'భార్గవి నిలయం' (ఆహా) మూవీ రివ్యూ!

Bhargavi Nilayam

Bhargavi Nilayam Review

  • మలయాళంలో రూపొందిన 'నీలవెలిచం'
  • తెలుగు అనువాదంగా వచ్చిన 'భార్గవి నిలయం'
  • రొటీన్ కి భిన్నంగా సాగే కథాకథనాలు
  • ఫీల్ తో కూడిన సన్నివేశాలు 
  • హైలైట్ గా నిలిచే లొకేషన్స్ .. ఫొటోగ్రఫీ
              

మలయాళ సినిమాలకు .. సిరీస్ లకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై మంచి క్రేజ్ ఉంది. అందువలన ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకి సంబంధించిన తెలుగు వెర్షన్ లు ప్రేక్షకుల ముందుకు దిగిపోతున్నాయి. అలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మలయాళ సినిమానే 'నీలవెలిచం'. టోవినో థామస్ .. షైన్ టామ్ చాకో .. రోషన్ మాథ్యూ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, 2023 ఏప్రిల్లో అక్కడి థియేటర్లకు వచ్చింది. ఆ సినిమా ఇప్పుడు 'భార్గవి నిలయం' పేరుతో 'ఆహా' ద్వారా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ హారర్ థ్రిల్లర్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 1964లో జరుగుతూ ఉంటుంది. అది సముద్రతీరంలోని ఒక చిన్న గ్రామం. ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆ ఊరు కేరాఫ్ అడ్రెస్ లా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆ గ్రామానికి ఒక రచయిత వస్తాడు. ఒక పాడుబడిన బంగ్లాలో అద్దెకి దిగుతాడు. తాను ఉండటానికి వీలుగా ఆ బంగ్లాను నీట్ గా చేసుకుంటాడు. అయితే ఆ ఇంటివైపు రావడానికి పోస్ట్ మెన్ .. హోటల్ కుర్రాళ్లు భయపడటం అతను గమనిస్తాడు. ఆ ఊళ్లోనే ఉంటున్న తన స్నేహితులను కలుస్తాడు.

అతను 'భార్గవి' నిలయంలో అద్దెకు దిగాడని తెలియగానే స్నేహితులు కంగారు పడిపోతారు. గతంలో ఆ ఇంట్లో భార్గవి అనే ఒక యువతి ఉండేదనీ, ఆమెకి నాట్యంలో మంచి ప్రవేశం ఉందని చెబుతారు. ఆ పక్కనే ఉన్న ఇంట్లో శశికుమార్ (రోషన్ మాథ్యూ) అనే గాయకుడు ఉండేవాడని అంటారు. వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారనీ, అయితే శశికుమార్ మోసం చేశాడని చెబుతారు. దాంతో ఆ ఇంట్లోని బావిలో దూకేసి భార్గవి ఆత్మహత్య చేసుకుందనీ, అప్పటి నుంచి ఆమె దెయ్యమై తిరుగుతుందని అంటారు. 

అతను ఆమె ఇంట్లో ఉండటం ఎంతమాత్రం మంచిది కాదనీ, అసలు అటువైపు వెళ్లొద్దని స్నేహితులు చెబుతారు. అయినా ఆ రచయిత వినిపించుకోకుండా ఆ ఇంటికి వెళతాడు. దెయ్యం ఏదో ఒక వైపు నుంచి తనని గమనిస్తూ ఉంటుందని భావిస్తాడు. తాను ఒంటరివాడిననీ, తన దగ్గరున్న డబ్బు మొత్తం ఆ ఇంటి అద్దె కోసమే చెల్లించానని రచయిత చెబుతాడు. అందువలన తాను ఆ ఇంట్లోనే ఉండక తప్పడం లేదని అంటాడు. తన వలన ఆమెకి ఎలాంటి ఇబ్బంది కలగదని చెబుతాడు.

