శోభిత ధూళిపాళ్ల ప్రధానమైన పాత్రను పోషించిన 'లవ్ .. సితార' సినిమా, సెప్టెంబర్ 27వ తేదీన 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఈ సినిమా తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. వందనా కటారియా దర్శకత్వం వహించిన ఫ్యామిలీ డ్రామా ఇది. రాజీవ్ సిద్ధార్థ .. సోనాలి కులకర్ణి .. జయశ్రీ .. వర్జీనియా .. కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
సితార (శోభిత ధూళిపాళ్ల) ఇంటీరియర్ డిజైనర్. అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ్) ఓ ఖరీదైన హోటల్లో చెఫ్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అర్జున్ తన తండ్రికి కాల్ చేసి, సితారతో తన పెళ్లి గురించిన విషయం చెబుతాడు. ఇక సితార తన స్నేహతురాలైన అంజలిని తీసుకుని, కేరళలోని సొంత ఊరుకు వెళుతుంది.
సితార అమ్మమ్మ .. ఆమె తల్లిదండ్రులు లత - గోవింద్ అక్కడ నివసిస్తూ ఉంటారు. అర్జున్ తో తన ప్రేమ గురించి .. పెళ్లి నిర్ణయం గురించి ఆమె వాళ్లకి చెబుతుంది. ఆమె ఇష్టప్రకారం చేయడానికి వాళ్లంతా తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. ఇక అక్కడే సితారకి ఆమె పిన్ని హేమ తారసపడుతుంది. ఆమె మంచి అందగత్తె .. అంతకుమించి తెలివైనది. చిన్నప్పుడు ఆమెని తన రోల్ మోడల్ గా సితార భావిస్తూ ఉండేది.
హేమ వయసులో ఉండగా ఎయిర్ హోస్టెస్ గా పనిచేసేది. అప్పట్లో ఎంతోమంది కుర్రాళ్లు ఆమెను చూసి మనసు పారేసుకున్న సంఘటనలను గురించి సితార విని ఉంది. హేమపై మనసు పారేసుకున్నవారిలో తన తండ్రి కూడా ఉన్నాడనే ఒక సందేహం సితారకి ఎప్పటి నుంచో ఉంటుంది. ఇప్పుడు కూడా వాళ్ల మధ్య ఆ సంబంధం కొనసాగుతూ ఉందనే ఒక అనుమానం ఆమెను వేధిస్తూ ఉంటుంది. తన తల్లికి ఈ విషయం తెలుసా? తెలియనట్టు నటిస్తోందా? అనేది ఆమెకి అయోమయాన్ని కలిగిస్తున్న ప్రశ్న.
సితార పెళ్లి పనులు సంప్రదాయ బద్ధంగా .. సొంత ఊళ్లో .. సొంత ఇంట్లో జరగాలని ఆమె అమ్మమ్మ కోరుతుంది. అలాగే జరిపించడానికి అంతా తమ అంగీకారాన్ని తెలియజేస్తారు. పెళ్లి పనులు మొదలైపోతాయి. ఓ రోజున సితార కళ్లు తిరిగి పడిపోవడంతో ఆమెను హాస్పిటల్లో చేరుస్తారు. ఆమె గర్భవతి అని డాక్టర్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఆల్రెడీ ఆ విషయం ముందే తెలిసిన సితార ఆలోచనలో పడుతుంది.
అర్జున్ - సితార పెళ్లికి ముందు తొందరపడి ఉంటారని భావించిన ఆమె కుటుంబ సభ్యులు, మరికొన్ని రోజుల్లో పెళ్లి జరగబోతోంది కదా అని సరిపెట్టుకుంటారు. సితార గర్భవతి అని తెలిసి ఆమె ఇంటికి అర్జున్ వస్తాడు. తనని క్షమించమనీ .. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతను కాదని సితార చెబుతుంది. ఆ మాటకి అర్జున్ ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత ఏం చేస్తాడు? సితార - అర్జున్ పెళ్లి జరుగుతుందా? అనేది మిగతా కథ.
