాడు. తనకి అందరూ కనిపిస్తున్నారు .. అందరి మాటలు తనకి వినిపిస్తున్నాయి. అవన్నీ చూస్తూ .. వింటూ తాను ఎప్పటిలానే బాధపడుతూ ఉండాలి. ఇక అలాంటప్పుడు తాను చనిపోవడం వలన ప్రయోజనం ఏముంది? అనుకుని ఆవేదన చెందుతాడు. 

అప్పుడు 'కలి' ఓ సాధారణ యువకుడి రూపంలో అక్కడికి వస్తాడు. శివరామ్ అనుకుంటున్నట్టుగా అతను చనిపోలేదనీ, మరో అరగంటలోగా అతని శరీరంలోకి అతను ప్రవేశించకపోతే నిజంగానే చనిపోయినట్టు అవుతుందని 'కలి' చెబుతాడు. కాలం .. ధర్మంతో ముడిపడిన ఒక గేమ్ తనతో ఆడి గెలిస్తే, అందుకు తాను సహకరిస్తానని అంటాడు. శివరామ్ ఆ గేమ్ గెలుస్తాడా? తన శరీరంలోకి తాను ప్రవేశించగలుగుతాడా? అనేది కథ. 

ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్. ప్రధానమైన కథ .. ఒకే ఇంట్లో రెండు పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది. ఒకరు సాధారణ మానవుడు .. మరొకరు మానవుడి రూపంలో వచ్చిన 'కలి'పురుషుడు.  మరో రెండు మూడు పాత్రలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. సన్నివేశాలు .. మలుపులు కంటే కూడా సంభాషణలు ఎక్కువ. ఈ మాటలే ఆలోచింపజేసేలా సాగుతూ ఉంటాయి.

 జీవితంలో ఇక ఈ సమస్యలను ఎదుర్కోవడం తమ వలన కాదని చాలామంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. తమ కష్టాలకు పరిష్కారం ఆత్మహత్యనే అని భావిస్తూ అందుకు పాల్పడుతుంటారు. అలా సూసైడ్ చేసుకోవాలనుకున్న ఒక యువకుడి కథ ఇది. అయితే చావడం కంటే బ్రతకడమే బెటర్ అని హీరో అనుకునేలా 'కలి' పురుషుడు చేయడమే ఈ కథలోని ప్రధానమైన అంశం. 

ఈ కాలంలో యువత ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా చేయడం వలన, వాళ్లను నమ్ముకున్న వారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అనేది దర్శకుడు ఎంత సింపుల్ గా చూపించాడో .. అంతే బలంగా చెప్పాడు. ఈ కథకు సన్నివేశాల కంటే సంభాషణలే ప్రధానమైన బలం అని చెప్పాలి. లాజికల్ గా .. ఆలోచింపజేసేలా ఈ సంభాషణలు కొనసాగుతూ  ఉంటాయి. నిజమే కదా అనిపిస్తూ ఉంటుంది. 

ఇది రెగ్యులర్ ఫార్మేట్ లో వచ్చిన సినిమా కాదు. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు గట్రా ఏమీ ఉండవు. "అతి మంచితనం హానికరం ..  ఈ సమాజంలో నువ్వు బ్రతకాలంటే ఎదుటివాడిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి .. ఇప్పుడు మృగాలు అడవుల్లో కంటే సమాజంలోనే ఎక్కువగా ఉన్నాయి .." వంటి మాటలు మనసును పట్టుకుంటాయి. శివ శేషు టేకింగ్ .. నిశాంత్ కటారి - రమణ జాగర్లమూడి  ఫొటోగ్రఫీ .. జేబీ నేపథ్య సంగీతం కంటెంట్ కి మరింత బలాన్ని చేకూర్చాయి.

సినిమా ప్రధానమైన ఉద్దేశం వినోదాన్ని పంచడమే. అయితే అప్పుడప్పుడు కొన్ని ఆలోచింపజేసే కథలు వస్తుంటాయి. అప్పుడు వినోదాన్ని పక్కన పెట్టేసి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అలా అర్థం చేసుకోవలసిన పాయింటుతో వచ్చిన సినిమా ఇది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒకసారి ఆలోచించండి .. అనే ఉద్దేశంతో రూపొందించిన ఈ సినిమా, ఒక మంచి ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. 

Movie Name: Kali

Release Date: 2024-10-17
Cast: Prince, Naresh Agasthya, Neha Krishna, CVL, Madhumani, kedar Shankar
Director:Shiva Seshu
Producer: Leela Gowtham Varma
Music: JB
Banner: Rudra Creations

Rating: 2.50 out of 5

Trailer

More Reviews