సుహాస్ హీరోగా ఇప్పటికి రెండు హిట్లు కొట్టాడు. ఆయన నటనపై .. ఆయన ఎంచుకునే కథలపై .. పాత్రలపై ఆడియన్స్ కి నమ్మకం కుదిరింది. దాంతో సహజంగానే ఆయన సినిమాలపై అంచనాలు ఏర్పడుతున్నాయి. అలాంటి అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన సినిమానే 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు'. ధీరజ్ మొగిలినేని నిర్మాతగా ... దుష్యంత్ కటికినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ అంబాజీపేటలో 2007లో నడుస్తూ ఉంటుంది. ఆ ఊళ్లో మల్లిగాడు (సుహాస్) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. తండ్రి .. తల్లి .. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) ఇదీ అతని కుటుంబం. తండ్రి ఆ ఊళ్లో సెలూన్ షాపు చూసుకుంటూ ఉంటే, అక్క గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఇక మల్లిగాడు తన స్నేహితులతో కలిసి బ్యాండుమేళం నడుపుతూ ఉంటాడు. మల్లిగాడు స్నేహితుడైన సంజీవి (జగదీశ్) పద్మను ఇష్టపడుతూ ఉంటాడు.
ఆ ఊళ్లో బాగా డబ్బున్నవాడు వెంకట్ బాబు (నితిన్ ప్రసన్న). ఊళ్లోవాళ్లకి వడ్డీకి డబ్బులిస్తూ .. వాళ్ల ఆస్తులు వాల్చుకుంటూ ఉంటాడు. అతని అప్పుతీర్చవలసి ఉన్నందువలన, ఆయన మాటకి అడ్డుచెప్పే ధైర్యం ఎవరూ చేయరు. దాంతో ఊరుపై తన పెత్తనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. తనకి సంబంధించిన సిమెంటు బస్తాలను అతను స్కూల్ ఆవరణలో వేయించడం .. అవి తీసేయమని పద్మ గొడవపడటంతో అతని అహం దెబ్బతింటుంది.
ఇదే సమయంలో వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మి (శివాని నాగరం) .. మల్లిగాడు ప్రేమలో పడతారు. అన్నయ్య పట్ల లక్ష్మికి భయం ఉన్నప్పటికీ, మల్లిగాడిపై ఉన్న ప్రేమ దానిని డామినేట్ చేస్తుంది. తరచూ ఇద్దరూ కలుసుకుంటూ ఉంటారు. ఇక స్కూల్ ఆవరణలో వేసిన సిమెంటు బస్తాల విషయంలో వెంకట్ బాబుకి .. పద్మకి మధ్య గొడవ మరింత ముదురుతుంది. వెంకట్ బాబు తమ్ముడు శ్రీనుపై ఆమె చేయి చేసుకోవడంతో కోపంతో అతను ఊగిపోతాడు.
అదే సమయంలో తన చెల్లెలు లక్ష్మి .. మల్లిగాడు ప్రేమించుకుంటున్నారేమో అనే అనుమానం వెంకట్ బాబుకి వస్తుంది. ఆ విషయంలో ఎంతవరకూ నిజం ఉందనేది పరిశీలిస్తాడు. తన అనుమానం నిజమేనని నిర్ధారించుకుంటాడు. తన చెల్లెలిని ప్రేమిస్తున్న కారణానికి మల్లిగాడిపై, తన పెత్తనాన్ని ప్రశ్నించిన పద్మకి తగిన బుద్ధిచెప్పాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేదే కథ.
ఇది గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ. ఊరిమీద పెత్తనం చెలాయించాలనుకునే ఒక మోతుబరికీ .. ఆ గ్రామంలో సాధారణమైన కుటుంబానికి చెందిన అక్కాతమ్ముళ్లకు మధ్య జరిగే కథ ఇది. ఊరు పెద్ద కూతురునో .. చెల్లెలినో హీరో లవ్ చేయడం, అదే విధంగా హీరో అక్కనో .. చెల్లెలినో అవమానించడానికే విలన్ ట్రై చేయడం .. పోలీసులు అతనికే వత్తాసు పలకడం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటిదారిలోనే ... పాత పద్దతిలోనే ఈ కథ నడుస్తుంది.
