'పురుషోత్తముడు' (ఆహా) మూవీ రివ్యూ!

Purushothamudu

Purushothamudu Review

  • రాజ్ తరుణ్ హీరోగా 'పురుషోత్తముడు'
  • టైటిల్ కి తగినట్టుగా లేని కంటెంట్ 
  • పేలని కామెడీ .. ఎమోషన్స్ 
  • అక్కడక్కడా కనిపించే హిట్ సినిమాల ఛాయలు


రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'పురుషోత్తముడు' రమేశ్ తేజావత్ - ప్రకాశ్ తేజావత్ నిర్మించిన ఈ సినిమాకి, రామ్ భీమన దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, జులై 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. ప్రకాశ్ రాజ్ .. మురళీ శర్మ .. రమ్యకృష్ణ వంటి సీనియర్ స్టార్స్ నటించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

రామ్ (రాజ్ తరుణ్) లండన్ లో చదువు పూర్తిచేసి ఇండియాకి తిరిగి వస్తాడు. అతని తండ్రి ఆదిత్య రామ్ (మురళీశర్మ) శ్రీమంతుడు. పరశురామయ్య  గ్రూప్ ఆఫ్ కంపెనీస్ బాధ్యతను అతను సమర్థవంతగా నిర్వహిస్తూ ఉంటాడు. అతని భార్య భారతి (కౌసల్య). రామ్ ను కంపెనీ సీఈవోగా చూడాలనేది అతని తండ్రి కల. అందుకు సంబంధించిన సన్నాహాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ విషయం వసుంధర(రమ్యకృష్ణ)కి ఎంతమాత్రం నచ్చదు. 

ఆదిత్య రామ్ వదిననే వసుంధర. ఆ సంస్థలో ఆమెకి 50 శాతం షేర్స్ ఉంటాయి. అందువలన సంస్థ తీసుకునే నిర్ణయానికి ఆమె ఆమోదం లభించవలసిందే. ఆమెకి ఒక కొడుకు .. కూతురు. కొడుకు అభయ్ రామ్ సీఈవో కావాలనేది ఆమె కోరిక. అయితే ఆ సంస్థకి సీఈవో కావాలంటే, ఆ వ్యక్తి 100 రోజుల పాటు అజ్ఞాతంగా ఉంటూ సాధారణమైన వ్యక్తిగా జనంతో కలిసి జీవించాలి. తాను ఎవరనేది ఎవరికీ చెప్పకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోను ఫ్యామిలీ నేపథ్యాన్ని గానీ .. డబ్బును గాని ఉపయోగించకూడదు. 


100 రోజులలో తాను ఎవరనేది ఎవరు పసిగట్టినా అతను ఓడిపోయినట్టే అవుతుంది. అప్పుడు సీఈవో పదవి తరువాత వారసులకు దక్కుతుందనే నిబంధన పరశురామయ్య చేసినదే. అలా సీఈవో పదవికి ముందు జనంలోకి వెళ్లిన రాఘవ (ప్రకాశ్ రాజ్) తిరిగి రాకపోవడం వల్లనే, ఆదిత్య రామ్ సీఈవో అవుతాడు. అప్పటి నుంచి అతనిపై వసుంధర గుర్రుగా ఉంటుంది. ఈ సారి  సీఈవో కావాలనుకునే వారు కూడా అదే నిబంధనను పాటించాలని ఆమె బలంగా చెబుతుంది.      

దాంతో 100 రోజుల పాటు ఓ సాధారణమైన యువకుడిగా కష్టపడి బ్రతుకుతూ, తానేమిటనేది నిరూపించుకోవడం కోసం కట్టుబట్టలతో రామ్ బయల్దేరతాడు.  అతని ఆచూకీ తెలుసుకుని ఓడించి అభయ్ రామ్ ను సీఈవోను చేయాలనే పట్టుదలతో వసుంధర రంగంలోకి దిగుతుంది. రామ్ వైజాగ్ వెళ్లిపోయి అక్కడ కొత్తగా తన జీవితాన్ని మొదలుపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే అనుకోకుండా అతను మార్గమధ్యంలో దిగవలసి వస్తుంది. 

అలా మధ్యలోనే ట్రైన్ దిగేసిన రామ్, 'రాయపులంక' అనే గ్రామానికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? అతని జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అతని అజ్ఞాతవాసాన్ని భగ్నం చేయాలనే వసుంధర ప్రయత్నం ఫలిస్తుందా? 20 ఏళ్ల క్రితం వెళ్లిన ఆమె భర్త ఏమైపోయాడు? 100 రోజులలో రామ్ కి ఎదురయ్యే అనుభవాలు ఎలాంటివి? అనేది కథ.

ఈ కథలో హీరో కలవారి బిడ్డ .. కష్టం తెలియని వాడు. 100 రోజుల పాటు సామాన్యుడిగా బ్రతకడం అంత తేలికైన విషయమేం కాదు. పైగా ఆ పరీక్ష సమయంలో అజ్ఞాతంగా ఉండటం మరింత కష్టం. కానీ అనుకున్నది సాధించాలంటే సవాళ్లను ఎదుర్కోవలసిందే. ఆ సమయంలో హీరో పడే కష్టాలు ఒక రేంజ్ లో ఉండాలి. అప్పుడే ఆడియన్స్ అయ్యో పాపం అనుకుంటారు. ఎమోషనల్  గా కనెక్ట్ అవుతారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. 

హీరో నేరుగా ఒక చక్కని పల్లెటూరికి వెళతాడు. అక్కడే అతనికి హీరోయిన్ తారసపడుతుంది. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. నెమ్మదిగా అతణ్ణి ఆరాధించడం మొదలుపెడుతుంది. అతను కూడా ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. అలా ఒక తోడు .. నీడ దొరకడంతో రోజులు చకచకా జరిగిపోతూ ఉంటాయి.

ఈ క్రమంలోనే ఆ పరిసర ప్రాంతాల్లోని పూల రైతుల కష్టాలను తీర్చడానికి హీరో నడుం కడతాడు. రైతుల దగ్గర నుంచి తక్కువ రేటుకు పూలు కొనే బాలరాజుకు అది కోపం తెప్పించడంతో అతను తన అనుచరులను రంగంలోకి దింపుతాడు. ఇక మరో వైపున వసుంధర పురమాయించిన రౌడీ  గ్యాంగ్ రామ్ ను వెతుక్కుంటూ ఆ గ్రామానికి చేరుకుంటుంది. ఇలా ఈ కథ ముందుకు వెళుతుంది. ఏ కష్టాలైతే హీరో పడాలని పంపిస్తారో .. ఆ కష్టాలను తెరపై చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. 

'పురుషోత్తముడు' అనే టైటిల్ కి వెయిట్ ఎక్కువ. ఆ పాత్రకి ఇచ్చిన బిల్డప్ కూడా ఎక్కువే. అయితే వయసు పరంగా .. పర్సనాలిటీ పరంగా ఆ పాత్రకి రాజ్ తరుణ్ సరిపోలేదని అనిపిస్తుంది. అందువల్లనే అతను చెప్పే కొన్ని డైలాగులు ఎంత మాత్రం పేలలేదు. ఇక హీరోయిన్ నటన కూడా కృతకంగా కనిపిస్తూ ఉంటుంది. ఇద్దరి మధ్య సరైన రొమాంటిక్ సీన్ ఒక్కటీ పడలేదు. ఇద్దరి మధ్య అసలు కెమిస్ట్రీ కుదరలేదు. 

ఇక ఎన్నో ఏళ్లుగా పూలను పండించే రైతులు, తమ బ్రతుకులను ఉద్దరించమంటూ అంతకుముందే లండన్ నుంచి వచ్చిన హీరో వెంటపడటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అతను కనిపిస్తే చాలు .. రెండు చేతులు పైకెత్తి సామూహిక నమస్కారాలు పెట్టేస్తూ ఉంటారు. హీరోకి తగిన కంటెంట్ కాకపోవడం వలన .. ఆయన క్రేజ్ కి తగిన కంటెంట్ కాకపోవడం వలన ఈ తరహా సన్నివేశాలు 'అతి'గా అనిపిస్తూ ఇబ్బందిపెడుతూ ఉంటాయి. కొన్ని హిట్ సినిమాల ఛాయలు కనిపిస్తూ ఉంటాయి. 

రమ్యకృష్ణ .. ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ స్టార్స్ ఉన్నప్పటికీ వాళ్ల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేదు. 'త్వరలో నేను రిటైర్ అవుతున్నాను .. నన్ను వదిలేయండి బాబోయ్' అనే పాత్రలో బ్రహ్మానందాన్ని ఎందుకు పెట్టారనేది అర్థం కాదు. 'నత్తి రవి'గా రచ్చరవితో చేయించడానికి ప్రయత్నించిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. గోపీసుందర్ బాణీలు గుర్తుపెట్టుకోదగినవిగా లేవు.  పీజీ విందా ఫొటోగ్రఫీ .. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఓకే. టైటిల్ కి తగిన బరువైన కథ .. అందుకు తగిన కథనం లేకుండా నీరసంతో నడిచే కంటెంట్ ఇది. 

Movie Name: Purushothamudu

Release Date: 2024-08-29
Cast: Rajtarun, Hasini Sudheer, Ramyakrshna, Prakash Raj , Muralisharma
Director:Ram Bhimana
Producer: Ramesh Tejawath- Prakash Tejawath
Music: Gopi Sundar
Banner: Sridevi Productions

Rating: 2.00 out of 5

Trailer

More Reviews