శివరాజ్ కుమార్ - ప్రభుదేవా కథానాయకులుగా కన్నడలో రూపొందిన సినిమానే 'కరటక దమనక'. రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించిన ఈ సినిమాకి, యోగరాజ్ భట్ దర్శకత్వం వహించాడు. ప్రియా ఆనంద్ - నిశ్వికా నాయుడు కథానాయికలుగా నటించిన ఈ సినిమా, మార్చి 8వ తేదీన థియేటర్లకు వచ్చింది. జులై 12 నుంచి కన్నడలోనే స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, రీసెంటుగా తెలుగు .. తమిళ .. హిందీ భాషలలో అందుబాటులోకి వచ్చింది.
కథ: విరూపాక్ష (శివరాజ్ కుమార్) బాలరాజు (ప్రభుదేవా) ఇద్దరూ అనాథలు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ తమ మాయ మాటలతో ఎదుటివారిని బురిడీ కొట్టిస్తూ .. దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. అలాగే ఒక మినిస్టర్ ను బురిడీ కొట్టించడానికి ప్రయత్నించి జైలుపాలవుతారు. జైల్లో ఆత్మహత్య చేసుకోబోయిన ఒక ఖైదీని ఇద్దరూ తమ మాటలతో ప్రభావితం చేయడం జైలర్ చూస్తాడు. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది.
జైలర్ తల్లిదండ్రులు 'నందికోలూరు' అనే గ్రామంలో నివసిస్తూ ఉంటారు. ఆ ఊళ్లోని కొండపై నందీశ్వరుడు కొలువై ఉంటాడు. అక్కడి ప్రజల ఇలవేల్పు ఆయనే. అయితే చాలా కాలంగా అక్కడ వర్షాలు పడకపోవడంతో .. పంటలు లేక కరవుకాటకాలతో ప్రజలు అవస్థలు పడుతుంటారు. చాలామంది ఆ గ్రామాన్ని వదిలిపెట్టి పట్నాలకు వెళ్లిపోతారు. దాంతో దేవుడికి జాతర జరగక పదేళ్లు అవుతుంది. ఎమ్మెల్యే మొగిలప్ప ( రంగాయన రఘు) ఆ గ్రామాన్ని గురించి పట్టించుకోకపోగా, అవసరమైతే ఖాళీచేసి వెళ్లిపొమ్మని అంటూ ఉంటాడు.
ఈ విషయమై (తనికెళ్ల భరణి) జైలర్ గా ఉన్న తన కొడుకును కలుస్తాడు. తమ ఊరు జాతర జరిపించమని బ్రతిమాలి వెళతారు. అయితే అక్కడికి వెళ్లడం ఎంతమాత్రం ఇష్టం లేని జైలర్, తన ఊరుకి వెళ్లి .. తన పేరెంట్స్ ను ఒప్పించి సిటీలో తనతో పాటు ఉండేలా ఒప్పించమని ఇద్దరు ఖైదీలతో చెబుతాడు. అలా చేస్తే వాళ్ల శిక్ష రద్దు అయ్యేలా చేస్తానని మాట ఇస్తాడు. అయితే తాను పంపించినట్టుగాగానీ .. వాళ్లు ఖైదీలనే విషయంగాని బయటికి రాకుండా చూసుకోమని హెచ్చరిస్తాడు.జైలర్ చెప్పినట్టుగా చేయడం కోసం విరూపాక్ష - బాలరాజు ఇద్దరూ నందికోలూరు వెళతారు. అక్కడ ఏం జరుగుతుంది? అనుకున్నది సాధించడం కోసం వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటారు? అనేది కథ.
విశ్లేషణ: వికాస్ - యోగరాజ్ భట్ అల్లుకున్న కథ ఇది. 'పంచతంత్రం'లోని 'మిత్రభేదం' నుంచి ఈ టైటిల్ ను తీసుకున్నారు. అందువలన టైటిల్ తోనే ఈ సినిమా అందరిలో ఆసక్తిని రేకెత్తించింది .. అంచనాలను పెంచింది. మరి ఆ స్థాయిలో ఈ సినిమా ఉందా? అంటే లేదనే చెప్పాలి.
అనాథలైన ఇద్దరు ఖైదీలు .. తమ శిక్ష రద్దు కావడం కోసం, జైలర్ చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకుంటారు. జైలర్ తండ్రిని ఒప్పించి ఆయనను పట్నం తీసుకురావడానికి వెళ్లిన వారు, ఆ ఊరును .. అక్కడి ప్రజలను ఎలా ప్రభావితం చేశారనేది కథ. నిజానికి ఇది ఇంట్రెస్టింగ్ లైనే. అయితే దానిని తెరపై ఆశించినస్థాయిలో దర్శకుడు ఆవిష్కరించలేక పోయాడేమోనని అనిపిస్తుంది.
ముందుగా .. తన తండ్రి తనతో పాటే ఉండాలనే ఒక బలమైన ఎమోషన్ ను జైలర్ పాత్ర వైపు నుంచి చూపించలేకపోయారు. ఇక తన ఊరంటే ప్రేమ ఉన్నప్పటికీ రామన్న పాత్రా కాస్త అతిగా అనిపిస్తుంది. ఎమ్మెల్యే కీలకమైన వ్యక్తి అయినప్పటికీ ఆయన విలనిజం తక్కువ .. ఆయన అనుచరుడి వీరంగం ఎక్కువ. ఇక ఇద్దరు ఖైదీలు ఇలా ఊళ్లోకి అడుగుపెడుతూ ఉండగానే .. హీరోయిన్స్ వాళ్ల ప్రేమలో పడటం నాటకీయంగా అనిపిస్తుంది.
ఇంకా రెండున్నరేళ్ల శిక్షను అనుభవించవలసిన ఖైదీలను జైలర్ బయటికి పంపిస్తున్నాడంటే అది కాస్త పెద్ద ఆపరేషన్ అయ్యుంటే బాగుండేది. ఊళ్లోని పరిస్థితులు తన తండ్రిని ఎక్కువగా బాధపెడుతున్నాయని తెలిసినప్పుడు, వాటిని చక్కదిద్దే బాధ్యతను ఇద్దరు ఖైదీలకు అప్పగిస్తే వేరేగా ఉండేది. అలా కాకుండా ' నా దగ్గర ఉండటానికి మా నాన్నను ఒప్పించండి' అనడంలోనే కథ తేలిపోయిదేమో అనే భావన కలుగుతుంది.
పనితనం: ప్రధానమైన పాత్రలలో శివరాజ్ కుమార్ .. ప్రభుదేవా మెప్పిస్తారు. ప్రభుదేవాతో పటు శివరాజ్ కుమార్ స్టెప్పులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుంది. ఇక హీరోయిన్స్ పాత్రలను మాత్రం సరిగ్గా డిజైన్ చేయలేదు. గ్లామరస్ గా చూపించడానికే ప్రయత్నించారు.
సంతోష్ రాయ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. విలేజ్ నేపథ్యంలోని సీన్స్ .. సాంగ్స్ విషయంలో ఆయన సెట్ చేసిన లైటింగ్ బాగుంది. హరికృష్ణ ఒకటి రెండు బాణీలు .. నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. ప్రకాశ్ ఎడిటింగ్ ఓకే.
'కరటక దమనక' అనే నీతికథ ఎంతో ప్రాచుర్యంలో ఉన్న కథ. ఆ కథకు .. ఈ సినిమా కథకు ఎలాంటి పోలిక కనిపించదు. సినిమాలో ఒకటి రెండు చోట్ల నక్కలను చూపించి సరిపెట్టుకున్నారు. నాకా ఎక్కడా వాటి ప్రస్తావన రాదు. ఆ టైటిల్ కి తగినట్టుగా ఇద్దరు హీరోల పాత్రలను మలచడం జరగలేదు కూడా. అందువలన టైటిల్ తో ఆసక్తిని రేపి .. కసరత్తు లేని కంటెంట్ తో నిరాశ పరిచే కథగానే ఇది మిగిలిపోతుంది.
'కరటక దమనక' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Karataka Damanaka Review
- కన్నడలో రూపొందిన సినిమా
- కొంతకాలంగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
- రీసెంటుగా తెలుగులోను అందుబాటులోకి
- టైటిల్ కి తగినట్టుగా లేని కంటెంట్
Movie Name: Karataka Damanaka
Release Date: 2024-12-02
Cast: Shivaraj Kumar, Prabhudeva, Priya Anand, Nihvika Naidu, Ravi Shankar
Director:Yogaraj Bhat
Producer: Rockline Venkatesh
Music: Harikrishna
Banner: Rockline Entertainments
Review By: Peddinti
Rating: 2.25 out of 5
Trailer