నరేశ్ అగస్త్య హీరోగా థ్రిల్లర్ జోనర్లో 'వికటకవి' అనే ఒక వెబ్ సిరీస్ నిర్మితమైంది. రజని తాళ్లూరి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. మేఘ ఆకాశ్ కథానాయికగా నటించిన ఈ సిరీస్, 1940 - 1970లలో కొనసాగుతుంది. తెలంగాణ నేపథ్యంలో పలకరించిన ఫస్టు డిటెక్టివ్ సిరీస్ ఇది. ఈ రోజు నుంచే ఈ సిరీస్ 'జీ 5'లో 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ 1970లలో మొదలవుతుంది. అది నల్లమల అటవీ ప్రాంతానికి సమీపంలోని 
'అమరగిరి' అనే ఊరు. ఆ ఊరంతా ఒకప్పుడు రాజా నరసింహరావు (షిజూ మీనన్) సంస్థానం కనుసన్నలలో నడిచింది. అయితే ఆయన ఒక్కగానొక్క కొడుకు 'మహాదేవ్' (తారక్ పొన్నప్ప) చనిపోవడంతో ఆయన మానసికంగా కుంగిపోతాడు. తన కొడుకు ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడు? చనిపోయేముందు తనకి ఏం చెప్పాలనుకున్నాడు? అనేది తెలియక మరింత కుమిలిపోతుంటాడు. 

రాజావారు ఎప్పుడైతే ఇతర విషయాలను పట్టించుకోవడం మానేస్తాడో, అప్పటి నుంచి ఆ ఊళ్లో ఆయన అల్లుడు రఘుపతి పెత్తనమే నడుస్తూ ఉంటుంది. ఆయన భార్య యశోద వీల్ చైర్ కి పరిమితమవుతుంది. కూతురు లక్ష్మి (మేఘ ఆకాశ్) పట్నంలో చదువుతూ ఉంటుంది. వాళ్లిద్దరికీ కూడా రఘుపతి పట్ల మంచి అభిప్రాయం ఉండదు. భార్యా బిడ్డల ధోరణి రఘుపతికి మరింత అసహనాన్ని కలిగిస్తూ ఉంటుంది.   

'అమరగిరి' ప్రజలు చీకటిపడితే అడవి వైపుకు వెళ్లడానికి భయపడుతూ ఉంటారు. అలా వెళ్లినవారు మతిస్థిమితాన్ని కోల్పోతుండటమే అందుకు కారణం. అలా తమని గురించి తామే మరిచిపోయిన వాళ్లందరినీ, దేవాలయంలోని ఒక గదిలో ఉంచుతూ ఉంటారు. ఆ ఊళ్లోని 'దేవతల గుట్ట'పై అక్కడి వారంతా ఎంతో విశ్వాసంతో కొలిచే అమ్మవారి గుడి ఉంటుంది. ఆ గుట్టపై పాతికేళ్ల క్రితం కురిసిన వర్షంలో చాలామంది చనిపోతారు. అది అమ్మవారి శాపంగా భావించిన ప్రజలు, జాతర జరపడం మానేస్తారు. 

హైదరాబాదులో ఉంటున్న రామకృష్ణ (నరేశ్ అగస్త్య)కి, చిన్నప్పటి నుంచి డిటెక్టివ్ కావాలని ఉంటుంది. చిన్నతనంలోనే తండ్రికి దూరమైన అతను, తల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకి ఆపరేషన్ చేయించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. దాంతో 'అమరిగిరి'లోని సమస్యను పరిష్కరిస్తే, అక్కడి రాజావారు డబ్బు ఇస్తాడని అదే గ్రామం నుంచి వచ్చిన ప్రొఫెసర్ వేణుగోపాల్ రామకృష్ణకి చెబుతాడు. 

