'తనావ్' .. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్. సీజన్ 1లో భాగంగా రెండేళ్ల క్రితం 12 ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ కి వచ్చాయి. ఒకవైపున ఉగ్రవాదం .. మరో వైపున దానిని అంతం చేయడానికి ఏర్పాటైన 'స్పెషల్ టాస్క్ గ్రూప్'కి మధ్య జరిగే పోరాటమే కథ. సీజన్ 1కి విశేషమైన ఆదరణ లభించడంతో, సీజన్ 2ను కూడా 12 ఎపిసోడ్స్ గా రూపొందించారు. 24 ఎపిసోడ్స్ ను ఈ నెల 6వ తేదీ నుంచి 7 భాషల్లో అందుబాటులోకి తెచ్చారు. సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: కశ్మీర్ ను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ఉగ్రవాద ముఠా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అందుకు సంబంధించిన పనులను వేగవంతం చేయడం మొదలుపెడుతుంది. ఆ ఉగ్రవాదాన్ని అణచివేయడానికి 'స్పెషల్ టాస్క్ గ్రూప్' ( STG) తనవంతు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. జగిత్ మాలిక్ (రజత్ కపూర్) .. విక్రాంత్ (అర్బాజ్ ఖాన్) నేతృత్వంలో టీమ్ ముందుకు వెళుతూ ఉంటుంది. ఈ బృందంలో కబీర్ (మానవ్ విజ్) .. అర్జున్ .. కునాల్ .. తోషి .. పని చేస్తూ ఉంటారు.
ఫరీద్ ( గౌరవ్ అరోరా) తన తండ్రి ఉమర్ రియాజ్ మరణానికి కారణమైన స్పెషల్ టాస్క్ బృందం పై పగ బడతాడు. ఐసిస్ తో సంబంధాలు పెట్టుకున్న అతను,స్పెషల్ టాస్క్ పై ప్రతీకారాన్ని తీర్చుకునే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అతని సూచనల మేరకు జునైద్ ( శశాంక్ అరోరా) పనిచేస్తూ ఉంటాడు. డాక్టర్ ఫరా (ఏక్తా కౌల్) జునైద్ తో కలిసి జీవిస్తూ ఉంటుంది. గతంలో ఆమెతో ఉన్న అనుబంధం కారణంగా, ఆమెను జునైద్ వలలో నుంచి బయటకి తీసుకు రావాలనే ఆలోచనలో కబీర్ ఉంటాడు.
కబీర్ కారణంగా ఆయన తమ్ముడు ఫహాద్ .. ఫహాద్ భార్యగా తాను స్పషల్ టాస్క్ వారి చేతిలో చనిపోవడం ఖాయమనే భయంతో 'ఆయత్' ఉంటుంది. ఫహాద్ ద్వారా ఫరీద్ ను .. ఫరా ద్వారా జునైద్ ను పట్టుకోవాలని స్పెషల్ టాస్క్ టీమ్ భావిస్తుంది. అప్పుడు ఫరీద్ ఆచూకీ తెలుసుకోవడం తేలిక అవుతుందనే నిర్ణయానికి వస్తుంది. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి వ్యూహాలు పన్నుతారు? ఆ ఉచ్చులో ఫరీద్ పడతాడా? లేదా? అనేది కథ.
విశ్లేషణ: 'తనావ్' సీజన్ 1కి కొనసాగింపుగానే సీజన్ 2 నడుస్తుంది. ఐసిస్ లో శిక్షణ పొందిన ఫరీద్, సిరియా నుంచి తిరిగి రావడం, తన తండ్రి మరణానికి కారకుడైన కబీర్ ను అంతం చేయడానికి ప్లాన్ చేయడంతో .. కశ్మీర్ లో మరో విధ్వంసం జరగడానికి రంగం సిద్ధమవుతుందని భావించిన స్పెషల్ టాస్క్ దూకుడు పెంచడంతో సీజన్ 2 మొదలవుతుంది. దర్శకులు సుధీర్ మిశ్రా - నివాస్ సీజన్ 2ను రక్తికట్టించారా అంటే, అందులో సందేహం లేదనే చెప్పాలి.
ఈ కథా పరిధి చాలా విస్తృతమైనది .. అలాగే పాత్రల సంఖ్య కూడా ఎక్కువే. కథ తరచూ లొకేషన్స్ మారుతూ ఉంటుంది. ఈ కథకు తగిన లొకేషన్స్ ను ఎంపిక చేయడం వలన, కథ మరింత త్వరగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. స్పెషల్ టాస్క్ గ్రూప్ లోని వారి జీవితాలను .. అలాగే తీవ్రవాదుల కుటుంబాల పరిస్థితులను దగ్గరగా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. రెండు వైపుల నుంచి ఉండే ఎమోషన్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అధీర్ భట్ తో కలిసి డైరెక్టర్ వేసిన స్క్రీన్ ప్లే ఈ సీజన్ కి హైలైట్. అన్ని పాత్రలను కలుపుకుంటూ ఆయన కథను నడిపంచిన విధానం ఈ సీజన్ కి ప్రధానమైన బలం.
స్పెషల్ టాస్క్ టీమ్ కి సంబంధించిన పోలీస్ ఆఫీసర్స్ కి .. ఉగ్రవాదులకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలే ఈ సీజన్ కి కీలకం. అలాంటి యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రతి పాత్రను రిజిస్టర్ చేయడం వలన, ఆ పాత్ర అలా గుర్తుండిపోతుంది. ఎక్కడా అనవసరమైన దృశ్యాలు కనిపించవు. ఒకటి రెండు చోట్ల హాట్ సీన్స్ మెరుపులా వచ్చి పోతాయంతే. అభ్యంతరకరమైన డైలాగ్స్ మాత్రం లేవు.
పనితీరు: ప్రధానమైన పాత్రలను పోషించిన ప్రతి ఆర్టిస్ట్ కూడా, తమ పాత్రలకు జీవం పోశారు. కశ్మీర్ లో జరుగుతున్న ఉగ్రదాడిని ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అంతలా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకులు యాక్షన్ తో పాటు ఎమోషనల్ డ్రామాను ఇంట్రెస్టింగ్ గా నడిపించడంలో మంచి మార్కులు కొట్టేశారు. ఇక నిర్మాణం పరంగా కూడా ఈ సీజన్ కి ఎక్కడా వంకబెట్టలేం.
ఖవాస్ వాజిద్ ఫొటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ .. యాక్షన్ .. ఛేజింగ్ దృశ్యాలను తెరపై ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. కరెల్ ఆంటోనిన్ నేపథ్య సంగీతం, సందర్భానికి తగినట్టుగా సాగుతూ ఆకట్టుకుంటుంది. అభిషేక్ సేథ్ ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా కథ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఇష్టపడేవారికి, ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుంది.
'తనావ్ 2' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!
Tanaav 2 Review
- రెండేళ్ల క్రితం వచ్చిన సీజన్ 1
- సీజన్ 2గా వచ్చిన 12 ఎపిసోడ్స్
- ప్రధానమైన బలంగా నిలిచే స్క్రీన్ ప్లే
- యాక్షన్ - ఎమోషన్స్ తో మెప్పించే సిరీస్
- భారితనమే ప్రత్యేకమైన ఆకర్షణ
Movie Name: Tanaav 2
Release Date: 2024-12-06
Cast: Manav Vij, Arbaaz Khan, Shashank Arora, Rajath Kapoor, Sathyadeep Mishra, Gourav Arora
Director:Sudhir Mishra - E Niwas
Producer: Sameer Nair -Deepak - Siddharth Khaitan
Music: Karel Antonín
Banner: company Applause Entertainment
Review By: Peddinti
Rating: 3.50 out of 5
Trailer