బండి సరోజ్ కుమార్ దర్శకత్వం వహించిన 'పరాక్రమం' సినిమా, ఈ ఏడాది ఆగస్టు 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆయన కథానాయకుడిగా నటిస్తూ, నిర్మాతగాను వ్యవహరించిన సినిమా ఇది. యాక్షన్ డ్రామా జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూద్దాం.

కథ: అది తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 'లంప కలోవ' గ్రామం. అక్కడ లోవరాజు ( బండి సరోజ్ కుమార్) తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతనికి చిన్నప్పటి నుంచి నాటకాలు .. క్రికెట్ అంటే ప్రాణం. నాటకాల పట్ల అతనికి ఇష్టం ఏర్పడటానికి కారణం అతని తండ్రి సత్తిబాబు (బండి సరోజ్ కుమార్). సత్తిబాబుకి యముడి వేషం వేయాలని ఎంతో ఆసక్తిగా ఉండేది. ఆ ఊళ్లోని మునసబుకి యమగండం ఉంటుంది. అందువలన అతను యముడి పేరు వింటేనే భయపడిపోతూ ఉంటాడు. యముడి వేషం వేయడానికి వీల్లేదని సత్తిబాబును అడ్డుకుంటూ ఉంటాడు.

 లోవరాజును అతని మరదలు భవాని ప్రేమిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమెను ఇష్టపడతాడు. అయితే మునసబు కూతురు లక్ష్మి కూడా లోవరాజును ప్రేమిస్తూ ఉంటుంది. అయితే లక్ష్మి అన్నయ్య నానాజీకి మాత్రం లోవరాజు అంటే విపరీతమైన ద్వేషం ఉంటుంది. ఎందుకంటే లోవరాజు కారణంగా నానాజీ టీమ్ క్రికెట్ లో ఎప్పుడూ ఓడిపోతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లోవరాజు 'పరాక్రమం' అనే ఒక నాటకాన్ని రాసుకుంటాడు. ఆ నాటకాన్ని హైదరాబాద్ లోని 'రవీంద్రభారతి'లో ప్రదర్శించాలనేది అతని కల. 

హైదరాబాద్ లో చదువుతున్న లక్ష్మి,  లోవరాజు 'పరాక్రమం' నాటకానికి కాస్ట్యూమ్స్ డిజైన్ చేయాలని అనుకుంటుంది. లోవరాజు హైదరాబాద్ వచ్చే సమయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈ లోగా భవాని విషయంలో లోవరాజు ఒక పోలీస్ ఆఫీసర్ తో గొడవపడతాడు. తనని ఆమె మోసం చేసిందని తెలిసి హర్ట్ అవుతాడు. మునసబు వలన తన తండ్రి ఎంతగా బాధపడింది ఆ సమయంలోనే లోవరాజుకి తెలుస్తుంది. అతణ్ణి దెబ్బతీయడానికి మునసబు .. అతని కొడుకు నానాజీ .. పోలీస్ ఆఫీసర్ ఒకటవుతారు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: సాధారణంగా చాలామంది ఎదుటివాడిని భయపెట్టడానికి తమ బ్యాక్ గ్రౌండ్ చెబుతూ ఉంటారు. అలాంటి బ్యాక్ గ్రౌండ్ చూసి భయపడనివాడే హీరో.  'నీ వెనకేం ఉంది .. నీ వెనక ఎవరున్నారు? అనేది కాదు, నీలో ఏవుంది? అనేది చూసుకో.. 'పరాక్రమం' ఉన్నోడిని ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ హీరో స్వయంగా చెప్పే డైలాగ్ ను ప్రధానంగా చేసుకునే ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు.

 ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. గ్రామాలు చిన్నవే అయినా అక్కడ రాజకీయాలు పుష్కలంగా ఉంటాయి. ఆటల దగ్గర నుంచి ఆవేశాలు .. గొడవలు తారసపడుతూనే ఉంటాయి.  అవినీతి .. అధికారం అనేవి అక్కడ కూడా తమ హవా కొనసాగిస్తూ ఉంటాయి. ఇక క్షుద్రపూజల వంటి మూఢ నమ్మకాలు కూడా విలేజ్ లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి అంశాలను కలుపుతూ సహజత్వానికి దగ్గరగా వెళ్లిన కథ ఇది. 

బండి సరోజ్ తన పాత్రను మలచుకున్న తీరు బాగుంది. అతని పాత్ర చాలా కేర్ లెస్ గా ఉంటుంది. కానీ తల్లి పట్ల ప్రేమ .. స్నేహితుడి పట్ల అభిమానం .. అమ్మాయిల పట్ల గౌరవం .. అవమానానికి ఎదురెళ్లే పట్టుదల ఉంటాయి. హీరో తన సమస్యలతో పాటు ఊరు సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్లిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. 

పనితీరు
: అన్నీ తానై బండి సరోజ్ కుమార్ ఈ సినిమాను నడిపించాడని చెప్పాలి. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటలు .. సంగీతం .. ఎడిటింగ్ ..  నిర్మాణం .. దర్శకత్వం ఇలా అన్ని విషయాలను ఆయనే చక్కబెట్టాడు. చాలా తక్కువ బడ్జెట్ లో ఆయన అందించిన కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది.

కథ .. స్క్రీన్ ప్లే .. హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు ఆసక్తికరంగానే అనిపిస్తుంది. సంభాషణలు కూడా చాలా సహజంగా అనిపిస్తాయి. ఇద్దరు హీరోయిన్స్ పాత్రల విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. అలాగే పోలీస్ ఆఫీసర్ .. మునసబు పాత్రలను ఇంకాస్త బలంగా నిలబెట్టవలసింది. 

ముగింపు: బండి సరోజ్ కుమార్ మార్క్ సినిమాలు ఎలా ఉంటాయనే విషయంలో చాలామంది ఆడియన్స్ కి ఒక ఐడియా ఉంటుంది. తాను చెప్పదలచుకున్న కథ విషయంలో ఆయన ఎలాంటి మొహమాటాలు పెట్టుకోడు. కానీ ఈ సినిమా విషయంలో అలాంటివేమీ తగలవు. ఒక్క నరబలి దృశ్యాలు మినహాయిస్తే, తనకున్న బడ్జెట్ లో తాను చెప్పదలచుకున్నది నీట్ గా చెప్పాడనే అనుకోవాలి.