ఈ మధ్య కాలంలో ఆంథాలజీ కాన్సెప్టులకు ఆదరణ ఎక్కువగా లభిస్తోంది. అలా రూపొందిన సినిమానే 'హాట్ స్పాట్'. అలా తమిళంలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజున 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. విఘ్నేశ్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కొంతమంది దర్శకులు ఒక నిర్మాతకి తమ కథలను వినిపించడానికి వెళతారు. వాళ్లు చెప్పే కథలన్నీ రొటీన్ గా ఉండటంతో, ఆ నిర్మాత కసురుకుంటాడు. కొత్తదనం ఉన్న కథలు కావాలంటూ అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. దాంతో వాళ్లంతా కూడా అక్కడి నుంచి జారుకుంటారు. సరిగ్గా అప్పుడే మహ్మద్ షఫీ ఎంట్రీ ఇస్తాడు.
మహ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్) దర్శకుడు కావాలనే ఉత్సాహంతో కథలు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తన దగ్గరున్న కథలను ఆ నిర్మాతకు వినిపించాలని వస్తాడు. అయితే ఆ నిర్మాత పది నిమిషాలకు మించి సమయం ఇవ్వలేనని అతను చిరాకుపడతాడు. అప్పుడు షఫీ అతనిని ఒప్పించి ఓ నాలుగు కథలు చెబుతాడు. ఆ నాలుగు కథలు ఏమిటి? అవి విన్న తరువాత ఆ నిర్మాత ఎలా స్పందిస్తాడు? దర్శకుడిగా షఫీకి ఛాన్స్ ఇస్తాడా లేదా? అనేది కథ.
పెళ్లి తరువాత ఆడపిల్లలు మాత్రమే తమ ఇంటిని వదిలిపెట్టి ఎందుకు వెళ్లాలి? అనేది మొదటి కథ. ప్రేమ పెళ్లిలో ఇలా జరిగే అవకాశం కూడా ఉందా? అంటూ ఆశ్చర్యపోయే రెండో కథ. తప్పు చేసి సమర్థించుకునే లవర్ ను ప్రశ్నించే ప్రియురాలి కథనే మూడో కథ. టీవీ షోస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయనేది నాలుగో కథ. ఇలా నాలుగు కథలు వేటికి వాటిగా సబ్ హెడ్డింగ్స్ తో నడుస్తాయి.
మొదటి కథ కాస్త సరదాగా .. కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆలోచింపజేస్తుంది కూడా. ఇక రెండో కథలో ఒక ట్విస్ట్ ఉంటుంది. అయితే ఆ ట్విస్ట్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. మూడో కథ కూడా అలాంటిదే. రెండో కథకంటే మరింత ఇబ్బంది పెడుతుంది. కథలు కొత్తగా ఉండటం కోసం ప్రయత్నం చేయడం మంచిదే .. కానీ ఆ కొత్తదనం ఇలా ఇబ్బందిపెట్టేలా ఉండకూడదు.
ప్రస్తుతం చిన్నపిల్లలతో కూడిన కాన్సెప్టులతో టీవీల్లో వస్తున్న షోస్ పై నాలుగో కథ నడుస్తుంది. ఇలాంటి షోస్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయనేది ఈ కథలో చూపించారు. ఈ కథ కాస్త వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తుంది. పేరెంట్స్ ను ఆలోచింపజేస్తుంది కూడా. తమ పిల్లలు టీవీలలో కనిపించాలనీ .. సెలబ్రిటీలుగా అందరూ గుర్తించాలని అనుకునే ఒక తల్లి ఆశ, ఎలాంటి పరిస్థితులకు దారితీసిందనేది ఈ కథ.
ఇలా ఈ నాలుగు కథల్లో మొదటి .. చివరి కథలు మాత్రమే కొంతవరకూ ఆకట్టుకుంటాయి. చాలా వరకూ వినోదపరమైన అంశాలు లేకపోవడం వలన, ఒక సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, ఒక సంకలనాన్ని చదువుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ గా కథలు పూర్తవుతున్నప్పుడు చివరలో ఒక ఛమక్కు ఉండాలి. లేదంటే ఆ తరువాత ఏం జరుగుతుందనేది ఆడియన్స్ ఊహకు వదిలేయాలి. అప్పుడే ఆ ఫీల్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.
అలా చూసుకుంటే ఈ సినిమాలో ఏ ఎపిసోడ్ ముగింపు కూడా కరెక్టు ఎండింగ్ లా అనిపించదు. చివరి ఎపిసోడ్ కాస్త ఆలోచింపజేస్తుంది. అయితే ఆ తరువాత దర్శకుడికీ .. నిర్మాతకి మధ్య జరిగే సంభాషణ నాటకీయంగా అనిపించి తేలిపోతుంది. మొదటి కథలో ఆదిత్య భాస్కర్ - గౌరీ కిషన్, రెండో కథలో శాండీ - అమ్ము అభిరామి, మూడో కథలో సుభాశ్ సెల్వన్ - జనని .. నాలుగో కథలో కలైయరసన్ - సోఫియా ప్రధానమైన పాత్రలను పోషించారు.
ఆర్టిస్టులంతా ఎవరి పాత్రలలో వారు బాగానే చేశారు. అయితే ఆ పాత్రలను సరిగ్గా డిజైన్ చేయకపోవడం వలన, అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. అలాగే గోకుల్ బెన్నీ ఫొటోగ్రఫీ .. సతీశ్ రఘునాథన్ నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఏ కథలోనైనా ఆ కథలోని గొప్పతనమంతా దాని ముగింపు పైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి ముగింపును సరిగ్గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఇక ఈ నాలుగు కథలకు కలుపుకుని 'హాట్ స్పాట్' అనే టైటిల్ ఎందుకు పెట్టారనే సందేహానికి మాత్రం సమాధానం దొరకదు.
'హాట్ స్పాట్' (ఆహా) మూవీ రివ్యూ!
Hot Spot Review
- తమిళ సినిమాగా రూపొందిన 'హాట్ స్పాట్'
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- వేరు వేరుగా సాగే నాలుగు కథలు
- ఓ మాదిరిగా అనిపించేవి రెండు మాత్రమే
- వినోదం పాళ్లు తగ్గిన కంటెంట్
Movie Name: Hot Spot
Release Date: 2024-07-17
Cast: Adithya Bhaskar, Gouri Kishan, Sandy, Ammu Abhirami, Subhash Selvan, Janani, Kalaiyarasan
Director:Vighnesh Kaarthik
Producer: Anne Reddy - MunichadraReddy
Music: Sathish Raghunathan
Banner: KJB Talkies
Review By: Peddinti
Rating: 2.00 out of 5
Trailer