'పేట్టా రాప్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Petta Rap

Petta Rap Review

  • ప్రభుదేవా హీరోగా చేసిన 'పేట్టా రాప్'
  • సెప్టెంబర్ 27న విడుదలైన సినిమా 
  • ఈ నెల 24 నుంచి తెలుగులోను స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • వర్కౌట్ కాని కామెడీ

కొరియోగ్రఫర్ గా .. నటుడిగా .. దర్శకుడిగా ప్రభుదేవా తన ప్రత్యేకతను చాటుకున్నాడు. కొంతకాలం క్రితం వరకూ బాలీవుడ్ లో దర్శకుడిగా వరుస సినిమాలు చేస్తూ వచ్చిన ప్రభుదేవా, ఇప్పుడు నటనపైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. ఆయన నటించిన 'పేట్టా రాప్' సెప్టెంబర్ 27న థియేటర్లకు వచ్చింది. ఈ నెల 12న  అమెజాన్ ప్రైమ్ లో అడుగుపెట్టిన ఈ సినిమా, తెలుగు వెర్షన్ లో ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది.

కథ: ఈ కథ 1994లో మొదలవుతుంది. చెన్నైలోని ఓ మారుమూల గ్రామంలోని స్కూల్లో బాలసుబ్రమణ్యం (ప్రభుదేవా) చదువుకుంటూ ఉంటాడు. అతను సినిమా హీరో ప్రభుదేవాకి అభిమాని. అతనిలా డాన్స్ చేయాలనీ .. తెరపై హీరోగా కనిపించాలనేది బాలు ఆశ. అందువలన చిన్నప్పటి నుంచి డాన్స్ .. నటన ప్రాక్టీస్ చేస్తూనే ఎదుగుతాడు. బాలు తల్లిదండ్రులు .. చెల్లెలు అతణ్ణి ప్రోత్సహిస్తూనే వస్తారు. 

యవ్వనంలోకి ఎంటరైన తరువాత బాలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేస్తూనే, హీరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకోసం విసుగనేది లేకుండా ఆడిషన్స్ ఇస్తుంటాడు .. అవమానాలు ఎదుర్కుంటూ ఉంటాడు. ఈ విషయంలో ఫ్రెండ్స్ అతనికి ధైర్యం చెబుతూ ఉంటారు. ఇక ఇదే సమయంలో జెనీ (వేదిక) అనే యువతి స్టేజ్ సింగర్ గా .. డాన్సర్ గా మంచి పేరు తెచ్చుకుంటుంది. అంతా ఆమెను గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. 

ఇక స్థానికంగా సముద్రంలోని చేపల వేటకి .. బిజినెస్ కి సంబంధించి, వీరమణి ముఠాకి .. మైఖేల్ ముఠాకి మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అనుకోకుండానే ఆ రెండు ముఠాలకి బాలు శత్రువుగా మారతాడు. అప్పటి నుంచి ఆ రెండు ముఠాలు ఆయన కోసం గాలిస్తూ ఉంటాయి. స్కూల్ రోజుల్లో జానకి అనే అమ్మాయిని బాలు ప్రేమిస్తాడు. అప్పుడప్పుడు ఆమెను గుర్తు చేసుకుని అతను బాధపడుతూ ఉంటాడు.

ఎంతగా ప్రయత్నిస్తున్నా హీరోగా అవకాశాలు రాకపోవడంతో బాలు సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. బ్రిడ్జ్ పై నుంచి నదిలోకి దూకేయాలని నిర్ణయించుకుని అక్కడికి వెళతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? సినిమా హీరో కావాలనే బాలు కోరిక నెరవేరుతుందా? గతంలో తాను ప్రేమించిన జానకి ఇప్పుడు ఎక్కడ ఉంటోంది? ఆమెను అతను పెళ్లి చేసుకోగలుగుతాడా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ సినిమాకి దినిల్ కథను అందించగా, ఎస్ జె సిను దర్శకత్వం వహించాడు. హీరో స్కూల్ ఏజ్ లో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. పెద్దయిన తరువాత అతను ఆ అమ్మాయిని కలుసుకోవాలనుకుంటాడు .. అలాగే సినిమా హీరో కావాలనుకుంటాడు. అందుకోసం సాగే ప్రయత్నాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. అతని ప్రయత్నాలు నెరవేరుతాయా లేదా? అనే అంశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.  

బాలు తాను సినిమా హీరోను కావాలనే బలమైన పట్టుదలతో ఉంటాడు. మరో వైపున సముద్రంలో  చేపల వేటకి సంబంధించి లోకల్ రౌడీల మధ్య ఆధిపత్య పోరాటం నడుస్తూ ఉంటుంది. ఇక సింగర్ గా .. డాన్సర్ గా పాప్యులారిటీ తెచ్చుకున్న జెనీ ఎవరనే సస్పెన్స్ మరో వైపు నుంచి కొనసాగుతూ ఉంటుంది. ఇలా దర్శకుడు ఈ మూడు ట్రాకుల వైపు నుంచి కథను నడిపిస్తూ ఉంటాడు. ఈ మూడు ట్రాకులను ఇంట్రెస్టింగ్ గా మలిచాడా అంటే లేదనే చెప్పాలి.

బాలు తాను హీరో కావడానికి సీరియస్ గా ప్రయత్నించినట్టు కనిపించడు. చేపల వేట విషయంలో లోకల్ రౌడీల ఆధిపత్య పోరాటం కూడా సీరియస్ గా అనిపించదు. అలాగే జెనీ ఎవరనే ట్రాక్ కూడా. అన్నింటికీ దర్శకుడు కామెడీ టచ్ ఇస్తూ వెళ్లాడు .. కానీ ఎక్కడా అది వర్కౌట్ కాలేదు. ఇక బాలు ఫ్రెండ్స్ బ్యాచ్ లో కూడా మంచి ఆర్టిస్టులే ఉన్నారు. కానీ వాళ్ల కాంబినేషన్ లో ఒక్క కామెడీ సీన్ కూడా పండలేదు. క్లైమాక్స్ వరకు ఎదురుచూసినా, ఆడియన్స్ ఆశించిన ఎంటర్టైన్మెంట్ మాత్రం దొరకదు. 

పనితీరు: ఆర్టిస్టులంతా మంచి అనుభవం ఉన్నవారే.  క్రేజ్ ఉన్న ఆర్టిస్టుల జాబితాలో ఉన్నవారే. అయితే కథలో బలం లేకపోవడం .. కొత్తదనం కనిపించకపోవడం వలన, సన్నివేశాలు తేలిపోతూ ఉంటాయి. ప్రభుదేవా మంచి డాన్సర్ .. ఆ వైపు నుంచి ఈ సినిమా కొన్ని మార్కులు కొట్టేస్తుందేమో అనుకుంటే అది కూడా కనిపించదు. 

జీతూ దామోదర్ ఫొటోగ్రఫీ .. ఇమ్మాన్ సంగీతం .. నిషాద్ యూసఫ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. దర్శకుడు తాను ఎంచుకున్న కథపై సరైన కసరత్తు చేయకపోవడం .. కామెడీపై ఎక్కువగా ఆధారపడటం .. ఆ కామెడీ వర్కౌట్ కాకపోవడం వలన, ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరుస్తుంది. 

Movie Name: Petta Rap

Release Date: 2024-11-24
Cast: Prabhu Deva, Vedhika, Bagavathi Perumal, Ramesh Thilakas, Vivek Prasanna
Director:S J Sinu
Producer: Jobi P Sam
Music: D Imman
Banner: Blue Hill Films

Rating: 2.00 out of 5

Trailer

More Reviews