'హనీమూన్ ఎక్స్ ప్రెస్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Honeymoon Express

Honeymoon Express Review

  • రొమాంటిక్ డ్రామాగా 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' 
  • చైతన్యరావు జోడిగా కనిపించిన హెబ్బా పటేల్ 
  • బలహీనమైన కథాకథనాలు 
  • ఆకట్టుకోని సన్నివేశాలు
  • కథ మొత్తం మీద లోపించిన క్లారిటీ  


చైతన్యరావు - హెబ్బా పటేల్ జంటగా నటించిన సినిమానే 'హనీమూన్ ఎక్స్ ప్రెస్'. బాలరాజశేఖరుని దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 21వ తేదీన థియేటర్లకు వచ్చింది. పెద్దగా పబ్లిసిటీ లేని కారణంగా, ఈ సినిమా ఇలా థియేటర్లకు వచ్చి అలా వెళ్లిపోయింది. బాలరాజ్ నిర్మించిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఇషాన్ (చైతన్యరావు) సోనాలి (హెబ్బా పటేల్) తొలి చూపులోనే ప్రేమలో పడతారు. తమ అభిప్రాయాలు .. అభిరుచులు ఒకటేనని భావించి పెళ్లి చేసుకుంటారు. ఆ తరువాత వారి మధ్య గిలికజ్జాలు మొదలవుతాయి. ప్రతి విషయంలోను గొడవపడుతూ ఉంటారు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవడంతో చిటపటలాడుతూ ఉంటారు. పెళ్లి పేరుతో తమ జీవితాలను నాశనం చేసుకున్నామనే స్థితికి వస్తారు. 

అలాంటి పరిస్థితుల్లో వారికి బాల (తనికెళ్ల భరణి) త్రిపుర సుందరి (సుహాసిని) దంపతులు తారసపడతారు. 70లలో పడిన ఆ దంపతులు రొమాంటిక్ గా ఉండటం .. హుషారుగా ఉండటం .. ఆడుతూ పాడుతూ తమ జీవితాన్ని గడపడం చూసి సోనాలి - ఇషాన్ ఇద్దరూ కూడా షాక్ అవుతారు. అలా ఉండటం ఎలా సాధ్యమని అడుగుతారు. అనుభవాలు నేర్పిన పాఠాలే తమ ఆనందానికి కారణమని వాళ్లు చెబుతారు. 

సోనాలి - ఇషాన్ ఇద్దరూ కూడా హ్యాపీగా లేరని భావించిన ఆ దంపతులు, 'హనీమూన్ ఎక్స్ ప్రెస్' కాన్సెప్ట్ ను వాళ్ల ముందుంచుతారు. ఒక వారం రోజుల పాటు ఇద్దరూ తామే ఒక ప్రపంచంగా బ్రతకమనీ, అప్పుడు వారి మధ్య దూరం తగ్గిపోతుందని ఆ దంపతులు చెబుతారు. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుని, సంతోషంగా జీవితాన్ని మొదలుపెట్టొచ్చని అంటారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా వాళ్లే చేస్తారు. 

దాంతో ఇషాన్ - సోనాలి ఇద్దరూ కూడా ఆ రిసార్ట్ కి చేరుకుంటారు. అక్కడ వాళ్ల మధ్య ఎలాంటి సంఘటనలు జరుగుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? రిసార్టులోని అనుభవాలు వారిని కలిపి ఉంచుతాయా? వారి మధ్య దూరాన్ని మరింత పెంచుతాయా? అనేది మిగతా కథ.

ఈ కాలంలో ప్రేమ - పెళ్లి - విడాకులు .. చకచకా జరిగిపోతున్నాయి. యువతీ యువకులు ప్రతి విషయంలోనూ ఫాస్టుగా ఉంటున్నారు. అపార్థాలతో విడిపోతున్నారు. అందుకు కారణం ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం .. అందుకు తగిన సమయాన్ని ఎంత మాత్రం కేటాయించలేకపోవడం. అలాంటి ఒక జంట కలిసి ఉండటం కోసం చేసిన సూచనగా 'హనీమూన్ ఎక్స్  ప్రెస్' కాన్సెప్ట్ కనిపిస్తుంది.

కొత్తగా పెళ్లయిన ఒక జంటకి జీవితం పట్ల ఆవగాహన కలిగించి, వాళ్లను కలిపి ఉంచేలా చేయాలనే ఒక ఆలోచన మంచిదే. అయితే అందుకోసం దర్శకుడు రాసుకున్న కథ .. కథనం .. సన్నివేశాలు .. సంభాషణలు ఆడియన్స్ కి ఎంతమాత్రం కనెక్ట్ అయ్యేలా లేవు. కథలో చాలా భాగాన్ని హీరో హీరోయిన్స్ చుట్టూ తిప్పారు. పైగా నాలుగు గోడల మధ్య నడిచే సన్నివేశాలు ఎక్కువ.  ఎంతమాత్రం పట్టులేని సన్నివేశాలు అవి. 

చైతన్యరావుకి ఒక రకమైన ఇమేజ్ ఉంది. అలాంటి పాత్రలు మాత్రమే ఆయనకి సెట్ అవుతాయి. ఆయనను ఆ ఇమేజ్ లో నుంచి బయటికి లాగితే, అతను మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఇబ్బందిపడే పరిస్థితి. ఇక హెబ్బా పటేల్ తో అతని రొమాన్స్ ఆడియన్స్ కి అసహనాన్ని కలిగిస్తుంది. టీనేజ్ పిల్లల మధ్య లవ్ -  రొమాన్స్ ను చూడటానికి మాత్రమే ఇష్టపడే ట్రెండ్ ఇది. పైగా ఇద్దరి మధ్య ఎంత మాత్రం కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. 

ఇక రిసార్టులో ఇద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశాలను చూస్తే, అసలు స్క్రిప్ట్ రాసుకున్నారా? అప్పటికప్పుడు అక్కడికక్కడే అనుకుని చేయించారా? అనే సందేహం కలగక మానదు. ఎందుకంటే ఏ సన్నివేశంలోను జీవం కనిపించదు. ఇక తనికెళ్ల భరణి - సుహాసిని పాత్రల విషయానికి వస్తే, ఏ మాత్రం విషయంలేని ఈ పాత్రలను చేయడానికి వారు అంగీకరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏ మాత్రం నప్పని పాత్రలలో వారిని అలా చూడటం ఇబ్బందిని కలిగిస్తుంది. ఇక డాక్టర్ 'భంగిమ భాస్కర్' అంటూ అలీ పాత్రతో నవ్వించడానికి చేసిన ప్రయత్నం పూర్తిగా విఫలం.  

'హనీమూన్ ఎక్స్ ప్రెస్' టైటిల్ ను బట్టి ఆడియన్స్ ఒక లైన్ అనేసుకుంటారు. కానీ నిజానికి దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? అనేది మనకి అర్థం కాదు. ఎందుకంటే మధ్య మధ్యలో దర్శకుడు ఆ పక్కకీ .. ఈ పక్కకి కథను తీసుకెళ్లిన తీరు ఆడియన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తుంది. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. కల్యాణి మాలిక్ అందించిన సంగీతం  కొంతవరకూ హెల్ప్ అయిందని అనిపిస్తుంది. కథాకథనాల పరంగా .. కాంబినేషన్ పరంగా ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయిన కంటెంట్ ఇది.    
     

Movie Name: Honeymoon Express

Release Date: 2024-08-27
Cast: Chaitanya Rao, Hebbah Patel, Thanikella Bharani, Suhasini, Ali
Director:Bala Rajasekharuni
Producer: Balaraj
Music: Kalyani Malik
Banner: NRI Entertaiments

Rating: 2.00 out of 5

Trailer

More Reviews