దాంతో రామకృష్ణ నేరుగా 'అమరగిరి' చేరుకుంటాడు. అక్కడే అతనికి లక్ష్మి పరిచయమవుతుంది. అతణ్ణి తన తాతయ్యకి రాజా నరసింహారావుకు పరిచయం చేస్తుంది. తన పరిస్థితిని రాజావారికి వినిపించిన రామకృష్ణ, ఆ ఊరు సమస్యకు కారణం ఏమిటనేది తెలుసుకునే అవకాశం ఇవ్వమని అడుగుతాడు. 48 గంటల గడువు ఇచ్చిన రాజావారు, ఆ గడువు దాటితే తమ ఊరు వదిలి వెళ్లిపొమ్మని అంటాడు. ఆ ఊళ్లోని సమస్యలకు కారకులు ఎవరు? అది కనిపెట్టాలనుకున్న  రామకృష్ణకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. 


విశ్లేషణ: హైదరాబాదులోని రామకృష్ణకి తన తండ్రి ఎవరో .. ఏమయ్యాడో తెలియదు. తల్లి మాత్రం వర్షం పడితే చాలు, చాలా భయపడిపోతూ ఉంటుంది. డబ్బు అవసరం కావడంతో, తన డిటెక్టివ్ బుర్రతో 'అమరగిరి' సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగుతాడు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇక్కడే అతనికి రాజావారు ..  రఘుపతి .. అక్కడి అర్చకుడు .. గూడెం పెద్ద పశుపతి తారసపడతారు. 

ఈ పాత్రలన్నింటిపైన రామకృష్ణకు అనుమానం కలుగుతుంది. అలా ఆ పాత్రలను డిజైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎప్పుడో 'అమరగిరి'లో కురిసిన వర్షానికి అక్కడి ప్రజలు చనిపోవడానికీ, వర్షమనగానే రామకృష్ణ తల్లి భయపడిపోవడానికి కారణం ఏమిటి? రాజావారి కొడుకు ఎవరు? రామకృష్ణకు తెలియకుండానే అతనిని ఆ ఊరు రప్పించిన అసలు కారణం ఏమిటి? అనే అంశాలకు ముడిపెట్టిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.   

అయితే క్లైమాక్స్ సీన్ విషయానికి వచ్చేసరికి, నాటకీయంగా అనిపిస్తూ లాజిక్ కి .. సహజత్వానికి కాస్త దూరంగా జరిగినట్టు అనిపిస్తుంది. మతిస్థిమితం కోల్పోయిన వారిని మామూలుగా కాకుండా తాళ్లతో కట్టేసి ఊళ్లోకి లాక్కుని రావడం .. అందరినీ టీవీసెట్ల ముందు కూర్చోబెట్టినట్టు ఒక గదిలో కూర్చోబెట్టడం సిల్లీగా అనిపిస్తుంది. అలాగే ఒక డ్యామ్ కారణంగా త్వరలో ఊరే మునిగిపోతూ ఉన్నప్పుడు, అక్కడి ప్రజలను అలా చేయడం వలన విలన్ కి ఒరిగేదేమిటి? విలన్ ఆశించిన దానికి .. జరుగుతున్న దానికి సంబంధం ఏమిటి? అనే విషయంలో క్లారిటీ దొరకదు.     

పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 1940 - 70 ల కాలంలో కథను నడిపించడంలో దర్శకుడు తన ప్రతిభ చూపించాడు. అయితే అక్కడక్కడా చుట్టూ జనమెవ్వరూ లేకుండా తీసిన సీన్స్ వెలితిగా అనిపిస్తాయి. మేఘ ఆకాశ్ పాత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. 

షోయబ్ సిద్ధిఖీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఫారెస్టు నేపథ్యంలోని సీన్స్ .. చీకటి నేపథ్యంలోని సీన్స్ ను చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సన్నివేశాలకు .. సందర్భానికి తగినట్టుగా సాగింది. సాయిబాబు ఎడిటింగ్ కూడా ఓకే. 'వికటకవి' అనిపించుకున్న తెనాలి రామకృష్ణుడు ఒకప్పుడు డిటెక్టివ్ గా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయంటూ, ఈ టైటిల్ వైపు నుంచి దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అక్కడక్కడా లాజిక్ మిస్సయినప్పటికీ, కథ .. స్క్రీన్ ప్లే ..  ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. లొకేషన్స్ విషయంలో పెట్టిన ఎఫర్ట్స్ కోసం ఈ సిరీస్ చూడొచ్చు.