'కాళరాత్రి' (ఆహా) మూవీ రివ్యూ!

Kalarathri

Kalarathri Review

  • మలయాళంలో వచ్చిన నల్లా నిళవుల్లా రాత్రి'
  • తెలుగు టైటిల్ తో వచ్చిన 'కాళరాత్రి'
  • వినోదానికి దూరంగా నడిచే కథాకథనాలు 
  • హింస - రక్తపాతం పాళ్లు ఎక్కువ 
  • ఈ జోనర్ ను ఇష్టపడేవారు మాత్రమే చూసే సినిమా  

మలయాళంలో 2023లో వచ్చిన థ్రిల్లర్ చిత్రాలలో 'నల్లా నిళవుల్లా రాత్రి' ఒకటి. థియేటర్స్ కి వచ్చిన ఈ సినిమా, ఈ జోనర్ ని ఇష్టపడేవారికి కొంతవరకూ ఆకట్టుకోగలిగింది. మర్ఫీ దేవాసి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 17వ తేదీ నుంచి 'కాళరాత్రి' టైటిల్ తో 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడ్డు చూద్దాం.

కురియన్ (బాబూ రాజ్) కేరళలోని ఓ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. అతనికి కర్ణాటక ప్రాంతంలోని 'షిమోగా' అనే ప్రదేశంలో 266 ఎకరాల తోట ఉంటుంది. తన వ్యాపార వ్యవహారాల కోసం అతను తన దూరపు బంధువైన అచ్చాయన్ (సాయికుమార్) దగ్గర 3 కోట్లకు తాకట్టుపెడతాడు. ఆ తోటను తాకట్టు నుంచి విడిపించమని భార్య పోరుతూ ఉంటుంది. అదే సమయంలో అతనికి తనతో కలిసి చదువుకున్న స్టూడెంట్స్ తారసపడతారు. 

కురియన్ స్నేహితుల జాబితాలో డొమినిక్ (జీను జోసెఫ్) జోషి (బిను పప్పు) పీటర్ (రోనీ డేవిడ్) ఉంటారు. తన స్నేహితులు ఆర్గానిక్ సేద్యంలో మంచి లాభాలు పొందుతూ ఉండటంతో, తన తోటను వాళ్లకి 12 కోట్లకి అమ్మాలని కురియన్ భావిస్తాడు. ఆ తోట మధ్యలో బ్రిటీష్ కాలంనాటి బంగ్లా ఉందనీ, చూడటానికి వెళదామని వాళ్లకి చెబుతాడు. ఆ డీల్ ఓకే అయితే అచ్చాయన్ కి 3 కోట్లు ఇచ్చేసి అప్పు నుంచి బయటపడొచ్చని భావిస్తాడు. 

కురియన్ తన అక్క కొడుకైన పాల్ జోసెఫ్ తో కలిసి .. స్నేహితుల వెంట తోటకి వెళతాడు. కర్ణాటకలో తమ పాత మిత్రుడు ఇడుంబన్ (చెంబన్ వినోద్ జోస్) ఉన్నాడనీ, అతనికి టచ్ లోకి వెళదామని మిగతా స్నేహితులు అంటే, కురియన్ అయిష్టతను వ్యక్తం చేస్తాడు. పాత గొడవలు మరిచిపోలేదని చెబుతాడు. డ్రైవర్ గా అనీష్ (గణపతి)ని తీసుకుని బయలుదేరుతారు. అలా వాళ్లు చీకటి పడే సమయానికి షిమోగా ప్రాంతానికి చేరుకుంటారు.

అందరూ కలిసి పార్టీ చేసుకుంటూ ఉండగా, హఠాత్తుగా అక్కడికి ఇడుంబన్ వస్తాడు. తనకి తెలియకుండా మిగతా మిత్రులు అతనికి కబురు చేయడం కురియన్ కి కోపాన్ని తెప్పిస్తుంది. అయినా అతణ్ణి ఇడుంబన్ నవ్వుతూ పలకరించి కూల్ చేస్తాడు. ఆ తరువాత నుంచి మళ్లీ పార్టీ సందడి మొదలవుతుంది. మధ్యలో ఏదో అలికిడి అయిందంటూ బయటికి వెళ్లిన రాజీవ్ తిరిగిరాడు. అతను దారుణంగా చంపబడి ఉండటం చూసి భయపడిపోతారు. 