ప్రేమ - పెళ్లి .. ఈ రెండింటికి మధ్య జరిగిన ఒక తప్పు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ప్రేమ .. పెళ్లి .. పెద్దలకు చెప్పడం .. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు .. ఇవన్నీ కూడా సహజత్వానికి దగ్గరగా .. సందడిగా సాగుతాయి. పెళ్లికి ముందే కూతురు గర్భవతి అని తెలిసినా, అతనితోనే కదా పెళ్లి అవుతుందని పెద్దవాళ్లు సరిపెట్టుకుంటే, తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అతను కాదని ఆమె బాంబ్ పేల్చుతుంది. ఈ కథలో కీలకమైన అంశం ఇదే.
ఇక సితార తన పెళ్లి కోసం సొంత ఊరు వచ్చి, తన పిన్నికీ .. తన తండ్రికి మధ్య ఉన్న ఎఫైర్ ను నిర్ధారించుకునే పనిలో పడుతుంది. దానికి ఇది సమయం కాదే .. అయినా ఇప్పుడది అంత అవసరమా? అని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ తాను చేసిన తప్పు బయటపడే సమయానికి తండ్రినీ .. పిన్నినీ దోషులుగా నిలబెట్టి, పిన్నిని చూసే తాను దారితప్పినట్టుగా సితార చెబుతుంది.
ఆ మాట కొస్తే మీ నాన్న మాత్రమే కాదే .. మీ తాత మాత్రం తక్కువ తిన్నాడనుకున్నావా ఏంటి? అంటూ, ఆల్రెడీ మనది దారితప్పిన ఫ్యామిలీనే అనే ఒక క్లారిటీ ఇచ్చేస్తుంది బామ్మ. ఇలా ఈ కథ . వివాహ బంధానికి పెద్దగా విలువనీయని జంట పాత్రలతో కొనసాగుతుంది. '' సంతోషంగా ఉండటం కంటే .. సంతోషంగా ఉన్నట్టుగా నటించడం కష్టమైన విషయం" అనే ఒక్క డైలాగ్ తో కథను .. పాత్రలను కవర్ చేశారనే అనుకోవాలి.
సైమన్ ఫొటోగ్రఫీ .. శ్రీకాంత్ శ్రీరామ్ నేపథ్య సంగీతం .. పరమిత ఘోష్ ఎడిటింగ్ ఫరవాలేదు. ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 'లవ్ .. సితార' అనే టైటిల్ అంతగా ప్రభావం చూపేదిలా అనిపించదు. ప్రేమ .. పెళ్లి .. ఓ తొందరపాటు అనే కాన్సెప్ట్ తో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అందువలన ఇది కొత్తగా ఏమీ అనిపించదు. పాతదే అయినా కనెక్ట్ అయ్యే అంశాలు కూడా కనిపించవు. ఇది ఓ సాదాసీదా కంటెంట్ అని మాత్రమే అనిపించుకుంటుంది.
'లవ్ .. సితార' (జీ 5) మూవీ రివ్యూ!
Love Sitara Review
- శోభిత ధూళిపాళ్ల ప్రధాన పాత్రగా 'లవ్ .. సితార'
- సెప్టెంబర్ 27న మొదలైన స్ట్రీమింగ్
- ఈ నెల 18 నుంచి తెలుగులో అందుబాటులోకి
- రొటీన్ గా అనిపించే కథనే
- అలరించే అంశాలు బహు తక్కువ
Movie Name: Love Sitara
Release Date: 2024-10-18
Cast: Sobhita Dhulipala, Rajeev Siddhartha, Sonali Kulkarni, Jayashree, Virginia Rodrigues
Director:Vandana Kataria
Producer: Ronnie Screwvala
Music: Shrikanth Sriram
Banner: RSVP Movies
Review By: Peddinti
Rating: 2.50 out of 5
Trailer