సుధీర్ బాబు హీరో 'మా నాన్న సూపర్ హీరో' రూపొందింది. సునీల్ బలుసు నిర్మించిన ఈ సినిమాకి, అభిలాష్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజునే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ :ఈ కథ 1983లో మొదలవుతుంది. ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. పసికందులా ఉన్న మగబిడ్డ ఆలనా పాలన అతనే చూసుకుంటూ ఉంటాడు. ఓ సారి ప్రకాశ్ ఓ లోడ్ కోసం వెళుతూ, తాను తిరిగి రావడానికి మూడు రోజులు పడుతుందనీ .. అప్పటి వరకూ చూడమని ఓ అనాథ శరణాలయంలో తన బిడ్డను అప్పగిస్తాడు. తాను నడుపుతున్న లారీలో 'గంజాయి' ఉందని తెలియని ప్రకాశ్, పోలీసులకు పట్టుబడతాడు. ఆ కేసులో అతనికి 20 ఏళ్లు శిక్షపడుతుంది.
శరణాలయంవారు ప్రకాశ్ కోసం కొన్ని రోజులు ఎదురుచూస్తారు. అతను ఆ పిల్లాడిని వదిలించుకోవడం కోసమే అలా చెప్పాడని భావిస్తారు. ఆ పిల్లాడికి 'జానీ' అనే పేరు పెట్టి అతని ఆలనా పాలన చూస్తూ ఉంటారు. అలా పాతికేళ్లు గడిచిపోతాయి. జానీ ( సుధీర్ బాబు) ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కి సూపర్ వైజర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతనిని 'తార' (ఆర్ణ) ప్రేమిస్తూ ఉంటుంది. తమ పెళ్లికోసం పెద్దలను ఒప్పించే ప్రయత్నంలో వాళ్లు ఉంటారు.
జానీని చిన్నతనంలోనే శ్రీనివాస్ (సాయాజీ షిండే) దత్తత చేసుకుంటాడు. షేర్ మార్కెట్ కారణంగా శ్రీనివాస్ బిజినెస్ దెబ్బతింటుంది. అనారోగ్య కారణాల వలన ఆయన భార్య (ఆమని) చనిపోతుంది. దాంతో 'జానీ' వచ్చిన దగ్గర నుంచి తనకి కలిసి రాలేదనే ఆలోచన పెట్టుకుంటాడు. అప్పటి నుంచి జానీ పట్ల శ్రీనివాస్ తీవ్రమైన అసహనంతో ఉంటాడు.షేర్ మార్కెట్ జోలికి వెళ్లొద్దని జానీ చెబుతున్నా వినిపించుకోడు.
ఇక జైలు నుంచి విడుదలైన ప్రకాశ్, తన కొడుకు జాడ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉంటాడు. తన కొడుకుని కలుసుకోగలిగితే అతనికి ఎంతో కొంత ఇవ్వాలనే ఆశతో, లాటరీ టికెట్లు కొంటూ ఉంటాడు. ఒక రాజకీయనాయకుడు, శ్రీనివాస్ కారణంగా కోటి రూపాయలు నష్టపోయానంటూ ఛీటింగ్ కేసు పెడతాడు. ఆ డబ్బు తాను ఇస్తానని ఒప్పుకున్న జానీకి 20 రోజుల గడువు పెడతాడు. ఆ డబ్బు కోసం జానీ ఏం చేస్తాడు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనేది కథ.
విశ్లేషణ : ఈ సినిమాకి భరద్వాజ్ - శ్రవణ్ మాదాల కథను అందించారు. కన్న తండ్రికీ .. పెంపుడు తండ్రికి .. ఒక కొడుక్కీ మధ్య జరిగే కథ ఇది. కొడుకు దూరం కావడం వలన జీవితంలో సర్వం కోల్పోయానని ఆవేదన చెందే కన్న తండ్రి ఒక వైపు. ఆ కొడుకు అడుగుపెట్టడం వల్లనే సర్వం కోల్పోయానని అసహనానికి లోనయ్యే పెంపుడు తండ్రి మరో వైపు. ఇందుకు సంబంధించిన సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది.