రాజీవ్ ని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అని ఆలోచన చేసే లోగానే పాల్ కూడా దారుణంగా హత్య చేయబడతాడు. దాంతో మిగతా వాళ్లంతా తోట బంగాళాలోకి వెళ్లి దాక్కుంటారు. ఎవరికి వారు ఆ బంగ్లాలో చేతికి దొరికిన వస్తువులనే ఆయుధాలుగా చేసుకుంటారు. అంతలోనే డొమినిక్ కూడా భయంకరంగా చంపబడతాడు. దాంతో మిగతావారిలో మరింతగా ప్రాణభయం పెరుగుతుంది. అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? వాళ్లను చంపుతున్నది ఎవరు? అందుకు కారణం ఏమిటి? అనేది మిగతా కథ. 

ఆరుగురు పాత మిత్రులు ఒక బిజినెస్ డీల్ కుదుర్చుకోవడం కోసం, ఫారెస్టు ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఒక తోటకి వెళతారు. అక్కడ వాళ్లు ఒక్కొక్కరిగా దారుణంగా హత్య చేబడుతూ ఉంటారు. అందుకు కారణం ఏమిటి? కారకులు ఎవరు? అనే ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ కథను దేవాసి- ప్రపుల్ సురేశ్ కలిసి రెడీ చేశారు. కథను తోట బంగళాకు తీసుకుని వెళ్లడానికి దర్శకుడు కాస్త ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. అక్కడి వెళ్లిన తరువాత కథను త్వరగా ముగించాడు.

ఈ సినిమాలో హీరోలు .. హీరోయిన్స్ .. లవ్ .. రొమాన్స్ ..  డ్యూయెట్లు వంటివి ఉండవు. ఆరుగురు స్నేహితుల చుట్టూనే కథ నడుస్తూ ఉంటుంది. వాళ్లల్లో వాళ్లకు గల గొడవలు .. కోపాలు .. మనస్పర్థలు .. సారీలతోనే కథ చాలావరకూ నడుస్తుంది. అంతా కలిసి ఒకేసారి ప్రమాదంలో పడటంతోనే అసలు కథ మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి మరింత ఉత్కంఠభరితంగా సాగుతుంది.

చివరి అరగంటవరకూ కాస్త నీరసంగా .. నిరుత్సాహంగా నడిచిన కథ, ఆ తరువాత హింస - రక్తపాతంతో కలిసి నడుస్తూ కంగారుపెడుతుంది. ఏ మాత్రం వినోదం పాళ్లు లేని ఈ తరహా కథలను ఒక వర్గం ప్రేక్షకులు మాత్రమే చూడగలరు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి తగినట్టుగానే అనిపిస్తాయి. స్నేహతులలో ఏ ఒక్కరూ దారితప్పినా అందరూ ప్రమాదంలో పడతారనే ఒక సందేశం మాత్రం అంతర్లీనంగా కనిపిస్తూ ఉంటుంది. 

ఈ కథను ఫస్టాఫ్ గా .. సెకండాఫ్ గా చెప్పలేం. మొదట గంటన్నర భాగం ఒక ఎత్తు .. చివరి అరగంట ఒక ఎత్తు అనే చెప్పుకోవాలి. హత్యలు జరిగే తీరు సాధారణ ప్రేక్షకులు చూడలేరు. విపరీతమైన రక్తపాతం ప్రేక్షకులను భయపెడుతుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలను చూడటం అలవాటున్నవారే చూసే సినిమా ఇది. ముగింపు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. సీక్వెల్ కి అనుకూలంగానే కట్ చేసిన విధానం సంతృప్తికరంగా అనిపిస్తుంది.  

Movie Name: Kalarathri

Release Date: 2024-08-17
Cast: Chemban Vinod Jose, Jinu Joseph, Baburaj, Sajin Cherukayil
Director:Devasi
Producer: -
Music: Kailas Menon
Banner: Hanuman productions

Rating: 2.00 out of 5

Trailer

More Reviews