తెలుగు తెరకి ప్రేమకథలు .. ప్రేమజంటలు కొత్త కాదు. ప్రేమకథల్లో ప్రేమనే జయించాలి .. ప్రేమికులనే విజేతలుగా నిలబెట్టాలి. మాటల్లోను .. పాటల్లోను మంచి ఫీల్ ఉండాలి. తెరపై కనిపించే హీరో - హీరోయిన్ పాత్రల్లో యూత్ తమని ఊహించుకోవాలి. తెరపై వారికి ఎదురయ్యే పరిస్థితులను తాము కూడా అలాగే డీల్ చేసి ఉండేవాళ్లమని అనిపించాలి. అంత సహజంగా అల్లుకున్న ప్రేమకథలకే ప్రేక్షకులు నీరాజనాలు పడుతుంటారు. అలాంటి ప్రేమకథగా వచ్చిన 'బేబి' ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
వైష్ణవి (వైష్ణవి చైతన్య) .. ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) ఒకే బస్తీలో ఉంటూ ఉంటారు. ఒకే స్కూల్లో .. 10th క్లాస్ చదువుతూ ఉంటారు. ఆనంద్ తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోతాడు. మాట - వినికిడి శక్తిలేని తల్లి అతని బాగోగులు చూస్తూ ఉంటుంది. ఇక వైష్ణవి ఫ్యామిలీ కూడా ఆర్ధికంగా బాగా వెనుకబడే ఉంటుంది. అలాంటి ఈ ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది. ఆనంద్ 10 th క్లాస్ ఫెయిలై, ఆటో నడుపుకోవడం మొదలెడతాడు. అతని ప్రేమలో ఉంటూనే వైష్ణవి ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్లి వస్తుంటుంది.
స్కూల్ లో ఉన్నప్పుడు అందంగా లేదని చెప్పి వైష్ణవిని అందరూ హేళన చేసేవారు. అలాగే బస్తీ జీవితంలో ఉన్న ఆమెకి, కలర్ ఫుల్ లైఫ్ విషయంలో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇంజనీరింగ్ కాలేజ్ లోని వైష్ణవి ఫ్రెండ్స్ ఆమె లుక్ ను స్టైలీష్ గా మారుస్తారు. ట్రెండ్ కి తగిన బట్టలు కొనిపెడతారు. ఇక ఆనంద్ అప్పుచేసి మరీ ఆమెకి ఒక స్మార్ట్ ఫోన్ కొనిపెడతాడు. ప్రతిరోజు ఆమెను కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాడు. కాలేజ్ లో వైష్ణవికి విరాజ్ (విరాజ్)తో పరిచయమవుతుంది. అతని పొగడ్తలకు ఆమె ఫిదా అవుతుంది.
తాను బస్తీ అమ్మాయిననే విషయాన్నీ .. తన ఫ్యామిలీ నేపథ్యాన్ని .. తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ గురించి ఎవరికీ చెప్పకుండా వైష్ణవి దాచిపెడుతుంది. ముఖ్యంగా శ్రీమంతుడైన విరాజ్ కి ఈ సంగతి తెలియకుండా ఆమె మరింత జాగ్రత్త పడుతుంది. తనచుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వలన ఆమె ప్రభావితమవుతుంది. వాళ్లతో కలిసి పబ్ లకు వెళుతూ ఉంటుంది .. పార్టీలకు వెళుతూ మందుకొడుతూ ఉంటుంది. మత్తులో .. తప్పు దారిలో కొంతదూరం నడిచిన వైష్ణవికి, తాను విరాజ్ తో అంత సాన్నిహిత్యంతో ఉండటం కరెక్టు కాదని గ్రహిస్తుంది. విరాజ్ ను దూరం పెట్టాలని నిర్ణయించుకుంటుంది.
వైష్ణవి ప్రవర్తన అలా హఠాత్తుగా మారిపోవడంతో, తాను తాగుడికి బానిసైనట్టుగా విరాజ్ నటిస్తాడు. తనని మరిచిపొమ్మని అతనిని వైష్ణవి కోరుతుంది. తనతో ఒక నెలరోజుల పాటు డేటింగ్ చేయమనీ, ఆ తరువాత తమ పరిచయాన్ని మరిచిపోయి మామూలు మనిషిని అవుతానని విరాజ్ అంటాడు. అందుకు వైష్ణవి అంగీకరిస్తుంది. అప్పుడు విరాజ్ ఏం చేస్తాడు? వైష్ణవికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? చివరికి ఆనంద్ కి మిగిలేదేంటి? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
సాధారణంగా ప్రతి ప్రేమకథలో కనిపించే అంశాలు రెండే రెండు . ఒకటి ప్రేమ సఫలం కావడం .. రెండు విఫలం కావడం. ప్రేమికులలో ఎవరో ఒకరు మరొకరిని మోసం చేయడం జరుగుతూనే ఉంటుంది. లైఫ్ లో అప్పటివరకూ సాయపడుతూ వచ్చినవారిని అవకాశం దొరగ్గానే మధ్యలోనే వదిలేసి, అక్కడి నుంచి మరొకరి చేయిని పట్టుకుని ముందుకు వెళ్లడం కూడా కనిపిస్తూనే ఉంటుంది. కానీ ఒక వైపున ప్రేమిస్తూనే .. మరో వైపున మోసం చేయడమనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు సాయి రాజేశ్ నీలం అల్లుకున్న కథనే ఈ సినిమా.
ఈ కథ అంతా కూడా ఆనంద్ దేవరకొండ .. వైష్ణవీ చైతన్య .. విరాజ్ పాత్రలను ప్రధానంగా చేసుకుని నడూస్తూ ఉంటుంది. ఆనంద్ దేవరకొండ .. విరాజ్ పాత్రల విషయంలో దర్శకుడికి ఒక క్లారిటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వైష్ణవి చైతన్య పాత్ర విషయానికి వచ్చేసరికి, ఆ పాత్ర స్వరూప స్వభాలను ఆవిష్కరించడంలో కన్ఫ్యూజ్ కావడం కనిపిస్తుంది. ఒకరితో ప్రేమను నిలబెట్టుకోవడం కోసం .. మరొకరితో నాయిక హద్దులు దాటడం చూస్తే, ఆ పాత్ర మానసిక స్థితిపై అనుమానం కలుగుతుంది.
ఆల్రెడీ ఒకరితో లవ్ లో ఉన్న హీరోయిన్ ను .. మరో లవర్ డేటింగ్ కి రమ్మంటాడు. 'డేటింగ్ అంటే ప్రేమించుకోవడం కాదు గదా .. నీతో డేటింగ్ కి వస్తే ఎవరినీ మోసం చేసినట్టు కాదు గదా .. అయితే వస్తాను' అని హీరోయిన్ అమాయకంగా అనేస్తుంది. అదే అమాయకత్వంతో సిగరెట్ తాగుతుంది .. మందుకొడుతుంది .. పబ్ లో డాన్సులు చేస్తూ హద్దులు చెరిపేస్తుంది. అసలు హీరో పట్ల ప్రేమతోనే .. కొసరు హీరోతో ఇలా హద్దులు దాటడమంటూ సమర్ధించుకుంటూ ఉంటుంది.
నాయిక పాత్రలోని చిత్రమైన విన్యాసాలను చూసిన ప్రేక్షకులు, ఈ పాత్ర ద్వారా దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? అని ప్రేక్షకులు అడక్కుండా, 'నా కథలోని నీతి ఏంటి?' అని నాయిక పాత్ర మరో పాత్రను అడుగుతుంది. ప్రేమ - స్వార్థం అనే రెండూ కూడా వ్యతిరేక శక్తులు. వాటిని ఒక పాత్ర ద్వారా ఆవిష్కరించడం వలన ఆడియన్స్ ను దర్శకుడు అయోమయంలో పడేశాడు. చివరివరకూ ఈ అయోమయంలో నుంచి ప్రేక్షకులను ఆయన బయటికి రానీయలేదు.
ఇక ప్రేమ పేరుతో హీరోయిన్ వరుసగా మోసం చేస్తూ వెళుతూ ఉంటే, ఆటోలో కూర్చుని ఆమెపై ఆనంద్ దేవరకొండ కవితలు చెప్పడమనేది ఈ సినిమాలో కామెడీలేని లోటును తీర్చింది. ఇక విరాజ్ పాత్ర విషయానికొస్తే, ఆయనకి ఎలాంటి నష్టం కలగకపోయినా కత్తి పుచ్చుకుని హీరోయిన్ మీదకి ఎందుకు వచ్చాడనేది అర్థమైతే ఒట్టు. వైష్ణవి చైతన్యలో ఆమె కళ్లు ప్రధానమైన ఆకర్షణ. నటన ఆమెకి కొట్టినపిండి .. గొప్పగా చేసింది. కానీ ఆమె పాత్రలోనే క్లారిటీ లేదు .. తప్పు ఆమెది కాదు.
ఇక నాగబాబు ఎందుకు ఈ పాత్ర అంగీకరించాడనేది మనకి అర్థంకాని విషయాల్లో ఒకటి. విలన్ లేకుండా దర్శకుడు నడిపించిన ప్రేమకథ ఇది. పాత్రలకి పేర్లు పెట్టె రిస్క్ కూడా ఆయన తీసుకోలేదు .. ఎవరి పేరు వాళ్లకి ఉంచేశాడు. విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ ఫరవాలేదు. ఈ సినిమాలో హీరో ప్రేమ విషయంలో దెబ్బతింటాడు. అతని తల్లి చనిపోయినప్పుడు శవం తల దగ్గర ఫొటో పెట్టడానికి వెదికితే ఒక్క ఫోటో కూడా కనిపించదు. "ఆ అమ్మాయి తిని పారేసిన చాక్లెట్ కాగితాలు భద్రంగా దాచుకున్నాను .. కానీ అమ్మ ఫొటో మాత్రం దాచుకోలేకపోయాను .. ఏది నిజమైన ప్రేమ .. ఎవరిది నిజమైన ప్రేమ?" అనే డైలాగ్ సినిమా మొత్తానికి హైలైట్.
ప్లస్ పాయింట్స్: వైష్ణవీ చైతన్య నటన .. విజయ్ బుల్గానిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్స్: హీరోయిన్ పాత్రలో లోపించిన క్లారిటీ .. హీరో పాత్రను ఆటోకే పరిమితం చేసిన డైరెక్టర్ .. అవసరానికి మించి సాగినట్టుగా అనిపించే డైలాగ్స్ .. సన్నివేశాల సాగతీత కారణంగా నిడివి పెరగడం. ప్రేమకథకు అవసరమైనంత ఫీల్ లేకపోవడం.
'బేబి' - మూవీ రివ్యూ
Baby Review
- వైష్ణవి చైతన్య నుంచి వచ్చిన 'బేబి'
- ప్రేమకథ జోనర్లో వచ్చిన సినిమా
- ఫరవాలేదనిపించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ
- అయోమయాన్ని కలిగించే హీరోయిన్ పాత్ర
- సాగతీత సన్నివేశాలతో పెరిగిన నిడివి
Movie Name: Baby
Release Date: 2023-07-14
Cast: Aanand Devarakonda, Vaishnavi Chaitanya, Virash Ashwinm Nagendra Babu
Director:Sai Rajesh Neelam
Producer: SKN
Music: Vijay Bulganin
Banner: Moss Movie Makers
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer