ఈ మధ్య కాలంలో హారర్ కామెడీ సినిమాలే ఎక్కువగా వచ్చాయి. సీరియస్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన 'మసూద' మంచి విజయాన్ని అందుకుంది. టేకింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తరువాత అదే బాటలో సీరియస్ హారర్ థ్రిల్లర్ గా రూపొందిన సినిమాగా 'విరూపాక్ష'ను గురించి చెప్పుకోవచ్చు. సాయితేజ్ తన కెరియర్లో ఈ జోనర్లో చేయడం ఇదే మొదటిసారి. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ప్రేక్షకులను భయపెట్టిందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ 1979లో అడవికి సమీపంగా ఉండే 'రుద్రవనం' అనే గ్రామంలో మొదలవుతుంది. అక్కడ వెంకటాచలపతి (కమల్ కామరాజు) తన భార్యాబిడ్డలతో కాపురముంటాడు. అతను చేతబడి చేసి చిన్న పిల్లలను చంపేస్తున్నాడని భావించిన గ్రామస్తులు, ఆ దంపతులను సజీవదహనం చేస్తారు. వారి సంతానమైన భైరవుడిని కూడా చంపడానికి వారు ప్రయత్నించగా, ఊరి సర్పంచ్ గా ఉన్న హరిశ్చంద్ర ప్రసాద్ (రాజీవ్ కనకాల) ఆ కుర్రాడిని ఓ అనాథ శరణాలయంలో చేరుస్తాడు.
ఆ తరువాత కథ 1991లో మొదలవుతుంది. 'రుద్రవనం' ఆడపడుచు అయిన అనసూయ, అక్కడ జరిగే జాతరకు తన కొడుకు సూర్య (సాయితేజ్)తో కలిసి వస్తుంది. తన పెద్దమ్మ కూతురైన పార్వతి (శ్యామల) కుటుంబం తమపట్ల చూపుతున్న ప్రేమానురాగాలకు సూర్య పొంగిపోతాడు. తొలిచూపులోనే సర్పంచ్ కూతురైన నందిని( సంయుక్త మీనన్) పై మనసు పారేసుకుంటాడు. ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తూ ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే నందిని స్నేహితురాలైన సుధ (సోనియా సింగ్) .. వేరే ఊరు కుర్రాడైన కుమార్ ప్రేమించుకుంటారు. వాళ్ల ప్రేమను సూర్య - నందిని కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఆ ఊరు ఆ గ్రామదేవత అయిన 'మోదమాంబ' జాతర పనులు ఘనంగా మొదలవుతాయి. ఆ సందడిలోనే ఒక వ్యక్తి అమ్మవారి గుళ్లోకి వచ్చి రక్తం కక్కుకుని చనిపోతాడు. దాంతో అపవిత్రమైందని ఆలయాన్ని మూసేస్తారు. ఊరుపై క్షుద్ర ప్రయోగం జరిగిందని భావించి ఊరును అష్టదిగ్బంధనం చేస్తారు.
ఆ రోజు నుంచి ఆ గ్రామస్తులు వరుసగా మరణిస్తూ ఉంటారు. అష్టదిగ్బంధన నియమాన్ని ఎవరో ఉల్లంఘించడం వల్లనే అలా జరుగుతుందనే నిర్ధారణకు గ్రామపెద్దలు వస్తారు. జరుగుతున్న మరణాల వెనుక ఏదో మిస్టరీ ఉందని భావించిన హీరో, అదేమిటో తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో అతనికి తెలిసే రహస్యాలేమిటి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో కథ ముందుకు వెళుతుంది.
ఇది సీరియస్ గా కొనసాగే యాక్షన్ టచ్ తో కూడిన హారర్ థ్రిల్లర్. ఈ కథలో రొమాన్స్ కి పెద్దగా అవకాశం ఇవ్వలేదు .. కామెడీకి అసలు అవకాశమే లేదు. తాంత్రిక విద్యలతో భయపెడుతూ ప్రేక్షకులను రెండున్నర గంటలసేపు కూర్చోబెట్టడం అంత తేలికైన విషయమేం కాదు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ చాలా వరకూ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అందుకు కారణం తాను రాసుకున్న కథ .. సుకుమార్ వేసిన స్క్రీన్ ప్లే అని చెప్పచ్చు.
ప్రమాదం తరువాత సాయితేజ్ చేసిన సినిమా ఇది. ఈ జోనర్లో ఆయనకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ బాగా చేశాడు. యాక్షన్ .. ఎమోషన్స్ నేపథ్యంలోని సీన్స్ ను పండించాడు. ఇక గ్రామీణ యువతిగా .. దెయ్యం ఆవహించిన యువతిగా సంయుక్త మీనన్ తన పాత్రకి న్యాయం చేసింది. ఆ తరువాత స్థానాల్లో సాయిచంద్ .. సునీల్ .. అజయ్ కూడా తమ మార్క్ చూపించారు. రాజీవ్ కనకాల .. శ్యామల .. సోనియా సింగ్ యాక్టింగ్ ఓకే.
తెరపై కథ మొదలైన తరువాత దర్శకుడు ఎక్కడ కూడా సమయాన్ని వృథా చేయలేదు. ఎక్కడికక్కడ ఏం జరగనుందో అనే ఉత్కంఠను రేకెత్తిస్తూ చివరివరకూ కథలో పట్టు సడలకుండా తీసుకుని వెళ్లాడు.సెకండాఫ్ లోని ట్విస్టులు కథకి మరింత బలాన్ని చేకూర్చుతూ కథనంలో వేగాన్ని పెంచుతాయి. అష్టదిగ్బంధనం చేయబడిన ఊరును సుధ దాటేసి వెళ్లడానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ .. నందినితో ముడిపడిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఫస్టాఫ్ కి హైలైట్ గా నిలుస్తాయి.
ఇక నందినిని రక్షించుకోవడానికి హీరో చేసే ప్రయత్నాలు .. ప్రీ క్లైమాక్స్ దృశ్యాలు సెకండాఫ్ కి హైలైట్ అనిపిస్తాయి. అయితే ఒక రేంజ్ కి వెళ్లిన క్లైమాక్స్,దర్శకుడు తీసుకున్న నిర్ణయం కారణంగా ఒక్కసారిగా డ్రాప్ అయినట్టుగా కనిపిస్తుంది. పీక్ లో వెళుతున్న క్లైమాక్స్ గ్రాఫ్ హఠాత్తుగా పడిపోయిందా అనిపిస్తుంది. కథా పరంగా .. పాత్రలను తీర్చిదిద్దిన విషయంలోను .. టేకింగ్ విషయంలోను డైరెక్టర్ కి మంచి మార్కులు ఇవ్వొచ్చు.
అజనీశ్ లోక్ నాథ్ అందించిన సంగీతం పరంగా చూసుకుంటే 'నచ్చావులే నచ్చావులే' పాట ఆకట్టుకుంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెప్పచ్చు. శ్యామ్ దత్ కెమెరా పనితనం గొప్పగా ఉంది. అడవి నేపథ్యంలో .. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సన్నివేశాలను ఆయన చిత్రీకరించిన తీరు ప్రేక్షకులను అలా కూర్చోబెట్టేస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ కి వంక బెట్టవలసిన పనిలేదు. ఇక 'రుద్రవనం' సెట్ కూడా ఆర్ట్ డైరెక్టర్ ప్రతిభకు అద్దం పడుతుంది.
ప్లస్ పాయింట్స్: కథ .. స్క్రీన్ ప్లే .. పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ.
మైనస్ పాయింట్స్: కథ 'రుద్రవనం'లో జరుగుతుంది .. సినిమా పేరు 'విరూపాక్ష'. కానీ ఈ కథలో ఎక్కడా శివుడి ప్రస్తావన లేకపోవడం. క్లైమాక్స్ సీన్ ఒక రేంజ్ కి వెళుతుండగా దర్శకుడు తీసుకున్న నిర్ణయం.
'విరూపాక్ష' - మూవీ రివ్యూ
Virupaksha Review
- సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
- కథ .. సుకుమార్ స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్
- సాయితేజ్ మరో హిట్ కొట్టినట్టే
Movie Name: Virupaksha
Release Date: 2023-04-21
Cast: Saitej, Smyuktha Menon, Sai Chand, Sunil, Sonia Singh, Rajeev Kanakala
Director:Kartheek Varma Dandu
Producer: BVSN Prasad
Music: Ajaneesh Loknath
Banner: Sri Venkateshwara Cine Chitra
Review By: Peddinti
Rating: 3.25 out of 5
Trailer