ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లపై థ్రిల్లర్ నేపథ్యంలోని కథలకు ఒక రేంజ్ లో డిమాండ్ ఉంది. అందువలన ఓటీటీ సంస్థలు ఈ తరహా కంటెంట్ ను అందించడానికి ఎక్కువ ఉత్సాహాన్ని చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశానికి మైథాలాజీని జోడిస్తూ ఒక వెబ్ సిరీస్ ను రూపొందించారు .. ఆ సిరీస్ పేరే 'ఐందం వేదం'. ఎల్ నాగరాజన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ సిరీస్, ఇతర భాషల్లోను ఈ రోజు నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. సాయి ధన్సిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
అనూ (సాయి ధన్సిక) కోల్ కతాకు చెందిన తెలుగు అమ్మాయి. తన తల్లి అస్థికలను 'గంగ'లో కలపడానికి ఆమె 'కాశీ'కి చేరుకుంటుంది. అక్కడ ఆమెకి ఒక 'గురూజీ' తారసపడతాడు. ఆమెకి పురాతన కాలంనాటి ఒక చిన్న పెట్టె ఇచ్చి, దానిని 'అయ్యంగారపురం'లోని శివాలయ పూజారికి అందజేయమని చెబుతాడు. ఊహించని విధంగా ఆ క్షణమే అతను చనిపోతాడు. ఆ పెట్టె అనూతో పాటు ఉన్నప్పటికీ, ఆమెకి 'అయ్యంగారపురం' వెళ్లే ఆలోచన ఉండదు.
అనూ తన కెరియర్ కి సంబంధించిన పని కోసం 'త్రివేండ్రం' వెళదామని అనుకుంటుంది. కానీ ఆ ప్రయాణానికి అనేక అవాంతరాలు ఎదురవుతూ వస్తాయి. అలా ఆమె ప్రమేయం లేకుండానే ఆమె ప్రయాణిస్తున్న కారు, 'అయ్యంగారపురం' చేరుకుంటుంది. అక్కడి ఆలయంలో ప్రధాన పూజారి అయిన 'రుద్రపతి' ( వైజీ మహేంద్ర) కొడుకు 'సాంబుడు'కి ఆ పెట్టెను అందజేస్తుంది. ఆ తరువాత ఆమె ఆ ఊరు నుంచి బయటపడటానికి చేసిన ప్రయత్నాలు కూడా ఎప్పటికప్పుడు విఫలమవుతూ ఉంటాయి.
బ్రహ్మదేవుడి నాలుగు తలలు .. నాలుగు వేదాలకు ప్రతీకలు. ఆయన ఐదవ తలను శివుడు తుంచేసిన ప్రదేశంలోనే తమ ఊరి ఆలయం ఉందని 'అనూ'తో రుద్రపతి చెబుతాడు. బ్రహ్మదేవుడికి సంబంధించిన సన్నిధానం తమ ఆలయంలోనే రహస్యంగా ఉందనీ, వెయ్యి ఏళ్ల తరువాత అది బయటపడే సమయం రానుందని అంటాడు. నాలుగు గ్రహాలు సూర్యుడికి ఎదురుగా సమాంతర రేఖలోకి వచ్చినప్పుడు ఆ అద్భుతం జరుగుతుందని చెబుతాడు.
బ్రహ్మ దేవుడికి సంబంధించిన ఆ సన్నిధానాన్ని రక్షించే బాధ్యత మూడు కుటుంబాలకు అప్పగించబడిందనీ, అందులో అనూ కూడా ఒక కుటుంబానికి చెందిన కారణంగానే, కాశీ నుంచి ఆమె ఆ పెట్టె తీసుకుని రావడం జరిగిందని రుద్రపతి వివరిస్తాడు. ఆమె వలన జరగవలసిన కార్యక్రమం ఇంకా ఏదో ఉందనీ, అందువలనే ఆ ఊరు పొలిమేర దాటలేకపోతోందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తాడు. వెయ్యి సంవత్సరాలకు ఒకసారి వచ్చే రోజు, మరికొన్ని రోజులలో రానున్నదని చెబుతాడు. కానీ ఆ మాటలను ఆమె పెద్దగా పట్టించుకోదు.
అనూ తీసుకొచ్చిన పెట్టెలో 'నిధి'కి సంబంధించిన రహస్యాలు ఉండొచ్చని భావించిన ఆ ఊరు ప్రెసిడెంట్, ఆ పెట్టెను దక్కించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అనూను వెదుక్కుంటూ ఆమె తండ్రి ఆ ఊరుకు చేరుకుంటాడు. ఓ కేసు విషయంగా 'కేతకి ' ( దేవదర్శిని) అయ్యంగారుపురం' చేరుకుంటుంది. అలాగే బ్రహ్మదేవుడి గురించిన ఒక డాక్యుమెంటరీ చేస్తున్న 'పతి' (సంతోష్ ప్రతాప్)తన కొడుకు వికాస్ తో ఆ ఊరు చేరుకుంటాడు. అలాగే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రహస్య ప్రయోగం చేసే ఒక బృందం కూడా ఆ ఊళ్లోకి దిగిపోతుంది. అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజున ఏం జరుగుతుందనేది కథ.
ఇది భారీ వెబ్ సిరీస్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానంగా కనిపించే పాత్రల సంఖ్య
కూడా ఎక్కువే. ప్రధానమైన పాత్రలన్నీ ఒక్కొక్కటిగా ఆలయం ఉన్న ఊరుకు చేరుకోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఐదవ వేదానికి సంబంధించిన ఆనవాళ్లను తెలుసుకోవడానికి సాగే పరోశోధన .. దేవాలయ నేపథ్యం .. పూజారుల నేపథ్యంలోని సన్నివేశాలను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది.
అయితే అనూ పాత్ర .. ఆమె తండ్రి పాత్ర .. గురూజీ .. పతి .. మిత్రన్ .. కేతకి .. అజ్ఞాత యువకుడి పాత్రలకి సంబంధించిన క్లారిటీ దొరకదు. వాళ్లు ఏం చేస్తున్నారు? ఏం ఆశిస్తున్నారు? ఏం కావాలనుకుని 'అయ్యంగారపురం' చేరుకున్నారు అనేది అర్థం కాదు. పోనీ ఇవి చిన్న పాత్రలైతే ఎక్కడో ఒక చోట వదిలేయవచ్చు. కానీ ఈ పాత్రలు చాలా దూరం ప్రయాణిస్తాయి. ఈ పాత్రలకి సంబంధించిన క్లారిటీ ఇస్తే కథకి ఇంకాస్త బలం చేకూరినట్టు అయ్యేది.
టైటిల్ తో పాటు లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే చిన్నపాటి గందరగోళంతోనే ఈ కథ మొదలవుతుంది. ఆ తరువాత సర్దుకుంటుంది .. కొన్ని పాత్రల విషయంలో క్లారిటీ వస్తుంది అనుకుంటాముగానీ .. అలా జరగలేదు. ఏ అంశాన్ని గురించి అయితే హడావిడి చేస్తూ వచ్చారో .. చివరికి వచ్చేసరికి అది బలహీన పడినట్టుగా అనిపిస్తుంది. కథ మరో అంశం వైపుకు వెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచి కథ సీజన్ 2లో వెళుతుంది.
శ్రీనివాసన్ దేవరాజన్ ఫొటోగ్రఫీ బాగుంది. రేవా నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెజీష్ ఎడిటింగ్ కూడా ఓకే. నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సిరీస్ కి వంక బెట్టవలసిన అవసరం లేదు. లొకేషన్స్ హైలైట్ గా అనిపిస్తాయి. దైవం కొంతమందికి కొన్ని బాధ్యతలను అప్పగిస్తుంది. వారిని ఆ దిశగా నడిపించడం కూడా ఆ దైవమే చేస్తుందనే అంశాన్ని దర్శకుడు ఆవిష్కరించాడు. కొన్ని ప్రధానమైన పాత్రలను ఇంకాస్త బాగా డిజైన్ చేసి, వాళ్లకి సంబంధించిన విషయంలో క్లారిటీ ఇస్తే ఈ సిరీస్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో.
'ఐందం వేదం' (జీ 5) వెబ్ సిరీస్ రివ్యూ!
Aindham Vedham Review
- తమిళంలో రూపొందిన 'ఐందం వేదం'
- భారీ తారాగణంతో నిర్మితమైన సిరీస్
- ఇంట్రెస్టింగ్ పాయింటును టచ్ చేసిన డైరెక్టర్
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచే లొకేషన్స్
- ఫొటోగ్రఫీ .. బీజీఎమ్ కి ఎక్కువ మార్కులు
- కొన్ని పాత్రల వైపు నుంచి లోపించిన క్లారిటీ
Movie Name: Aindham Vedham
Release Date: 2024-10-25
Cast: Sai Dhanshika, Santhosh Prathap, Vivek Rajgopal, Y G Mahendra ,Devadarshini, Ponvannan
Director:L Nagarajan
Producer: Abhirami Ramanathan - Nallammai Ramanathan
Music: Revaa
Banner: Abirami Media Works
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer