'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' - మూవీ రివ్యూ!

The Greatest Of All Time

The Greatest Of All Time Review

  • విజయ్ హీరోగా వచ్చిన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్'
  • భారీ నిర్మాణ విలువలు 
  • మలుపులు ఎక్కువైపోయిన కథ 
  • ఇబ్బంది పెట్టేసిన విజయ్ హెయిర్ స్టైల్ 
  • మళ్లీ ప్రాధాన్యతలేని పాత్రలో మీనాక్షి 

విజయ్ అభిమానులంతా ఆయన తాజా చిత్రమైన 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' సినిమా కోసం కొంత కాలంగా వెయిట్ చేస్తూ వస్తున్నారు. స్నేహ - మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే తమిళంతో పాటు తెలుగులోను విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 2008 - 2024కి మధ్య జరుగుతుంది. గాంధీ (విజయ్) సునీల్ (ప్రశాంత్) కల్యాణ్ (ప్రభుదేవా) అజయ్ (అజ్మల్) యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో పనిచేస్తూ ఉంటారు. నలుగురూ కూడా మంచి స్నేహితులు. గాంధీ భార్య అనసూయ (స్నేహ). ఆ దంపతుల సంతానమే జీవన్. అనసూయ మళ్లీ గర్భవతిగా ఉంటుంది. తాను చేసే పని ఏమిటనేది ఆమెకి తెలియకుండా గాంధీ జాగ్రత్తపడుతూ ఉంటాడు.   

కెన్యాలో 2008లో జరిగిన ఒక ఆపరేషన్ లో గాంధీ టీమ్ పాల్గొంటుంది. ఆ తరువాత మరో ఆపరేషన్ కోసం గాంధీ టీమ్ 'బ్యాంకాక్ 'కి వెళ్లాలనుకుంటుంది. అనసూయకి తెలియకుండా గాంధీ తన జాబ్ చేస్తుండటం వలన, ఆమె అతణ్ణి అనుమానిస్తూ ఉంటుంది. దాంతో ఆమెను కూడా వెంటబెట్టుకుని అతను 'బ్యాంకాక్' వెళతాడు. స్నేహితులు వద్దని చెప్పినా అతను వినిపించుకోడు. ఫలితంగా అతను అక్కడ ఐదేళ్ల తన కొడుకు జీవన్ ను కోల్పోతాడు. 

అనసూయ 'బ్యాంకాక్ 'లోనే డెలివరీ అవుతుంది .. ఆడపిల్ల పుడుతుంది. అయితే జీవన్ చనిపోయాడని తెలుసుకున్న ఆమె మానసికంగా కుంగిపోతుంది. అప్పటి నుంచి ఆమె గాంధీతో మాట్లాడటం మానేస్తుంది. కొడుకు పోయాడనే బాధతో గాంధీ తన జాబ్ ను పక్కన పెట్టేస్తాడు. అలా ఓ 16 ఏళ్లు గడిచిపోతాయి. వాళ్ల కూతురు జీవిత టీనేజ్ లోకి అడుగుపెడుతుంది. ఆ సమయంలో ఒక పనిపై గాంధీ మాస్కో వెళతాడు. 

మాస్కోలో దిగిన గాంధీపై ఫైజల్ గ్యాంగ్ ఎటాక్ చేస్తుంది. ఆ గ్యాంగ్ లోని ఒక కుర్రాడు అచ్చు తన మాదిరిగానే ఉండటాన్ని గాంధీ చూస్తాడు. ఆ కుర్రాడు కూడా తనని గమనిస్తూ ఉండటాన్ని పసిగడతాడు. ఆ కుర్రాడిని రహస్యంగా కలుసుకున్న గాంధీకి, అతను తన కొడుకు జీవన్ అనే విషయం అర్థమవుతుంది. ప్రమాదకరమైన ఫైజల్ గ్యాంగ్ లో తన కొడుకు పనిచేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఫైజల్ గ్యాంగ్ ను ఎదిరించి జీవన్ ను తనతో పాటు ఇండియాకి తీసుకుని వస్తాడు. 

 చనిపోయాడనుకున్న జీవన్ బ్రతికి రావడంతో అనసూయ సంతోషంతో పొంగిపోతుంది. అతని రాకతో గాంధీ - అనసూయ ఎప్పటిలా ఆనందంగా కలిసి ఉంటారు. అయితే ఉహించని విధంగా గాంధీ స్నేహితులపై దాడి జరుగుతూ ఉంటుంది. అజయ్ ..  నజీర్ ఇద్దరూ ఆ దాడులలో చనిపోతారు. తన కొడుకు జీవన్  తిరిగి వచ్చిన దగ్గర నుంచే అలా జరుగుతోందనే అనుమానం  గాంధీకి కలుగుతుంది. అప్పుడతను ఏం చేస్తాడు? పర్యవసానంగా చోటుచేసుకునే పరిణామాలు ఎలాంటివి అనేది కథ.       

