'లైన్ మ్యాన్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Line Man

Line Man Review

  • త్రిగుణ్ హీరోగా రూపొందిన ' లైన్ మ్యాన్'
  • ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • పేలవమైన సన్నివేశాలు 
  • సందేశానికి దగ్గరగా .. వినోదానికి దూరంగా కనిపించే కంటెంట్  


తెలుగులో కొన్ని సినిమాల్లో ముఖ్యమైన పాత్రలలో మెప్పించిన అదిత్ అరుణ్, కన్నడలో హీరోగా ఒక సినిమా చేశాడు. ఆ సినిమా పేరే 'లైన్ మ్యాన్'. తన పేరును త్రిగుణ్ గా మార్చుకుని ఆయన చేసిన ఈ సినిమా, మార్చి 22వ తేదీన థియేటర్లకు వచ్చింది. రఘుశాస్త్రి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
 
అది సత్తిపల్లి అనే ఒక చిన్న గ్రామం. అక్కడ 'లైన్ మెన్'గా నటరాజ్ పనిచేస్తూ ఉంటాడు. తండ్రి చనిపోవడం వలన అతను చేస్తూ వచ్చిన ఆ ఉద్యోగం నటరాజ్ కి వస్తుంది. అతను తల్లిని జాగ్రత్తగా  చూసుకుంటూ .. చాలా సిన్సియర్ గా తన జాబ్ చేస్తూ వెళుతుంటాడు. గ్రామస్థులకు తలలో నాలుకలా మసలుకుంటూ ఉంటాడు. అయితే అదే గ్రామానికి చెందిన మహాదేవ్ కి మాత్రం నటరాజ్ అంటే కాస్త కడుపుమంటగా ఉంటుంది. 

ఆ ఊళ్లో దేవుడమ్మ (జయశ్రీ)కి ఎంతో పేరు ఉంటుంది. దాదాపు వెయ్యి కాన్పులు చేసిన రికార్డు ఆమె ఖాతాలో ఉంటుంది. అందువలన అక్కడి వాళ్లంతా ఆమెను ఎంతో గౌరవిస్తూ ఉంటారు. ఆమె 100వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరపాలని అంతా నిర్ణయించుకుంటారు. లైటింగ్ తో కూడిన ఏర్పాట్లు భారీగా చేస్తారు. అయితే నటరాజ్ లైన్ ఆన్ చేయకపోవడంతో అంతా అసహనాన్ని వ్యక్తం చేస్తారు. తమ ఏర్పాట్లు వృథా అవుతాయంటూ మండిపడతారు.

తాను లైన్ ఆన్ చేయలేనని అతను తేల్చి చెబుతాడు. తాను పవన్ ఆన్ చేసే ప్రదేశంలో ఒక పక్షి నాలుగు గ్రుడ్లు పెట్టిందనీ, లైన్ ఆన్ చేస్తే ఆ గ్రుడ్లలోని పిల్లలు చనిపోతాయని చెబుతాడు. అందువలన ఆ గ్రుడ్లు పొదిగి .. పిల్లలు బయటికి వచ్చేవరకూ లైన్ ఆన్ చేయడం కుదరదని అంటాడు. దాంతో గ్రామస్థులంతా ఆలోచనలో పడతారు. టీవీలకీ .. స్మార్ట్ ఫోన్లకి బాగా అలవాటు పడిపోయిన కొంతమంది అతని ధోరణి పట్ల అసహనాన్ని వ్యక్తం చేస్తారు. 

అయితే నటరాజ్ మనసును దేవుడమ్మ అర్థం చేసుకుంటుంది. ఈ భూమి మీద జీవించే హక్కు ప్రతి జీవికీ ఉందనీ, అందువలన ఆ గ్రుడ్లు పిల్లలు అయ్యేవరకూ తామంతా చీకట్లో గడపవలసిందేనని దేవుడమ్మ చెబుతుంది. దేవుడమ్మ మాటకి ఎదురుచెప్పలేక అంతా కూడా  మౌనంగా ఉంటారు. అప్పటి నుంచి ఆ ఊరంతా రాత్రి వేళలో లాంతర్ల వెలుగులోనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది. 