ఆ బంగ్లాను ఆనుకుని ఉన్న ఒక ప్రత్యేకమైన గదిలో భార్గవికి సంబంధించిన ఒక పెట్టె కనిపిస్తుంది. ఆందులో ఆమె దాచుకున్న కొన్ని వస్తువులతో పాటు ఆమె ఫొటో కూడా రచయిత చూస్తాడు. తాను ఆమెను గురించి రకరకాలుగా వింటున్నాననీ, కానీ నిజమేమిటనేది తెలుసుకుని ఆమె కథను తాను రాయాలనుకుంటున్నానని అంటాడు. అది తనకి అంగీకారమే అన్నట్టుగా దెయ్యం వైపు నుంచి కొన్ని సంకేతాలు వస్తాయి. 

అసలు భార్గవి జీవితంలో అసలు ఏం జరిగింది? ఆమె ప్రేమవ్యవహారం ఎంతవరకూ వెళ్లింది? భార్గవిని ప్రేమించిన శశికుమార్ ఏమైపోయాడు?  ఆమెది హత్యనా .. ఆత్మహత్యనా? అనే కోణంలో అతని అన్వేషణ మొదలవుతుంది. ఆ ప్రయత్నంలో అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అప్పుడు అతను ఏం చేస్తాడు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుంది.

ఈ కథ నాలుగు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మిగతా పాత్రల సంఖ్య కూడా చాలా తక్కువ. సముద్రతీరంలో ఒక పాడుబడిన బంగ్లాలోనే 90 శాతం కథ నడుస్తుంది. సాధారణంగా దెయ్యం సినిమాలు అనగానే ప్రేక్షకులను భయపెట్టే తరహాలోనే అవి కొనసాగుతూ ఉంటాయి. అయితే ఈ కథలో అందమైన ప్రేమకథ .. సున్నితమైన భావోద్వేగాలు కనిపిస్తాయి. తన ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం దెయ్యం ఉందనుకుని రచయిత దానితో మాట్లాడటం .. నిజంగానే ఆ మాటలను ఆమె వింటూ ఉండటం కొత్తగా అనిపిస్తుంది. 

ఈ కథలో కథానాయకుడు రచయిత .. భార్గవి నృత్యం తెలిసిన యువతి .. శశికుమార్ మంచి గాయకుడు. అతను సితార్ ను అద్భుతంగా ప్లే చేస్తాడు. అంటే ప్రధానమైన ఈ మూడు పాత్రలు సంగీత .. సాహిత్య .. నృత్య సంబంధమైనవిగా కనిపిస్తాయి. వాటిని కలుపుకుంటూనే ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. ఈ కథ భయపెట్టదు .. అనుభూతి ప్రపంచంలోకి లాగుతుంది. ఎమోషన్స్ తో కనెక్ట్ అవుతుంది. 

సముద్రతీరం .. ఒక చిన్న ఊరు .. పాడుబడిన బంగ్లా .. 1964లలో నడిచే కథ ను రెండు గంటలసేపు చూడగలమా అనే సందేహం కలుగుతుంది. కానీ దర్శకుడు లొకేషన్స్ ను ఎంచుకున్న విధానం .. వెన్నెల రాత్రులలో వాటిని అద్భుతంగా ఆవిష్కరించిన కెమెరా పనితనం .. ఆ ఫీల్ ను అందంగా అప్పగించే నేపథ్య సంగీతం ఎంతమాత్రం బోర్ కొట్టనివ్వదు. ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో అందించిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇది.

మలయాళంలో కవిత్వాన్ని అనుభూతితో కూడిన మాటలుగా .. పాటలుగా తెలుగులో అందించడం కొంచెం కష్టమే. ఈ అంశానికి సంబంధించిన అనువాదం మాత్రం అంత సంతృప్తికరంగా అనిపించదు. ఆ విషయాన్ని పక్కన పెడితే దృశ్యపరమైన అనుభూతి మాత్రం దక్కుతుంది. క్లైమాక్స్ కూడా పేక్షకులను ఎంతమాత్రం నిరాశపరచదు. ఇది రెగ్యులర్ దెయ్యం కథ కాదనే విషయం తెలిసి చూస్తే, కథలోని ఫీల్ కనెక్ట్ అవుతుంది. 

Movie Name: Bhargavi Nilayam

Release Date: 2024-09-05
Cast: Tovino Tomas, Rima Kallingal, Shine Tom Chocko, Roshan Mathew
Director:Ashq Abu
Producer: Rajasekhar Annabhimoju
Music: Bijibal
Banner: Bhavani Movies

Rating: 2.75 out of 5

Trailer

More Reviews