'టర్బో' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

Turbo

Turbo Review

  • మమ్ముట్టి హీరోగా రూపొందిన 'టర్బో'
  • ప్రతినాయకుడిగా మెప్పించిన రాజ్ బి శెట్టి 
  • ఆసక్తికరమైన కథాకథనాలు
  • ఆకట్టుకునే యాక్షన్ సీన్స్ 
  • బోర్ అనిపించకుండా సాగే కంటెంట్  

మమ్ముట్టి ఈ వయసులోను వరుస సినిమాలతో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. ఇక నిర్మాతగా కూడా ఆయన నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. అలా ఆయన హీరోగా .. ఆయన సొంత బ్యానర్ లో రూపొందిన సినిమానే 'టర్బో'. మే 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ ఆయన అభిమానులను ఆకట్టుకుంది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే తెలుగులోనూ 'సోనీలివ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

జోస్ (మమ్ముట్టి) ఒక గ్రామంలో తన తల్లితో కలిసి నివసిస్తూ ఉంటాడు. అతని స్నేహితుడే జెర్రీ (శబరీశ్) చెన్నైలోని ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. అదే సిటీలో మరో బ్యాంకులో మేనేజర్ గా పనిచేస్తున్న ఇందులేఖ (అంజనా జయప్రకాశ్)తో జెర్రీ ప్రేమలో పడతాడు. ఆమె తల్లిదండ్రులు .. చెల్లెలు ఆ పక్కనే ఉన్న ఊళ్లో ఉంటారు. ప్రతి ఏడాది తీరనాళ్ల సమయంలో జోస్ ఊళ్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందువలన జోస్ ను వేరే ఊరికి పంపించాలని తల్లి అనుకుంటుంది. 

అయితే జెర్రీ కారణంగానే కొంతమంది రౌడీలతో జోస్ గొడవపడతాడు. జెర్రీ - ఇందులేఖ ప్రేమించుకున్నారనీ .. ఆ మరుసటి రోజే వేరే వ్యక్తితో ఆమె నిశ్చితార్థం జరగనుందనీ .. అందుకు అడ్డుగా ఉన్న కారణంగానే జెర్రీని కొట్టడానికి ఆమె తండ్రి మనుషులను పంపించాడనే విషయం జోస్ కి అర్థమవుతుంది. దాంతో అతను జెర్రీకి చెప్పకుండా వెళ్లి, ఆమె తల్లిదండ్రులతో గొడవపడి అతని ఇంటికి తీసుకుని వస్తాడు. 

అయితే తండ్రికి భయపడిన జెర్రీ, ఇందులేఖ ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు. ఆ కోపంతో ఆమె చెన్నై బస్సు ఎక్కేస్తుంది. ఇందులేఖని తాను కిడ్నాప్ చేసినట్టుగా ఆమె తండ్రి కేస్ పెట్టాడని తెలుసుకున్న జోస్, ఆమె కోసం చెన్నై వెళతాడు. తన ఊరు వచ్చి తన గురించి పోలీస్ స్టేషన్లో ఒక మాట చెప్పమని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి చెన్నైలోనే ఉండిపోతాడు. తనని తాను పోషించుకోవడం కోసం ఒక చోట డ్రైవర్ గా చేరతాడు. 

తిరునాళ్ల తరువాత బ్యాంకులో డ్యూటీలో చేరిన జెర్రీ, చనిపోయినవారి బ్యాంకు ఎకౌంట్ల ద్వారా 100 కోట్ల స్కామ్ జరిగిందని గుర్తిస్తాడు. ఈ స్కామ్ వెనుక ఉన్నది షణ్ముగ సుందరం ( రాజ్ బి శెట్టి) అని తెలుసుకుంటాడు. ఈ ఎఫెక్ట్ ఇందులేఖ పనిచేసే బ్యాంకుపై కూడా పడుతుందని భావించి, ఆమెకి చెప్పడానికి వెళతాడు. అయితే అతనిపై ఉన్న కోపం కారణంగా ఆమె వినిపించుకోదు. ఆ తరువాత అతను అనుమానాస్పద స్థితిలో చనిపోతాడు.

జెర్రీ మరణం ఇందులేఖను కుంగదీస్తుంది. అదే సమయంలో ఆమెపై ఎటాక్ జరుగుతుంది. ఇదంతా ఎవరు చేస్తున్నారనే ఆలోచన జోస్ ను సతమతం చేస్తుంటుంది. అదే సమయంలో జెర్రీతో పాటు కలిసి బ్యాంకులో పనిచేసిన సితార వస్తుంది. 100 కోట్ల బ్యాంకు స్కామ్ గురించి ఇందులేఖతో చెబుతుంది. జెర్రీ చావుకు కారణం షణ్ముగ సుందరం అని అంటుంది. షణ్ముగ సుందరం ఎవరు? అతను ఏం చేస్తుంటాడు? అతని కారణంగా జోస్ - ఇందులేఖ ఎలాంటి పరిణామాలను ఎదుర్కుంటారు? అనేది మిగతా కథ.

దీపావళి రోజున ఒక రౌడీ గ్యాంగ్ ఒక యువజంటను హత్యచేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఆ తరువాత ఆ యువ జంట ఎవరు? వాళ్లని ఎవరు హత్యా చేశారు? ఎందుకు చేశారు? అనేది దర్శకుడు చాలా సేపటి తరువాత రివీల్ చేస్తాడు. అప్పటివరకూ ఆ సందర్భం కోసం వెయిట్ చేస్తూ వెళ్లిన ప్రేక్షకులు .. అక్కడి ఉంచి కథను ఫాలో కావడంలో పూర్తిగా నిమగ్నమవుతారు. అలా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే హైలైట్ గా అనిపిస్తుంది.

మిథున్ థామస్ అందించిన కథ, అనూహ్యమైన మలుపులతో ఆకట్టుకుంటుంది. కామెడీ ప్లస్ యాక్షన్ తో కూడిన మమ్ముట్టి జోస్ పాత్రను .. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో రాజ్ బి శెట్టి పాత్రను  డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. ఎక్కడా సినిమాటిక్ గా కాకుండా చాలా సహజంగా కథ మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఈ కథలో మమ్ముట్టికి జోడీగా ఎవరూ ఉండరు .. అలాగని ఆ లోటు కూడా తెలియదు. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ వరుస ట్విస్టులను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు.

విష్ణు శర్మ కెమెరా పనితనం .. సందర్భానికి తగినట్టుగా వెళ్లే క్రిస్టో సేవియర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటాయి. ఫోనిక్స్ ప్రభు డిజైన్ చేసిన యాక్షన్ దృశ్యాలు బాగున్నాయి. ముఖ్యంగా రన్నింగ్ బస్సులో ఫైట్ .. పోలీస్ స్టేషన్ లో ఫైట్ .. కార్ల ఛేంజింగ్ ఉత్కంఠను పెంచుతాయి. ఒక గ్యాంగ్ స్టర్ 100 కోట్ల స్కామ్ కి పాల్పడితే .. అతనికి కొంతమంది బ్యాంకు అధికారులు .. మరికొందరు పోలీసులు సహకరిస్తే ఎలా ఉంటుందనే ఈ కథ, ఎక్కడా బోర్ అనిపించకుండా సాగుతుంది. 



Movie Name: Turbo

Release Date: 2024-08-09
Cast: Mammootty, Anjana Jayaprakash, Raj B Shetty, Shabareesh Varma, Sunil, Kabir Duhan Singh
Director:Vysakh
Producer: Mammootty
Music: Christo Xavier
Banner: Mammootty Kampany

Rating: 3.00 out of 5

Trailer

More Reviews