కరెంట్ లేకపోవడంతో ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవడానికి లేకుండా పోతుంది. టీవీలలో సీరియల్స్  చూసే అవకాశం లేకుండా పోతుంది. దాంతో అందరూ కూడా అరుగులపై చేరడం .. కష్టం నష్టం చెప్పుకోవడం మొదలెడతారు. ఇక ఇళ్లలోని భార్యాభర్తలు కూడా మనసువిప్పి మాట్లాడుకోవడం చేస్తుంటారు. నటరాజ్ చేసిన పనివల్ల ఊళ్లో వాళ్లందరిలో ఆత్మీయానురాగాలు పెరుగుతున్నాయని గ్రహిస్తారు. అతనికి మంచిపేరు రావడాన్ని కొంతమంది తట్టుకోలేకపోతారు. వాళ్లు ఏం చేస్తారు? పర్యవసానంగా ఏం జరుగుతుంది? అనేది మిగతా కథ. 

 ఆధునిక కాలంలో చాలామంది ఫోన్ స్క్రీన్ వైపు తప్ప ఎటువైపూ చూడటం లేదు. టీవీలు మనషుల మధ్య .. మాటల మధ్య గ్యాప్ తీసుకుని వస్తే, ఫోన్లు మానవ సంబంధాలనే తెంపేస్తూ వెళుతున్నాయి. ఇవన్నీ పవర్ మూలంగానే పనిచేస్తాయి. ఆ పవర్ అనేది లేకపోతే, పల్లెటూర్లు మళ్లీ ప్రేమానురాగాలతో .. పలకరింపులతో పరిమళిస్తాయి అనే విషయాన్ని నాలుగు పక్షి గ్రుడ్లను అడ్డుపెట్టుకుని దర్శకుడు తయారు చేసుకున్న పాయింట్ బాగుంది. 

మనిషి తన ఆనందం గురించి .. తన మనుగడను గురించి తప్ప మరి ఏ జీవిని గురించి కూడా ఆలోచన చేయడం లేదు. బ్రతుకు .. బ్రతకనివ్వు అనే మాటను గుర్తుచేస్తూ, పక్షి గ్రుడ్ల చుట్టూ ఈ కథను నడిపించారు. ఈ కథలో గ్రామీణ జీవితం .. అక్కడి పరిస్థితులను ఆవిష్కరిస్తూ ముందుకువెళ్లారు. ఎంచుకున్న పాయింట్ బాగుంది .. ఈ కథ ద్వారా ఇచ్చిన సందేశమూ బాగుంది. కానీ ఈ అంశం చుట్టూ అల్లుకున్న వినోదం పేలవంగా సాగడం వలన నిరాశపరుస్తుంది.

గ్రామీణ నేపథ్యంలోని కుటుంబాలు .. వ్యక్తులు .. వారి బలహీనతల చుట్టూ ఈ కథను ఆసక్తికరంగా .. హాస్య భరితంగా నడిపించవచ్చు. దర్శకుడు ఆ దిశగా ఒక ప్రయత్నమైతే చేశాడుగానీ, అది ఫలించలేదు. ప్రధానమైన కథను చెప్పడానికి అల్లుకున్న సన్నివేశాలు బలహీనంగా అనిపిస్తూ, సహనాన్ని పరీక్షిస్తాయి. హీరో వైపు నుంచి లవ్ .. రొమాన్స్ కి మంచి అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ వైపు వెళ్లనేలేదు. అందువలన సన్నివేశాలన్నీ సో సో గా సాగిపోతూ ఉంటాయి.

ఇక ఇలా సహజత్వానికి సంబంధించిన ఒక కంటెంట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చేటప్పుడు, సహజత్వానికి దగ్గరగా ఆ కంటెంట్ ను తీసుకుని వెళ్లే ఆర్టిస్టులు కావాలి. కానీ ఇక్కడి ఆర్టిస్టుల నుంచి దర్శకుడు సరైన అవుట్ పుట్ ను తీసుకోలేదు. చాలామందికి యాక్టింగ్ రాలేదు .. సరైన రియాక్షన్స్ పడలేదు. సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే. ఆలోచన మంచిదే అయినా ఆచరణ విషయంలోను .. వినోదం పరంగాను నిరాశపరిచే సినిమా ఇది. 


Movie Name: Line Man

Release Date: 2024-05-04
Cast: Trigun, Kaajal Kunder, Jayasree, Harini Srikanth, Anjali
Director:Raghu Shastry
Producer: Yateesh- Ganesh
Music: Manikantha Kadri
Banner: Purple Rock Entertainments

Rating: 2.00 out of 5

Trailer

More Reviews