'ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

The Mystery of Moksha Island

Movie Name: The Mystery of Moksha Island

Release Date: 2024-09-20
Cast: Ahutosh Rana, Bhanuchandar, Nandu, Priya Anand, Akshara Gouda, Sudha
Director:Anish Kuruvilla
Producer: Ram Achanta - Gopi Achanta
Music: Shakthikanth karthik
Banner: 14 Reels Plus
Rating: 2.00 out of 5
  • 14 రీల్స్ ప్లస్ నుంచి 'ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్'
  • 8 ఎపిసోడ్స్ గా వచ్చిన వెబ్ సిరీస్ 
  • ఎక్కువైపోయిన పాత్రలు
  • ఉత్కంఠభరితంగా లేని సన్నివేశాలు
  • ఆకట్టుకోలేకపోయిన కంటెంట్      

థ్రిల్లర్ జోనర్లో రూపొందిన వెబ్ సిరీస్ ల పట్ల ప్రేక్షకులు ఎక్కువ ఇంట్రెస్ట్ ను చూపిస్తున్నారు. దాంతో ఈ జోనర్ కి సంబంధించిన కంటెంట్ ను అందించడానికి ఓటీటీ సంస్థలు పోటీ పడుతున్నాయి. అలా 'హాట్ స్టార్' ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చిన వెబ్ సిరీస్ గా 'ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్' కనిపిస్తుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మితమైన ఈ వెబ్ సిరీస్ కి, అనీష్ కురువిల్లా దర్శకత్వం వహించాడు. 8 ఎపిసోడ్స్ తో ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

విష్వక్సేన్ (అషుతోష్ రాణా) ఒక డాక్టర్. పదేళ్లుగా ఆయన జనజీవనానికి దూరంగా 'నికోబార్' దీవులలోని 'మోక్ష ఐలాండ్'లో ఉంటాడు. అక్కడే తనకి సంబంధించిన పరిశోధనలు చేస్తూ ఉంటాడు. వయసు మీద పడిన ఆయన విమాన ప్రమాదంలో మరణించినట్టుగా మీడియాలో హడావిడి మొదలవుతుంది. ఆ సమయంలోనే వివిధ ప్రాంతాలలో ఉన్న కొంతమంది ఇంటికి ఒక లెటర్ వెళుతుంది. అది విష్వక్సేన్ పంపించిన లెటర్. 

ఈ లెటర్ ఎవరి పేరు మీదైతే తాను రాస్తున్నానో .. వాళ్లు తన సంతానం .. తన వారసులు అని ఆయన పేర్కొంటాడు. తండ్రి ప్రేమను వాళ్లకి పంచలేకపోయినందుకు ఆవేదన వ్యక్తం చేస్తాడు. తన ఆస్తిపాస్తులను వాళ్లకి పంచాలనుకుంటున్నట్టుగా చెబుతాడు. తన వారసులంతా కలుసుకుని ఒక కుటుంబంగా ఏర్పడితే తనకి అంతకి మించిన సంతోషం లేదని అంటాడు. అందువలన ఫలానా సమయానికి అంతా 'మోక్ష ఐలాండ్' కి చేరుకోవాలని చెబుతాడు. 

అలా విష్వక్సేన్ తమ తండ్రి అనీ, తాము ఆయన సంతానమని తెలుసుకున్న వాళ్లు, తమ ఫ్యామిలీతో కలిసి బయల్దేరతారు. వారసులు .. వాళ్ల కుటుంబ సభ్యులు కలిసి ఒక పాతికమంది వరకూ ఉంటారు. విష్వక్సేన్ ముందుగానే చేసిన ఏర్పాట్ల మేరకు అంతా ఆయన ఐలాండ్ కి చేరుకుంటారు. ఎవరికి వారికి అక్కడ ప్రత్యేకమైన గదులను కేటాయిస్తారు. విష్వక్సేన్ వారసులందరినీ, ఆయన మనిషి మాయ (అక్షర గౌడ) సమావేశపరుస్తుంది. తన వలన పొందవలసిన సహాయ సహకారాలను వివరిస్తుంది.

విష్వక్సేన్ ఆస్తి మొత్తం 24 వేల కోట్లు. మోక్ష ఐలాండ్ లో వారం రోజుల పాటు ఎవరైతే ఉండగలుగుతారో, వారికి మాత్రమే ఆస్తి సమానంగా పంచబడుతుంది. తాము పెట్టే పరీక్షలలో ఎవరైతే విజయం సాధిస్తారో .. వారు విష్వక్సేన్ సంస్థకి సీఈవోగా ఉంటారనే ఒక నిబంధన గురించి అంతా తెలుసుకుంటారు.పెద్ద మొత్తంలో ఆస్తి రానున్నందుకు హ్యాపీగా ఫీలవుతారు.

అయితే ఆ రోజు రాత్రి నుంచి ఆ బృందంలో నుంచి ఒక్కొక్కరూ అదృశ్యమవుతూ ఉంటారు. ఆ తరువాత ఆ చుట్టుపక్కల శవాలుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్లను ఎవరు చంపుతున్నారో .. ఎందుకు చంపుతున్నారో అర్థం కాక మిగిలిన వాళ్లంతా భయపడిపోతూ ఉంటారు. ప్రాణాలపై తీపి కారణంగా అక్కడ ఉండలేరు .. ఆస్తిలో అంత వాటాను వదులుకుని వెళ్లలేరు. అనుమానాస్పద స్థితిలో ఒక్కొక్కరూ అత్యంత దారుణంగా చంపబడుతూనే ఉంటారు.

అయితే జరుగుతున్న వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తూ వస్తున్న విక్రమ్ (నందూ) ఝాన్సీ ( ప్రియా ఆనంద్) ఇద్దరూ కూడా, రహస్యంగా తమ అన్వేషణ మొదలుపెడతారు. అప్పుడు వాళ్లకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అది తెలుసుకున్న వాళ్లు ఎలా స్పందిస్తారు? ఆ ఐలాండ్ నుంచి ఎంతమంది ప్రాణాలతో బయట పడతారు? అసలు ఆ ఐలాండ్ లో ఏం జరుగుతోంది? అనేది మిగతా కథ.                   

'ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్' అనే పేరు వినగానే, ఒక తెలుగు వెబ్ సిరీస్ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారే అనిపిస్తుంది. ఈ తరహా కాన్సెప్ట్ తో తెలుగు సిరీస్ లు రావడం చాలా తక్కువ కావడం వలన, సహజంగానే ఆసక్తిని చూపడం జరుగుతుంది. ఇక ఆర్టిస్టుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉండటం వలన, భారీ సిరీస్ అనే ప్రధానమైన లక్షణంతోనే కనిపిస్తుంది. 

అషుతోష్ రాణా .. భానుచందర్ .. సుధ వంటి సీనియర్ ఆర్టిస్టులతో పాటు, ప్రియా ఆనంద్ .. అక్షర గౌడ .. సత్యకృష్ణ .. తేజస్వి మదివాడ.. నందూ వంటి కాస్త పేరున్న ఆరిస్టులు కూడా ఉన్నారు. అందువలన కాస్త పెద్ద కథనే అనుకోవడం సహజం. కానీ అషుతోష్ రాణా .. నందూ .. ప్రియా ఆనంద్ పాత్రలకి మినహా మిగతా పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు. పాత్రలను సరిగ్గా డిజైన్ చేయలేదు .. అందువలన ఆ పాత్రలు రిజిష్టర్ కూడా కావు. చివరికి భానుచందర్ పాత్రను కూడా 'గంపులో గోవిందా' చేయగలిగారు.         

పాత్రల సంఖ్య ఎక్కువైపోయింది. దాంతో కనిపించకుండా పోయింది ఎవరో పక్కనున్న పాత్రలకి తెలియదు .. మనకి కూడా అర్థం కాదు. హత్యలు .. అనుమానాలు .. అన్వేషణలు ఎంతమాత్రం ఉత్కంఠను రేకెత్తించవు. విష్వక్సేన్ ఫ్లాష్ బ్యాక్ కూడా రొటీన్ గా ఉంటుంది. ఐలాండ్ కి సంబంధించిన విజువల్స్ కూడా ