'యేవం' (ఆహా) మూవీ రివ్యూ!

Yevam

Yevam Review

  • ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా 'యేవం'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
  • రొటీన్ గా నడిచే కథ 
  • బలహీనమైన స్క్రీన్ ప్లే 
  • ఉత్కంఠను పెంచలేకపోయిన కంటెంట్     

 

 

ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై థ్రిల్లర్ కథలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. అందువలన ఈ తరహా కథలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా 'యేవం' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జూన్ 14వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజున 'ఆహా'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. చాందినీ చౌదరి .. జై భరత్ రాజ్ .. వశిష్ఠ సింహా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

ఈ కథ 'వికారాబాద్' లో జరుగుతుంది. అక్కడి పోలీస్ స్టేషన్ లో అభి ( జై భరత్ రాజ్) గంగాధర్ (గోపరాజు రమణ) పనిచేస్తూ ఉంటారు. అదే ఊరుకి చెందిన సౌమ్య (చాందినీ చౌదరి) ఆ పోలీస్ స్టేషన్ లోనే పోస్టింగ్ వస్తుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా, కావాలనే ఆమె ఆ వృత్తిని ఎంచుకుంటుంది. వికారాబాద్ పరిధిలో ఏ సమస్య తలెత్తినా ఈ పోలీస్ టీమ్ వెళ్లి పరిష్కరిస్తూ ఉంటుంది.  

అలాంటి పరిస్థితుల్లోనే వారి ముందుకు కొత్తగా ఒక సమస్య వస్తుంది. సహజంగానే కాలేజ్ అమ్మాయిలకు సినిమా స్టార్స్ అంటే క్రేజ్ ఉంటుంది. అందువలన ఫలానా హీరోతో డిన్నర్ .. ఫలానా హీరోతో డాన్స్ చేసే ఛాన్స్ అంటూ, అమ్మాయిలను ట్రాప్ చేయడం జరుగుతూ ఉంటుంది. ముందుగా అలాంటివారి బారిన కీర్తి అనే అమ్మాయి పడుతుంది. ఆ తరువాత అనూష అనే అమ్మాయి ప్రాణాలనే పోగొట్టుకుంటుంది. ఆ కేసుకు సంబంధించి, యుగంధర్ అనేపేరు తెరపైకి వస్తుంది.  

అభి వ్యక్తిత్వం నచ్చడంతో సౌమ్య అతణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. అప్పుడు అతను తనకి ఆల్రెడీ పెళ్లి అయినట్టు చెబుతాడు. కొన్ని కారణాల వలన తన భార్య తనని వదిలేసి వెళ్లిపోయిందని అంటాడు. ఆమె ఆశించినట్టుగా ఉండటం తన వలన కాదనీ, అందువల్లనే ఆమెను గురించి తాను ఆలోచించడం లేదని చెబుతాడు. అంత మంచి మనిషిని ఆమె ఎలా వదిలిపోయిందా అని సౌమ్య ఆలోచనలో పడుతుంది. 

ఇలాంటి పరిస్థితుల్లోనే గంగాధర్ కూతురు పెళ్లి పనుల్లో సౌమ్య పాలుపంచుకుంటుంది. ఆ సమయంలో శిరీష ఇంటికి వెళ్లిన ఆమెకి వాళ్ల మాటలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తాయి. దాంతో ఆమె ఆ దిశగా దృష్టి పెడుతుంది. శిరీషను ఎవరో దారుణంగా హత్య చేశారనే విషయం అప్పుడు ఆమెకి తెలుస్తుంది. అప్పుడు సౌమ్య ఏం చేస్తుంది? శిరీషను చంపిందెవరు? యుగంధర్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? అనేది కథ.

ఎక్కడో ఎవరో హత్యలు చేస్తుంటారు. హత్య చేయాలనుకున్నవారిని ట్రాప్ చేయడంలో .. హత్య చేయడంలో హంతకుడు ఒకే పద్ధతిని ఫాలో అవుతూ ఉంటాడు. అతణ్ణి పట్టుకోవడానికి పోలీస్ లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరబ్బా ఆ హంతకుడు? దొరికితే చూద్దామని ప్రేక్షకులు అనుకుంటారు. ఫలానావారు అయ్యుండొచ్చు అనే ఊహాగానాలు చేస్తారు. వాళ్లందరి అంచలనాలకు అందకుండా దర్శకుడు మరెవరినో చోపించి షాక్ ఇస్తాడు. 

ఇలాంటి కథలు ఇంతకుముందు చాలానే వచ్చాయి. అయితే కథనం ఆసక్తికరంగా ఉన్న కంటెంట్ ను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ వచ్చారు. ఇక ఈ కంటెంట్ విషయానికి వస్తే, అటు క్రైమ్ .. ఇటు సస్పెన్స్ కలిసి ప్రేక్షకులను థ్రిల్ చేయలేకపోయాయి. ఇక దర్శకుడు ఎంచుకున్న ఈ కథ కాస్త సంక్లిష్టంగా అనిపిస్తుంది. 'అపరిచితుడు' సినిమాలో హీరోకి ఉన్న 'స్ప్లిట్ పరసనాలిటీ' అనే  పాయింటును టచ్ చేశారు. 

ఆ సినిమాలో విక్రమ్ లోపలి మనిషి విక్రమ్ గానే కనిపిస్తాడు. కానీ ఇక్కడి పాత్రలోని లోపలి మనిషి మారిపోతాడు. అంటే ఆర్టిస్టులు మారిపోతారన్న మాట. సాధారణమైన పరిస్థితుల్లో ఒక ఆర్టిస్ట్ .. మానసిక అసహజస్థితికి లోనైనప్పుడు మరో ఆర్టిస్ట్ కనిపిస్తాడు. ఈ తేడా తెరపై ఉన్న మిగతా పాత్రలకి తెలియదు. ప్రేక్షకులకు మాత్రం తెలుస్తుంది. ఈ గందరగోళమే ప్రేక్షకులను అయోమయంలో పడేస్తుంది.

ఇక హత్యలు చేయడానికి హంతకుడు ఎంచుకున మార్గం .. అతను హత్యలు చేయడానికి కారణం .. ఇన్వెస్టిగేషన్ సాగే తీరు ఏదీ కూడా ఆసక్తిని కలిగించదు. పోనీ ఎవరు ఈ హత్యలు చేస్తున్నారో చివరివరకూ చెప్పకుండా ఉంటే బాగుండునని అనుకంటే, ఆ సస్పెన్స్ ను కాస్త ఇంటర్వెల్ కి రివీల్ చేశారు. ఇక ఇక్కడి నుంచి కథను ఫాలో కావాలో లేదో ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు తగినట్టుగానే అనిపిస్తాయి. ఎలాంటి ట్విస్టులు లేకుండా సాదాసీదాగా సాగిపోయే రొటీన్ కంటెంట్ ఇది. 

Movie Name: Yevam

Release Date: 2024-07-25
Cast: Chandini Chowdary, Vasishta N Simha, Jai Bharat Raj, Ashu Reddy Goparaju Ramana
Director:Prakash Dantuluri.
Producer: Navadeep
Music: Kerthana Sesh
Banner: C space Productions

Rating: 2.00 out of 5

More Reviews