'విడుదల పార్టు 1' - మూవీ రివ్యూ

Vidudhala

Vidudhala Review

  • వెట్రిమారన్ నుంచి వచ్చిన 'విడుదల - పార్టు 1'
  • అడవి నేపథ్యంలో నడిచే బలమైన కథ .. ఆసక్తికరమైన కథనం
  • అధికారానికీ .. తిరుగుబాటుకు మధ్యలో నడిచే ప్రేమకథ
  • సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ 
  • నటనలో పోటీపడిన సూరి - విజయ్ సేతుపతి  

కోలీవుడ్ దర్శకులలో వెట్రి మారన్ స్థానం ప్రత్యేకం. తాను తయారు చేసిన కథలలో పాత్రలకి తగిన నటీనటులను ఎంచుకోవడం ఆయనకి అలవాటు. అలాగే ఎలాంటి హంగులూ .. ఆర్భాటాలు లేకుండా ఎంత సహజంగా ఆ కథను ప్రేక్షకుల ముందు ఉంచుతున్నామనే విషయానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేస్తుంటారు. అలాంటి ఆయన కమెడియన్ సూరిని హీరోగా తీసుకుని చేసిన సినిమానే 'విడుదల'. 

తమిళంలో 'విడుదలై' టైటిల్ తో క్రితం నెల 31వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో పాటు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలను అందుకుంది. భవానిశ్రీ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, విజయ్ సేతుపతి కీలకమైన పాత్రను పోషించాడు. ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, తెలుగులో 'విడుదల' టైటిల్ తో ఈ రోజున థియేటర్లకు తీసుకొచ్చారు. ఇక్కడి ఆడియన్స్ కి ఈ సినిమా ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది ఇప్పుడు చూద్దాం. 

"ఈ కథ 1987లో మొదలవుతుంది .. జరిగిన సంఘటనలను గురించి హీరో తన తల్లితో చెబుతున్నట్టుగా ఈ కథ నడుస్తూ ఉంటుంది. కుమరేశన్ ( సూరి) పోలీస్ గా జాబ్ సంపాదించుకుంటాడు. 'అరువపురం' ఏజెన్సీ ప్రాంతంలో పోస్టింగ్ కావడంతో అక్కడికి చేరుకుంటాడు. అసలే అతను పిరికివాడు .. అదే ఫస్టు పోస్టింగ్ కావడంతో కంగారుపడతాడు. ఆ అడవి .. అక్కడి వాతావరణం చూసి భయపడతాడు.  

అక్కడే అతను పెరుమాళ్ (విజయ్ సేతుపతి) పేరు వింటాడు. అతను ప్రజాదళం నాయకుడు. అడవికీ .. గిరిజనులకు హాని కలిగించడానికి ఎవరు ప్రయత్నించినా తుపాకీతోనే సమాధానం చెప్పడం ఆయనకి అలవాటు. ఎంతోమంది పోలీసులను అంతం చేసిన చరిత్ర అతనిది.  మైనింగ్ మాఫియా అడవిని ఆక్రమించడానికి అడ్డుపడుతున్న పెరుమాళ్ ను లేపేయాలని స్వార్థపరులైన కొంతమంది రాజకీయ నాయకులు .. అవినీతి అధికారులు ప్లాన్ చేస్తారు.

పెరుమాళ్ ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. పోలీస్ అధికారులు ఆయన ఊహాచిత్రాన్ని గీయించగా, అతణ్ణి తాను ఎక్కడ చూసింది కుమరేశన్ కి గుర్తొస్తుంది. ఆ విషయాన్ని అతను చెప్పినా అధికారులెవరూ పట్టించుకోరు. పోలీస్ పైఅధికారుల నిరంకుశ ధోరణి అతణ్ణి నిరుత్సాహ పరుస్తుంది. తనలాంటి నిజాయతీ పరుడు పోలీస్ ఉద్యోగానికి పనికిరాడని అతను భావిస్తాడు. ఆ ఊరు నుంచి వెళ్లిపోవడమే మంచిదనే నిర్ణయానికి వస్తాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతను ఆ గిరిజన గూడెంలోని ఒక యువతి ప్రేమలో పడతాడు. ఆ తరువాత ఏం జరుగుతుంది? తన ప్రేమను గెలిపించుకోవడం కోసం అతను ఏం చేస్తాడు? అనేదే కథ.

కథలో నాయకుడు వీరుడు .. శూరుడు కానవసరం లేదు. పిరికివాడు .. భయస్తుడు అయిన ఒక సాధారణమైన యువకుడిని కూడా హీరోగా చూపించవచ్చు .. ప్రేక్షకులను కదలకుండా సీట్లలో కూర్చొబెట్టొచ్చు అని నిరూపించిన కథనే 'విడుదల'. మంచితనం .. మానవత్వం .. నిజాయతీ అనేవి వ్యక్తిలోని బలహీనతలుగా చూడబడుతుండటం సహజం. అలాంటి ఒక భయస్తుడు .. బలహీనుడు తాను ప్రేమించిన యువతి కోసం ఎంతటి బలవంతుడితో తలపడ్డాడు అనే ఈ కథను దర్శకుడు వెట్రిమారన్ గొప్పగా ఆవిష్కరించాడు. 

ఒక వైపున పోలీస్ వారు .. మరో వైపున ప్రజాదళం సభ్యులు .. ఈ ఇద్దరి మధ్య నలిగిపోయే గిరిజనుల చుట్టూ ఈ కథ నడుస్తుంది. ప్రధానమైన పాత్రలను దర్శకుడు గొప్పగా చిత్రీకరించాడు. సూరి .. విజయ్ సేతుపతి .. గౌతమ్ వాసుదేవ మీనన్ .. చేతన్ .. భవానిశ్రీ పాత్రలు ఈ కథకు పిల్లర్స్ మాదిరిగా కనిపిస్తాయి. ఎవరి పాత్రలో వారు జీవించారు. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకి అదనపు బలాన్ని ఇచ్చింది. 'పిల్లా నువ్వు నడిస్తే .. 'అనే పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటి. ఇంతగా మనసుకి కనెక్ట్ అయ్యే ట్యూన్ ఈ మధ్య కాలంలో రాలేదు. 

ఇక వేల్ రాజ్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రాణంగా చెప్పుకోవచ్చు. దట్టమైన అడవి నేపథ్యంలో .. ఆ అడవిలో నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాలను .. వర్షం కురుస్తున్నప్పటి సన్నివేశాలను అద్భుతంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా హీరో .. హీరోయిన్ అడవిలో లాంతరు పట్టుకుని నడుస్తుంటే 'పిల్లా నువ్వు నడిస్తే' అనే పాట ప్లే అవుతుంటుంది. ఈ పాటను ఆయన గొప్పగా ఆవిష్కరించాడు. అలాగే రామర్ ఎడిటింగ్ కూడా బాగుంది.

 ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. అడవి నేపథ్యం ..  ప్రధానమైన పాత్రలను మలిచిన విధానం .. వెట్రి మారన్ టేకింగ్ .. ఇళయరాజా ట్యూన్స్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. సూరి - విజయ్ సేతుపతి - భవానిశ్రీ నటన. 

మైనస్ పాయింట్: పిరికివాడైన హీరో పోలీస్ జాబ్ ను ఎందుకు ఎంచుకున్నాడనే విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం. 

Movie Name: Vidudhala

Release Date: 2023-04-15
Cast: Soori, Bhavani Sri, Vijay Sethupathi, Gowtham Menon, Chetan
Director:Vetri Maaran
Producer: Elred Kumar
Music: Ilaya Raja
Banner: Grassroot Film Company

Rating: 3.25 out of 5

Trailer

More Reviews