జానీ కన్నతండ్రి .. తన కొడుకు కనిపిస్తే ఇవ్వాలనే ఆశతో డబ్బు కోసం ఆరాటపడుతూ ఉంటాడు. జానీ పెంపుడు తండ్రి, డబ్బు పట్ల ఆరాటంతోనే జైలు పాలవుతాడు. అతనిని విడిపించడానికి ఇప్పుడు జానీకి డబ్బు కావాలి. కన్న కొడుక్కి ఇవ్వాలని ప్రకాశ్ డబ్బు కోసం ట్రై చేస్తూ ఉంటే, పెంపుడు తండ్రి కోసం జానీ డబ్బుకోసం అన్వేషిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో చోటుచేసుకునే సన్నివేశాలతో సెకండాఫ్ నడుస్తుంది.
సినిమా మొత్తం మీద ప్రధానంగా మనకి కనిపించే పాత్రలు మూడే మూడు. కన్నతండ్రి - పెంపుడు తండ్రి - కొడుకు .. అంతే. హీరోయిన్ కూడా లేకపోలేదు .. కాకపోతే లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు గట్రా ఉండవు. హీరో తన పెంపుడు తండ్రిని కాపాడటం పైనే పూర్తి ఫోకస్ చేస్తాడు. దర్శకుడు ఈ మూడు పాత్రలపైనే దృష్టి పెట్టాడు. అందువలన కథ కాస్త సీరియస్ గానే నడుస్తుంది. దర్శకుడు ఎంచుకున్న లైన్ బాగుంది .. ఎమోషన్స్ కనెక్ట్ అవుతాయి. కాకపోతే ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించడంలో విఫలమైంది.
అత్యంత క్లిష్టమైన పరిస్థితుల నుంచి బయటపడటం కోసం హీరో కొంత ఎమౌంట్ ను సెట్ చేయడానికి టెన్షన్ పడుతుంటాడు. దాదాపు తనకి రావలసిన అంతే ఎమౌంటు కోసం ప్రకాశ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఏం జరిగినా చివరికి ఏమౌతుందనేది ప్రేక్షకులు గెస్ చేస్తారు. అందువల్లనే ఆడియన్స్ కూల్ గానే ఈ కథను ఫాలో అవుతారు.
పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన సుధీర్ బాబు .. సాయిచంద్ .. సాయాజీ షిండే తమ పాత్రలకు న్యాయం చేశారు. కొడుకు కోసం డబ్బు దాచాలనే తాపత్రయం కలిగిన ఒక సాధారణమైన తండ్రి పాత్రలో సాయిచంద్ ఒదిగిపోయాడు. జై క్రిష్ నేపథ్య సంగీతం .. సమీర్ కల్యాణి ఫొటోగ్రఫీ .. కుమార్ ఎడిటింగ్ ఓకే. దర్శకుడు వినోదపరమైన అంశాలను టచ్ చేయకపోవడం .. అనవసరమైన రాజు సుందరం పాత్ర మైనస్ అనిపిస్తాయి.
ప్రధానమైన పాత్రలకు పెట్టిన పేర్లు కూడా సెట్ కాలేదనిపిస్తుంది. ఇక హీరోయిన్ పాత్రను నామ మాత్రం చేయడం అసంతృప్తిని కలిగిస్తుంది. వ్యసన పరుడైన తండ్రికి, కష్టాన్ని నమ్ముకున్న కొడుకు భయపడటం అసహజంగా అనిపిస్తుంది. ఇవన్నీ అలా పక్కన పెట్టేసి ఎమోషన్స్ పరంగా చూసుకుంటే మాత్రం, ఫరవాలేదనిపించే కంటెంట్ ఇది.
'మా నాన్న సూపర్ హీరో' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Maa Nanna Superhero Review
- ఫ్యామిలీ డ్రామాగా 'మా నాన్న సూపర్ హీరో'
- అక్టోబర్ 11న విడుదలైన సినిమా
- ఓటీటీలో ఈ రోజునే మొదలైన స్ట్రీమింగ్
- ఎమోషన్స్ పరంగా ఆకట్టుకునే లైన్
Movie Name: Maa Nanna Superhero
Release Date: 2024-11-13
Cast: Sudheer Babu, Sayaji Shinde, Sai Chand , Aarna
Director:Abhilash Reddy Kankara
Producer: Sunil Balusu
Music: Jay Krish
Banner: V Celluloids
Review By: Peddinti