అక్కాతమ్ముళ్లు విలన్ ను ఎదిరించడానికి ప్రయత్నించడం ... ఆ ఇద్దరినీ అణచివేయడానికి విలన్ ట్రై చేయడం .. పోలీస్ స్టేషన్ కి సంబంధించిన రెండు సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇది కులానికి సంబంధించిన కథ కాదు .. అలాగని చెప్పి ప్రేమకథ ప్రధానమైన అంశం కూడా కాదని చెప్పారు. కానీ 'కులం' అనే మాటను వాడకపోయినా, కథ ఆ అంశాన్నే ప్రధానం చేసుకుని తిరుగుతుంది. ఆ అంశానికి సమాంతరంగా ప్రేమకథ నడుస్తుంది.
ఈ కథ 2007లో నడుస్తున్నట్టుగా చూపించారు. అప్పట్లో పల్లెటూరి అమ్మాయిలు లవ్ లెటర్స్ .. గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం చూపించారు. కానీ అప్పటికే ఆ ట్రెండు పోయింది. హీరోను బన్నీ అభిమానిగా 'దేశముదురు' పోస్టర్ ను చూపించడం కోసం, ఈ కథను 2007 లో నడుస్తున్నట్టు చూపించడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతను బన్నీ అభిమాని అనే అంశాన్ని ఆ తరువాత ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనించవలసిన విషయం.
సాధారణంగా లవర్స్ రహస్యంగా కలుసుకుంటూ ఉంటారు. కానీ ఊరు మధ్యలో ఉన్న సెలూన్ షాపుకి హీరోయిన్ తరచూ వస్తుంటుంది. ఊళ్లో జనం చూసినా భయానికి ఆమె అన్నయ్యకి చెప్పలేదని అనుకోవచ్చు. కానీ ఆయన సన్నిహితుల కంటకూడా పడకపోవడం చిత్రంగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ ఇద్దరూ గాఢంగా లవ్ చేసుకుంటారు. కానీ విలన్ పట్ల ఉన్న భయాన్ని ఇద్దరూ దాటేసి ముందుకు రాలేకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది.
సాధారణంగా ప్రేమ అనే కథాంశాన్ని భుజానికెత్తుకున్నప్పుడు మంచి ఫీల్ ఉన్న పాటలు పడాల్సిందే. ఆ వైపు నుంచి సరైన న్యాయం జరగలేదేమోనని అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో వచ్చే ఒక పాట .. సుహాస్ వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటాయి. యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ కనెక్ట్ అవుతాయి. ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ఇటు హీరోగా సుహాస్ .. అటు విలన్ గా నితిన్ ప్రసన్న పోటీపడ్డారు. శరణ్య ప్రదీప్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.
వాజిద్ బేగ్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. అందమైన లొకేషన్స్ ను ఆయన తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. కోదాటి పవన్ కల్యాణ్ ఎడిటింగ్ బాగున్నాయి. వాస్తవ సంఘటనలో నుంచి ఈ కథను తీసుకున్నా, కొంత ఫీల్ ను .. కొన్ని ట్విస్టులను ఆడియన్స్ కోరుకుంటారు. వాటిని పట్టుకుని .. లాజిక్కులకు కాస్త దగ్గరగా వెళితే ఈ కథ ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యుండేదేమో అనిపిస్తుంది.
'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' - మూవీ రివ్యూ
Ambajipeta Marriage Band Review
- గ్రామీణ నేపథ్యంలో నడిచే కథ
- పరోక్షంగా కులం చుట్టూ జరిగే సంఘటనలు
- అక్కాతమ్ముళ్లకు - విలన్ కు మధ్య జరిగే పోరాటం
- సుహాస్ - నితిన్ ప్రసన్న నటన హైలైట్
- ఆకట్టుకునే ఫొటోగ్రఫీ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్
Movie Name: Ambajipeta Marriage Band
Release Date: 2024-02-02
Cast: Suhas, Shivani Naagaram, Nithin Prasanna, Sharanya Pradeep, Jagadeesh
Director:Dushyanth Katikineni
Producer: Dheeraj Mogilineni
Music: Sekhar Chandra
Banner: GA2 Pictures
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer