మలయాళంలో టోవినో థామస్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా రూపొందిన 'కల్కి' సినిమా, చాలా కాలం క్రితమే అక్కడి థియేటర్ లకు వచ్చింది. యాక్షన్ క్రైమ్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజు నుంచే తెలుగు వెర్షన్ లో 'ఈటీవీ విన్' లో అందుబాటులోకి వచ్చింది. ప్రవీణ్ ప్రభారామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
ఈ కథ అంతా నంజన్ కోట (నంజన్ కోట్టై)లో జరుగుతూ ఉంటుంది. ఇది ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం. నంజన్ కోటపై అమర్నాథ్ ( శివజిత్) పెత్తనం చేస్తూ ఉంటాడు. కేంద్రమంత్రి విజయానంద్ కూడా చేతిలో ఉండటంతో, అమర్నాథ్ అరాచకాలకు అదుపు లేకుండా పోతుంది. లోకల్ గా తనకి కావలసిన దుర్మార్గాలు చేయడానికి అతని దగ్గర ఉమర్ (హరీశ్ ఉత్తమన్) పనిచేస్తూ ఉంటాడు.
ఇక అమర్నాథ్ తన తమ్ముడైన అప్పు (విని విశ్వ లాల్)ను మంత్రిని చేయాలనే ఆలోచనలో ఉంటాడు. విజయానంద్ కూతురైన సంగీత (సంయుక్త మీనన్)కి తాను మంత్రిని కావాలనే ఒక కోరిక ఉంటుంది. ఇక తమిళ ప్రాంతం నుంచి వచ్చిన వలసదారులకు నంజన్ కోటలో స్థానం లేదని ఊరు అవతలకి అమర్నాథ్ తరిమేస్తాడు. అక్కడి మురికివాడలోనే వాళ్లంతా గుడిసెలు వేసుకుని జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు.
తమిళ వలసదారులు 'నంజన్ కోట'లో సౌంకర్యవంతంగా జీవించే హక్కు ఉందంటూ వాళ్ల తరఫున సూరజ్ (సైజూ కురుప్) పోరాటం చేస్తూ ఉంటాడు. ఇదే విషయంపై పోరాడిన అడ్వకేట్ లక్ష్మణ్ .. ఎస్ ఐ వైశాఖ్ చనిపోవడానికి అమర్నాథ్ కారకుడవుతాడు. ఇలా నంజన్ కోటలోని పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ గా అక్కడ కల్కి (టోవినో థామస్) ఛార్జ్ తీసుకుంటాడు. అమర్నాథ్ గ్యాంగ్ కి తన మార్క్ యాక్షన్ చూపిస్తూనే అతను డ్యూటీలో జాయిన్ అవుతాడు.
అప్పటి వరకూ పోలీస్ స్టేషన్ లో భయంతో కాలం గడపుతూ వచ్చిన గోవింద్ .. అబ్దుల్లా .. సుందరం .. కుట్టన్ .. బిజూలలో కాస్త ధైర్యం వస్తుంది. దాంతో వాళ్లు కూడా సిన్సియర్ గా డ్యూటీ చేయడం మొదలుపెడతారు. అమర్నాథ్ అక్రమ ఆయుధాల తయారీ .. వలసవాదులను తరిమేయడం .. రౌడీయిజంపై కల్కి ప్రత్యేకమైన దృష్టి పెడతాడు. అతని అనుచరులలో భయం మొదలయ్యేలా చేస్తాడు.
కల్కి కి సహకరిస్తున్న పోలీస్ లను దెబ్బతీయాలని అమర్నాథ్ భావిస్తాడు. అలా చేయడం వలన కల్కి బలహీన పడతాడని ఆలోచన చేస్తాడు. అలాగే వలదారుల తరఫున పోరాడుతున్న సూరజ్ అడ్డుతప్పించాలనే నిర్ణయానికి వస్తాడు. అందుకోసం అమర్నాథ్ ఏం చేస్తాడు? ఫలితంగా కల్కి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? కల్కి ఆ గ్రామానికి పోలీస్ ఆఫీసర్ గా రావడానికి కారణం ఏమిటి? అతని గతం ఎలాంటిది? అనేది మిగతా కథ.
ఈ కథను ప్రవీణ్ ప్రభారామ్ - సుజిన్ సుజాతన్ తయారు చేసుకున్నారు. రాజకీయం - రౌడీయిజం కలిసి సమాజానికి హాని చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ ఏం చేశాడనేది కథ. విలన్ అక్రమ కార్యకలాపాలకు ఒక్కోదానికి హీరో తెరదించుతూ వెళ్లడం ఫస్టు పార్టులో కనిపిస్తుంది. ఇక ప్రధానమైన సమస్యకి సంబంధించిన అంకం సెకండాఫ్ నుంచి మొదలవుతుంది.
ఫస్టు పార్టులో దర్శకుడు ఏ మాత్రం సాగదీయలేదు. చకచకా కథ పరుగులు తీస్తూ ఉంటుంది. అక్కడక్కడా ఎమోషన్స్ ను టచ్ చేస్తూ యాక్షన్ సన్నివేశాలతో కథ పరుగులు పెడుతూ ఉంటుంది. ఇక అసలు సమస్య మొదలయ్యేది సెకండాఫ్ లో. ఇక్కడి నుంచే కథ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లవలసి ఉంటుంది. కానీ ఇక్కడి నుంచే కథ కాస్త డీలా పడుతుంది. ఫస్టు పార్టులో కనిపించే స్పీడ్ సెకండాఫ్ లో కనిపించదు.
సెకండాఫ్ లోని సన్నివేశాలలో చాలావరకూ ఆడియన్స్ గెస్ చేసినట్టుగానే జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ గతంలో వచ్చిన సినిమాల తరహాలోనే నడుస్తూ ఉంటాయి. అందువలన ఆడియన్స్ లో కుతూహలం తగ్గుతూ ఉంటుంది. లవ్ .. కామెడీ .. రొమాన్స్ కి అవకాశం లేని కథ ఇది. అందువలన వాటిని ఆశించకూడదు. అందువలన ఎంటర్టైన్మెంట్ తగ్గిందా అంటే, తగ్గిందనే చెప్పాలి.
ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా ఆ పాత్రలకు న్యాయం చేశారు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. థీమ్ మ్యూజిక్ తో ఆయన చాలా సీన్స్ ను హైలైట్ చేశాడు. గౌతమ్ శంకర్ ఫొటోగ్రఫీ బాగుంది. రెయిన్ ఎఫెక్ట్ తో కూడిన యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించిన విధానం మెప్పిస్తుంది. రంజిత్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఫస్టాఫ్ విషయంలో ఉన్నంత పెర్ఫెక్ట్ గా సెకండాఫ్ లో ఉన్నట్టుగా అనిపించదు. సెకండాఫ్ ను రొటీన్ ట్రాక్ నుంచి తప్పించి ఉంటే, సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమోనని అనిపించకమానదు.
'కల్కి' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Kalki Review
- మలయాళంలో రూపొందిన 'కల్కి'
- కథానాయకుడిగా నటించిన టోవినో థామస్
- యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే కథ
- లవ్ .. కామెడీ .. రొమాన్స్ అంటని కంటెంట్
- పెర్ఫెక్ట్ గా అనిపించే ఫస్టాఫ్
- బలహీనపడిన సెకండాఫ్
Movie Name: Kalki
Release Date: 2024-06-07
Cast: Tovino Thomas,Shivajith Padmanabhan,Sudheesh, Samyuktha,Harish Uthaman
Director:Praveen Prabharam
Producer: Suvin K.Varkey
Music: Jakes Bejoy
Banner: Little Big Films
Review By: Peddinti