రితేశ్ దేశ్ ముఖ్ - ఫర్దీన్ ఖాన్ ప్రధానమైన పాత్రలుగా 'విస్ఫోట్' రూపొందింది. కుకీ గులాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలని చూశారుగానీ కుదరలేదు. దాంతో నేరుగా 'జియో సినిమా' నుంచి వదిలారు. ఈ నెల 6వ తేదీ నుంచి హిందీతో పాటు ఇతర భాషల్లోను ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
హాలీవుడ్ మూవీ 'రాక్, పేపర్, సిజర్స్' స్పూర్తితో రూపొందిన ఈ సినిమా, ముంబై నేపథ్యంలో జరుగుతుంది. ఆకాశ్ ( రితేశ్ దేశ్ ముఖ్) తార (ప్రియా బాపట్) భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క సంతానమే ప్యాడీ. ఆకాశ్ పైలైట్ గా పనిచేస్తూ ఉంటాడు. తన ఫ్యామిలీకి విలాసవంతమైన జీవితాన్ని అందించడానికి అతను కష్టపడుతూ ఉంటాడు. ఒక రోజున అతను జావేద్ అనే వ్యక్తితో తన భార్య చనువుగా ఉండటం చూస్తాడు. వాళ్లిద్దరూ కలిసి ఖరీదైన హోటల్ కి వెళ్లడం అతని కంటపడుతుంది. ఆ సమయంలో కొడుకు ప్యాడీ అతనితోనే ఉంటాడు.
ప్యాడీతో కలిసి ఒక రెస్టారెంట్ లో కూర్చున్న ఆకాశ్ బాగా ఆలోచన చేస్తాడు. నేరుగా హోటల్ కి వెళ్లి తన భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. ప్యాడీని ఆ రెస్టారెంట్ లో పనిచేసే లక్కీ (క్రిస్ట్లేడిసౌజా)కి అప్పగించి వెళతాడు. ఆ హోటల్ కి ఆకాశ్ వెళ్లి తారను నిలదీయడం .. తాను జావేద్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ఆమె చెప్పడం జరిగిపోతాయి. దాంతో అక్కడి నుంచి రెస్టారెంట్ వచ్చిన ఆకాశ్ కి లక్కీగానీ .. ప్యాడీ గాని కనిపించరు.
లక్కీ .. షోయబ్ (ఫర్దీన్ ఖాన్) ను లవ్ చేస్తూ ఉంటుంది. గతంలో 'తాయ్' గ్యాంగ్ తో కలిసి పనిచేసిన అతను, ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ గా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తాయ్ కి ప్రధాన అనుచరుడిగా మన్యా ఉంటాడు. ఒక రోజున అతను ఖరీదైన డ్రగ్స్ తో కూడిన జాకెట్ ను షోయబ్ దగ్గర ఉంచుతాడు. తాను దాచిన చోటున అది లేకపోవడంతో షోయబ్ కంగారు పడతాడు.
ఆ జాకెట్ కోసం 'తాయ్' రంగంలోకి దిగితే తనతో పాటు, తన తల్లి .. లక్కీ ప్రమాదంలో పడతారని షోయబ్ భావిస్తాడు. రెస్టారెంట్ కి వెళ్లి లక్కీని వెంటబెట్టుకుని బయల్దేరతాడు. అప్పుడు లక్కీ తనకి ఆకాశ్ అప్పగించిన అతని కొడుకు ప్యాడీని కూడా తనతో పాటు తీసుకుని ఇంటికి వెళుతుంది. అయితే వాళ్లకి తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా తాయ్ వచ్చేస్తుంది. ఆమెను అంతా 'యాసిడ్ తాయ్' అని పిలుస్తూ ఉంటారు. కోపం తెప్పిస్తే ఎదుటివారి ముఖంపై యాసిడ్ పోయడం ఆమెకి అలవాటు.
డ్రగ్స్ జాకెట్ కనిపించడం లేదని తెలిసి, లక్కీ ముఖం పై యాసిడ్ పోయడానికి ఆమె రెడీ అవుతుంది. లక్కీని ఏమీ చేయవద్దనీ, ప్యాడీని అడ్డుపెట్టుకుని ఆ డ్రగ్స్ ఖరీదును ఆ కుర్రాడి తండ్రి నుంచి రాబట్టుకోమని షోయబ్ చెబుతాడు. దాంతో రెండు కోట్లు తీసుకుని రమ్మనమని షోయబ్ తోనే ఆమె కాల్ చేయిస్తుంది. దాంతో సస్పెన్షన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ను ఆకాశ్ ఆశ్రయిస్తాడు. మరో పోలీస్ ఆఫీసర్ తో కలిసి ఆ డబ్బు నొక్కేయడానికి అతను ఒక స్కెచ్ గీస్తాడు.
ఇలా ఆ రెండు కోట్ల కోసం ఒక వైపున తాయ్ గ్యాంగ్ .. మరో వైపున పోలీసులు రంగంలోకి దిగుతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆకాశ్ తన కొడుకును కాపాడుకోగలుగుతాడా? లక్కీని షోయబ్ రక్షించుకోగలుగుతాడా? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
పెళ్లైన ఓ జంటకీ .. ప్రేమలో ఉన్న ఓ జంటకీ .. ఓ మాఫియా గ్యాంగ్ కి సంబంధించిన కథ ఇది. ఈ మూడు వైపుల నుంచి ఈ కథ నడుస్తూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలు తక్కువే అయినప్పటికీ, ప్రతి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. కథ మొదలైన దగ్గర నుంచి చివరి వరకూ ఇంట్రెస్టింగ్ గానే కొనసాగుతుంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. యాక్షన్ ను టచ్ చేసే ఈ కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎక్కడా బోర్ అనిపించేలా ఉండదు.
ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా ఆ పాత్రలకు న్యాయం చేశారు. శిఖర్ భట్నాగర్ ఫొటోగ్రఫీ .. అంజద్ నదీమ్ ఆమిర్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. మనీశ్ మోర్ ఎడిటింగ్ ఫరవాలేదు. చెప్పదలచుకున్న విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పిన కంటెంట్ గా 'విస్ఫోట్' కనిపిస్తుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ లో హింస - రక్తపాతం తక్కువేగానీ, అక్కడక్కడా రెండు మూడు అభ్యంతరకరమైన సన్నివేశాలైతే తగుల్తాయి.
'విస్ఫోట్' (జియో సినిమా) మూవీ రివ్యూ!
Visfot Review
- క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన 'విస్ఫోట్'
- ప్రధానమైన పాత్రల్లో రితేశ్ - ఫర్దీన్
- ఇంట్రెస్టింగ్ గా నడిచే కథాకథనాలు
- పర్ఫెక్ట్ గా అనిపించే కంటెంట్
Movie Name: Visfot
Release Date: 2024-09-06
Cast: Riteish Deshmukh , Fardeen Khan , Priya Bapat, Krystle D'Souza , Sheeba Chaddha , Seema Biswas
Director:Kookie Gulati
Producer: Sanjay Gupta
Music: Amjad Nadeem Aamir
Banner: White Feather Films
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer