'టిల్లు స్క్వైర్' మూవీ రివ్యూ!

Tillu Sequre

Tillu Sequre Review

  • సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా వచ్చిన 'టిల్లు స్క్వైర్'
  • సరదాగా సాగే కామెడీ కంటెంట్
  • సిద్ధూ జోడీగా అంతగా నప్పని అనుపమ  
  • సంభాషణలు ప్రధానమైన ఆకర్షణ 
  • 'డీజే టిల్లు' చూసినవారిని నిరాశపరచని సినిమా 

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా విమల్ కృష్ణ దర్శకత్వంలో ఫిబ్రవరి 12 .. 2022లో 'డీజే టిల్లు' సినిమా థియేటర్లకు వచ్చింది. సితార - ఫార్చ్యూన్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇటు యూత్ ను .. అటు మాస్ ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షాన్ని కురిపించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా 'టిల్లు స్క్వైర్' ను రూపొందించారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ స్థాయిలో మెప్పించిందనేది ఇప్పుడు చూద్దాం.

 టిల్లు (సిద్ధూ జొన్నలగడ్డ) రాధిక చేసిన మోసం నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లోనే అతనికి ఒక ఫంక్షన్ లో లిల్లీ (అనుపమ) పరిచయమవుతుంది. తొలిచూపులోనే టిల్లు మనసు పారేసుకుంటాడు. ఆ రాత్రి ఇద్దరూ కూడా ఆ ఫంక్షన్ లోనే ఒకటవుతారు. మరునాడు ఉదయం నిద్రలేవగానే, తనకి రిలేషన్స్ పై పెద్దగా నమ్మకం లేదని లిల్లీ రాసిపెట్టిన ఉత్తరం చదివి టిల్లు నీరుగారిపోతాడు. అప్పటి నుంచి మళ్లీ ఎక్కడైనా కలుస్తుందేమోనని ఆమె కోసం వెదుకుతూ ఉంటాడు. 

ఒకరోజు తన తండ్రి కోసం హాస్పిటల్ కి వెళ్లిన టిల్లుకి అక్కడ లిల్లీ కలుస్తుంది. తాను గర్భవతిననీ, అందుకు కారకుడు టిల్లుయేనని అతని పేరెంట్స్ తో చెబుతుంది. తల్లిదండ్రుల మాటలు కాదనలేక ఆమెతో పెళ్లికి టిల్లు ఒప్పుకుంటాడు. ఆమెతో అతను కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఉండగానే మళ్లీ టిల్లు బర్త్ డే వస్తుంది. క్రితం పుట్టినరోజునాడే రాధిక కారణంగా తాను పడిన ఇబ్బందులను తలచుకుంటాడు. ఈ సారి ఏమౌతుందోనని టెన్షన్ పడుతూ ఉంటాడు. 

అదే సమయంలో లిల్లీ నుంచి టిల్లుకి కాల్ రావడంతో, ఆమె రమ్మన్న చోటుకి వెళతాడు. అది గతంలో రాధిక ఉన్న ఇల్లు .. ఆమె రోహిత్ ను హత్య చేసిన ఇల్లు. కంగారుపడుతూనే టిల్లు లోపలికి అడుగుపెడతాడు. క్రితం ఏడాది ఇదే రోజున తన అన్నయ్య కనిపించకుండాపోయాడని టిల్లుతో చెబుతూ లిల్లీ బాధపడుతుంది. తన అన్నయ్యను హత్య చేసి ఉంటారనే అనుమానం ఉందని చెబుతూ అతని ఫొటోను టిల్లుకి చూపిస్తుంది. రాధిక చేతిలో చనిపోయిన రోహిత్ ఫొటో అది. రాధికకి సాయం చేయడం కోసం తాను పాతిపెట్టింది రోహిత్ నే అనే విషయం టిల్లుకి అర్థమవుతుంది. 

తాను చేసిన నేరం ఎక్కడ బయటపడుతుందోనని టిల్లు బిక్కుబిక్కుమంటూ ఉంటే, అతను ఓ వ్యక్తిని హత్య చేయవలసి ఉంటుందని లిల్లీ కూల్ గా చెబుతుంది. ఆ వ్యక్తి అంతర్జాతీయ నేరస్థుడైన షేక్ మెహబూబా అని అంటుంది. ఆ మాట వినగానే టిల్లు ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు. రోహిత్ హత్య కేసు విషయంలో టిల్లు దొరికిపోతాడా? ఒక అంతర్జాతీయ నేరస్థుడితో లిల్లీకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు లిల్లీ నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ. 

