ఇటీవల 'క' చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు హీరో కిరణ్‌ అబ్బవరం. ఈ చిత్రం సక్సెస్‌తో ఆయన ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దాంతో కిరణ్‌ నటిస్తున్న 'దిల్‌ రూబా' చిత్రంపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. దీనికి తోడు ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి బజ్‌ కూడా వచ్చింది. అయితే ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన 'దిల్ రూబా' చిత్రంప్రేక్షకులను ఆకట్టుకుందా? ఎలాంటి కథాంశంతో ఈ చిత్రం రూపొందింది? ఈ చిత్రం కిరణ్‌ అబ్బవరంకు హిట్‌ను అందించిందా? లేదా తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే... 

కథసిద్ధు రెడ్డి (కిరణ్‌ అబ్బవరం) చిన్నప్పటి నుంచి తనతో  కలిసి పెరిగిన మ్యాగీ (క్యాతి డేవిసన్‌) ను ప్రేమిస్తాడు. ఆపదలో ఉన్న ఓ స్నేహితుడిని తన బిజినెస్‌లో పార్టనర్‌గా చేర్చుకుంటే, ఆ స్నేహితుడే తనను మోసం చేయడం తట్టుకోలేక ఆ బాధలో సిద్ధు తండ్రి మరణిస్తాడు. ఈ తరుణంలోనే కొన్ని కారణాల వల్ల మ్యాగీతో సిద్ధుకు బ్రేకప్‌ అవుతుంది. ఇక అప్పటి నుంచే తన జీవితంలో సారీ, థ్యాంక్స్‌ అనే మాటలకు దూరంగా ఉండాలని సిద్ధు నిర్జయించుకుంటాడు.

బ్రేకప్‌ నుంచి మూవ్‌ ‌ఆన్ అవడానికి బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో జాయిన్‌ అవుతాడు సిద్ధు. అక్కడ పరిచయమైన అంజలి (రుక్సర్‌ థిల్లాన్‌)ను ప్రేమిస్తాడు. అయితే కాలేజీలో జరిగిన ఓ గొడవ వల్ల వీళ్లిద్దరు కూడా విడిపోవాల్సి వస్తుంది. అమెరికాలో ఉంటున్న మ్యాగీ ఇది తెలుసుకుని ఇండియాకు చేరుకుంటుంది. ఇద్దరిని కలపడానికి ప్రయత్నిస్తుంది. అయితే సిద్ధు-అంజలి మధ్య జరిగిందేమిటి? ఈ ఇద్దరిని మ్యాగీ ఎలా కలిపింది? అసలు మ్యాగీ, సిద్ధుకు బ్రేకప్‌ చెప్పడానికి కారణమేమిటి? అనేది మిగతా కథాంశం. 

విశ్లేషణ: ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ. కథ, కథనాలు సాదాసీదాగా ఉండటంతో సినిమా ఎక్కడా కూడా ఆస్తకిగా అనిపించదు. ముఖ్యంగా హీరో పాత్ర చుట్టూ అల్లుకున్న కథలా అనిపిస్తుంది. బలమైన కథ లేకపోవడం వల్ల సినిమా స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్‌హాఫ్ పర్వాలేదనిపించుకున్నా, సెకండాఫ్‌ మరింత పేలవంగా అనిపిస్తుంది. హీరో తన జీవితంలో ఎవరికీ థ్యాంక్స్‌, సారీ చెప్పడు అనే పాయింట్‌ను డీల్‌ చేసిన విధానం అంత కన్వీన్సింగ్‌గా అనిపించదు. 

సినిమాలో జరిగే కొన్ని ముఖ్య సన్నివేశాలు  చూస్తుంటే సారీ చెబితే కథ అక్కడితో ముగిసిపోయేది  కదా.. ఇన్ని సమస్యలు వచ్చేవీ కాదు కదా.. అని ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలుగుతుంది. దీంతో రాబోయే సన్నివేశాలపై పెద్దగా ఆసక్తి కలగదు. కథలోని ఎమోషన్‌తో ప్రేక్షకుడు ఎక్కడా కూడా కనెక్ట్‌ కాలేడు. హీరో పాత్రతో అవసరం ఉన్నా లేకపోయినా దర్శకుడు వాట్సాప్‌, ఇన్‌స్టా  కొటేషన్స్‌ లాంటి డైలాగ్స్‌ చెప్పించడం అసహజంగా అనిపిస్తుంది. 