ఈ సినిమా హీరో టీమ్ కెన్యాలో చేపట్టిన ఒక ఆపరేషన్ తో మొదలవుతుంది. ఒక వైపున రన్నింగ్ లో ఉన్న ట్రైన్ .. దానితో సమానంగా ఇసుకలో పరిగెత్తే కారు .. ట్రైన్ పై ఎగిరే హెలీ కాప్టర్ తో హడావిడి మొదలవుతుంది. మనం ఓపెనింగ్ సీన్ చూస్తున్నామా .. క్లైమాక్స్ సీన్ చూస్తున్నామా అనే డౌట్ వస్తుంది. ఆ తరువాత చల్లబడిన కథ చప్పగా సాగుతూ .. నీరసంగా కదులుతూ ఉంటుంది. హీరో టీమ్ చకచకా దేశ దేశాలు తిరిగేస్తూ ఆపరేషన్లు చేస్తూ ఉంటుంది. దేనికోసమనేది మనకి క్లారిటీ కూడా ఇవ్వరు. 

సీనియర్ విజయ్ .. స్నేహ మధ్య పాటలు ఉండవనే విషయం అర్థమైపోయి, జూనియర్ విజయ్ - మీనాక్షి చౌదరి ఎంట్రీ ఎప్పుడిస్తారా అని ఆడియన్స్ ఎదురుచూస్తుంటారు. అలా ఒక గంట తరువాత ఆ జోడి తెరపైకి వస్తుంది. దాంతో ఈ ఇద్దరి మధ్య లవ్ .. రొమాన్స్ ను ఆడియన్స్ ఆశిస్తారు. కానీ మళ్లీ కొంతసేపటి వరకూ ఆమె జాడ తెలియదు. ఆమె సునీల్ (ప్రశాంత్) కూతురు అనే విషయం కూడా మనకి నిదానంగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాకి సీనియర్ విజయ్ హీరో అయితే .. జూనియర్ విజయ్ విలన్ అనే సంగతి కూడా అంతే స్లోగా అర్థమవుతుంది.

ఇది విజయ్ స్థాయికి తగిన భారీ యాక్షన్ సినిమానే. యాక్షన్ సీన్లు .. ఛేజింగులు ఒక రేంజ్ లో ఉంటాయి. అయితే వాటిని మనకి కనెక్ట్ చేసే సరైన కథ లేదు. మెట్రో రైల్లోని ఫైట్ ..  జూనియర్ విజయ్ ని చుట్టుముట్టే సీన్ కాస్త బాగానే అనిపిస్తాయి.  తండ్రి విజయ్ హెయిర్ స్టైల్ అస్సలు కుదరలేదు. ఆయన కొడుకు కాబట్టి అన్నట్టుగా కొడుకు విజయ్ హెయిర్ స్టైల్ ని మరింత చెడగొట్టారు. ఇక విజయ్ ను కుర్రాడిగా చూపించే ప్రయత్నం కూడా తేడా కొట్టేయడం ప్రేక్షకులకు ఇబ్బందిని కలిగిస్తుంది. 

ఇక చివర్లో కథ అనేక మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఆ మలుపులు ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా కాకుండా బిత్తరపోయేలా ఉంటాయి. కొడుకును విలన్ గా చూపించే విషయంలో 'జైలర్'ను .. విషయం లేని కథ విషయంలో 'భారతీయుడు 2'ను ఈ సినిమా గుర్తుకు తెస్తుంది. విజయ్ హెయిర్ స్టైల్ కంటే ఆశ్చర్యాన్ని కలిగించే మరో విషయం, ఆయన ఈ కథను ఓకే చేయడం. సిద్ధార్థ్ ఫొటోగ్రఫీ .. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం ఫరవాలేదు. వెంకట్ రాజేన్ ఎడిటింగ్ విషయానికొస్తే, నిడివిని కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదనిపిస్తుంది.   

Movie Name: The Greatest Of All Time

Release Date: 2024-09-05
Cast: Vijay, Prashanth, Prabhudeva, Ajmal, Jayaram, Mohan, Sneha, Meenakshi Choudary
Director:Venkat Prabhu
Producer: Kalpathi Aghoram
Music: Yuvan Shankar Raja
Banner: AGS Entertainments

Rating: 2.50 out of 5

Trailer

More Reviews