'డీజే టిల్లు' సినిమాకి దర్శకుడు విమల్ కృష్ణ .. ఈ రోజున థియేటర్లకు వచ్చిన సీక్వెల్ కి దర్శకత్వం వహించింది మల్లిక్ రామ్. అందువలన ఫస్టు పార్టు బావుందా? సెకండ్ పార్టు బావుందా? ఫస్టు పార్టుకంటే ఈ సినిమా ఎక్కువనా? తక్కువనా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఫస్టు పార్టు - సెకండు పార్టు రెండూ సమానంగానే అనిపిస్తాయి. ఒకే డైరెక్టర్ రెండు సినిమాలను తీసినట్టుగా అనిపిస్తుంది. ఎంటర్టైన్ మెంట్ పరంగా 'టిల్లు స్క్వైర్' ఎంతమాత్రం తగ్గలేదనిపిస్తుంది. 

దర్శకుడు స్టార్టింగ్ టైటిల్స్ పూర్తయ్యేలోగా 'కీ' డైలాగ్స్ తో ఫస్టు పార్టును గుర్తుచేయడం బాగుంది. అక్కడి నుంచి సెకండాఫ్ మొదలవుతుంది. ఈ కథలో ఫస్టుపార్టులోని నాయిక నేహాశెట్టి అతిథి పాత్రలో కనిపించడం ప్రధానమైన ఆకర్షణగా కనిపిస్తుంది. జనంలో బాగా పాప్యులర్ అయిన 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్ తో అసలు కథను మొదలుపెట్టడం బాగుంది. ఇక అనుపమ యాక్టింగ్ కి వంక బెట్టనవసరం లేదు. కానీ సిద్ధూ జోడీగా నేహాశెట్టి మాదిరిగా మ్యాచ్ కాలేదనిపిస్తుంది. అందుకు హైటూ కారణం కావొచ్చు .. గ్లామర్ కారణం కావొచ్చు. 
 
ఈ కథకి నిర్మాణ విలువల పరంగా వంకబెట్టనవసరం లేదనే చెప్పాలి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా బాగా చేశారు. సాయి ప్రకాశ్ ఫొటోగ్రఫీ బాగుంది. అలాగే నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. నవీన్ నూలి ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, ఎంటర్టైన్మెంట్ లోపించిన సీన్స్ పెద్దగా కనిపించవు. ఈ సినిమాకి ప్రధానమైన బలం డైలాగ్స్ అనే చెప్పాలి.

 'నాకు దేశభక్తి కాదు గదా ఆధార్ కార్డు కూడా లేదు' .. 'రా' కొట్టినంత మాత్రాన 'రా' ఆఫీసర్ కాలేవురా' ... 'కొలనోస్కోపీ' చేశాక డీవీడీ కూడా ఇస్తారట. ఆదివారం .. ఆదివారం అందరం కలిసి టీవీలో వేసుకుని చూడొచ్చు .. నా నొప్పి దాచుకోవడానికి నేను నవ్వుతున్నా .. నీ తప్పు దాచుకోవడానికి ఏడుస్తున్నావ్' .. 'రాధిక ప్రేమించి మోసం చేసింది .. నువ్వు మోసం చేయడానికి ప్రేమించావ్" అనే డైలాగ్స్ మనసుకి పట్టుకుంటాయి.

'డీజే టిల్లు' లాజిక్కులు పక్కన పడేసి కేవలం వినోదం కోసం ఆడియన్స్ ఆదరించిన కంటెంట్. 'టిల్లు స్క్వైర్'ను కూడా అలా అనుకోవలసిందే. ఈ కథలోని ట్విస్టులు కూడా అంతగా ఆశ్చర్యపోయేలా ఏమీ ఉండవు. కానీ బోర్ కొట్టకుండా సన్నివేశాలు చకచకా మారిపోతూ ఉంటాయి .. సరదాగా నవ్విస్తూ ఉంటాయి. 'డీజే టిల్లు'ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాకి వస్తారు. అలాంటివారిని నిరాశ పరచనిదిగానే ఈ సినిమా కూడా ఉంటుంది.

Movie Name: Tillu Sequre

Release Date: 2024-03-29
Cast: Siddhu Jonnalagadda, Anupama Parameshwaran, Neha Shetty, Prince, Muralisharma, Muralidhar Reddy
Director:Mallik Ram
Producer: Nagavamsi
Music: Ram Miriyala
Banner: Sithara Entertainments

Rating: 3.00 out of 5

Trailer

More Reviews