సినిమా ప్రారంభంలో కొన్ని సన్నివేశాలు కథ, కథనాలపై ఇంట్రెస్ట్‌ కలిగించినా ఆ తరువాత దర్శకుడు దానిని కొనసాగించలేక పోయాడు. సాధారణంగా లవ్‌స్టోరీ అంటే యూత్‌ను అలరించే అంశాలు ఉంటే సినిమా ఎక్కడా బోరింగ్‌గా అనిపించదు. దర్శకుడు ఆ వైపు దృష్టి పెట్టలేదనిపిస్తుంది. కాలేజీ నేపథ్యంలో కొనసాగే ఈ కథలో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ సన్నివేశాలకు స్కోప్‌ ఉందనిపించింది. అయితే దర్శకుడు ఆ విషయాన్ని విస్మరించాడు. ముఖ్యంగా కమెడియన్‌ సత్య పాత్రలో వినోదాన్ని,  నిడివిని మరింత పెంచి ఉంటే సినిమాకు ప్లస్‌ అయ్యేది. 

కథ వీక్‌గా ఉన్నప్పుడు కనీసం కామెడీతోనైనా పాస్‌ మార్కులు సంపాందించుకునే అవకాశం ఉండేది.  సినిమా ఫస్ట్‌ హాఫ్‌ ముగిసిన తరువాత సెకండాఫ్‌ మరింత భారంగా అనిపిస్తుంది. సెకండాఫ్‌ మొదలైన కాసేపటికే సినిమాపై ఆశలు సన్నగిల్లిపోతాయి. సిద్ధు, అంజలిని కలపడానికి మ్యాగీ చేసే ప్రయత్నాలు ఆకట్టుకోవు.  ఇక విలన్‌గా కనిపించిన జోకర్‌ పాత్ర మరీ విసిగించింది. టోటల్‌గా 'దిల్‌ రూబా' ప్రేక్షకుల 'దిల్‌'ను థ్రిల్ల్‌ చేయడంలో సక్సెస్‌ కాలేదు. 

నటీనటుల పనితీరు: సిద్ధుగా కిరణ్‌ అబ్బవరం ఉత్సాహంగా కనిపించాడు. దర్శకుడు తనకు డిజైన్ చేసిన పాత్రకు న్యాయం చేశాడు. లుకింగ్‌ వైజ్‌ కొత్తగా ఉన్నాడు. అంజలిగా రుక్సర్‌ ఎంతో ఎనర్జీగా అనిపిస్తుంది. సినిమాలో ఆమె  పాత్ర ఆకట్టుకుంటుంది. అయితే మ్యాగీ పాత్రలో క్యాతి డేవిసన్‌ కు పర్‌ఫార్మెన్స్‌కు పెద్దగా స్కోప్‌ లేదు. 

ఆమె పాత్రను దర్శకుడు ఆసక్తిగా తీర్చిదిద్దడంలో విఫలమయ్యాడు. దర్శకుడు డైలాగ్స్‌లో పూరీ జగన్నాథ్‌ మార్క్‌ కనిపించింది కానీ ఆ మ్యాజిక్‌ వర్కవుట్‌ కాలేదు. సామ్‌ సీఎస్‌ సంగీతం మార్క్‌ రెండు పాటల్లో కనిపించింది. డేనియల్‌ విశ్వాస్‌ ఫోటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా ఉంది. లవ్‌స్టోరీకి కావాల్సిన మూడ్‌ను ఆయన సమాకూర్చాడు. మేకింగ్‌ రిచ్‌గా ఉంది. 

ఫైనల్‌గా 'క'లాంటి కంటెంట్‌ ఓరియెంటెడ్‌ సినిమా తరువాత కిరణ్‌ అబ్బవరం నుంచి వచ్చిన ఈ 'దిల్‌ రూబా' సాదాసీదా కథతో ఉండటంతో ప్రేక్షకులు నిరాశపడక తప్పదు. కథ, కిరణ్‌ పాత్రలో ఏ మాత్రం కొత్తదనం లేకపోవడం, బలమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే వినోదం కొరవడటం ఈ సినిమాకు  మైనస్‌గా మారింది. టోటల్‌గా కిరణ్‌ అబ్బవరం 'దిల్‌ రూబా'తో  ప్రేక్షకులకు సారీ చెప్పాడు.