విజయ్ ఆంటోనికి తమిళనాటనే కాదు, తెలుగులోను అభిమానులు ఎక్కువే. ఆయన సినిమాలకి ఇక్కడ కూడా మంచి మార్కెట్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన నుంచి ఇటీవల 'హిట్లర్' సినిమా వచ్చింది. 'ధన' దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైంది. నిన్నటి నుంచి ఈ సినిమా  'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ : అది 'చెన్నై' కి దూరంగా అడవిని ఆనుకుని ఉన్న ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామం నుంచి బయట ప్రపంచంలోకి వెళ్లాలంటే ఒక 'వాగు' దాటాలి. ఒకసారి 'వాన' కారణంగా వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ సమయంలో తప్పనిసరై కొంతమంది మహిళలు వాగు దాటవలసి వస్తుంది. ప్రవాహం ఎక్కువ కావడం .. నీటిమట్టం పెరగడం వలన వాళ్లంతా ఆ ప్రమాదంలో చనిపోతారు. దాంతో ఆ గ్రామస్తులంతా కన్నీళ్ల పర్యంతమవుతారు. 

ఇదిలా ఉంటే .. చెన్నైలో ఎన్నికల హడావిడి ఊపందుకుంటుంది. మినిస్టర్ రాజవేల్ (చరణ్ రాజ్) ఈ సారి తాను తప్పకుండ గెలవాలనీ, ముఖ్యమంత్రిని కావాలనే పట్టుదలతో ఉంటాడు. అతని తమ్ముడు నల్లశీను అందుకు సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటూ ఉంటాడు. ఈ సమయంలోనే సెల్వా  ( విజయ్ ఆంటోని) చెన్నైకి చేరుకుంటాడు. ఓ మిత్రుడి రూమ్ లో చోటు సంపాదించుకుంటాడు. ఉద్యోగం దొరగ్గానే వేరే రూమ్ చూసుకుంటానని చెబుతాడు. 

ఒకసారి లోకల్ ట్రైన్ లో ప్రయాణిస్తున్న అతనికి, సారా (రియా సుమన్) తారసపడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఎలక్షన్ సమయం దగ్గర పడుతుండటంతో, రాజవేల్ తన నియోజక వర్గంలో పంచడం కోసం విడతల వారీగా 400 కోట్లు తెప్పిస్తాడు. లోకల్ ట్రైన్ ద్వారా .. లోకల్ రౌడీల చేత డబ్బు చేరవేస్తూ ఉంటారు. అయితే నియోజక వర్గానికి చేరడానికి ముందే ఆ డబ్బును ఎవరో కాజేస్తూ ఉంటారు. 

అంతేకాదు రాజవేల్ కి సంబంధించిన ముఖ్యమైన అనుచరులు, ఒక్కొక్కరుగా హత్యకి గురవుతూ ఉంటారు. దాంతో రాజవేల్ ఆగ్రహావేశాలకు లోనవుతాడు. తన డబ్బును ఎవరు కాజేస్తున్నదీ తెలుసుకుని అతనిని తనకి అప్పగించమని ఏసీపీ శక్తి ( గౌతమ్ మీనన్)కి రాజవేల్ చెబుతాడు. దాంతో 400 కోట్లు కొట్టేసింది ..  4 హత్యలు చేసింది ఎవరో తెలుసుకోవడం కోసం శక్తి రంగంలోకి దిగుతాడు.

జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తూ వస్తున్న శక్తికి, సెల్వాపై అనుమానం వస్తుంది. అతని ప్రేమలో పడిన సారాపై సందేహం కలుగుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? సెల్వాపై శక్తికి ఎలా డౌట్ వస్తుంది? 400 కోట్లను ఎవరు దొంగిలిస్తారు? రాజవేల్ డబ్బును మాత్రమే ఎందుకు కాజేస్తారు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ఈ సినిమా ఫస్టాఫ్ అంతా రాజవేల్ డబ్బు మాయమవుతూ ఉంటుంది. అతని అనుచరులు హత్యకి గురవుతూ ఉంటారు. సెకండాఫ్ అంతా కూడా అందుకు కారకులు ఎవరు? వారి ఉద్దేశం ఏమిటి? అనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఫస్టాఫ్ లో హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ కాస్త సరదాగా నడిస్తే, సెకండాఫ్ లో వారి మధ్య ఉద్వేగభరితమైన సన్నివేశాలు చోటు చేసుకుంటాయి.

ఒక వైపున హీరో -  హీరోయిన్స్ లవ్ .. మరో వైపున రాజకీయ వ్యూహాలు .. బ్లాక్ మనీ మాయం కావడం .. ఇంకో వైపున లోకల్ రౌడీల హత్యలు .. ఇలా అనేక వైపులా నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. అయితే లవ్ ట్రాక్ తో సహా, ఏ అంశం కూడా అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. ఆల్రెడీ ఇంతకుముందు మనం చూసిన సన్నివేశాలను మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం కథలో ఎక్కడా ట్విస్టులు కూడా తగలవు.

ఏ డబ్బు అయితే కనిపించకుండా పోయిందని విలన్ గ్యాంగ్ టెన్షన్ పడుతూ ఉంటుందో, ఆ డబ్బును హీరో కాజేశాడనే విషయం ఆడియన్స్ కి ముందుగానే అర్థమైపోతుంది. ఎందుకు ఆయన ఆ పని చేశాడనేది కూడా ముందుగానే తెలిసిపోతుంది. అందువలన ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా అనిపించదు.

పనితీరు: విజయ్ ఆంటోని కథలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయనే పేరు ఉంది. కానీ ఆయన ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది ఒక మెట్టు కిందే కనిపిస్తుంది. లుక్ తో పాటు తన పాత్ర విషయంలోనూ ఆయన మరింత శ్రద్ధ పెట్టవలసింది. ఆడుకాలం నరేన్ వంటి ఆర్టిస్టును పెట్టుకుని, ఎంత మాత్రం ఆయనను ఉపయోగించుకోకపోవడం ఆశ్చర్యం. 

కథాకథనాల విషయంలో .. ప్రధాన పాత్రలను మలిచే విషయంలో దర్శకుడు మరింత కసరత్తు చేసి ఉంటే బాగుండునని అనిపిస్తుంది. నవీన్ కుమార్ ఫొటోగ్రఫీ .. వివేక్ - మెర్విన్ నేపథ్య సంగీతం .. సంగ తమిళన్ ఎడిటింగ్ ఫరవాలేదు. గతంలో రాజకీయాల నేపథ్యంలో సాగే యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. వాటికి భిన్నంగా లేకపోవడం వలన, ఈ సినిమా ఒక మాదిరిగా అనిపిస్తుందంతే.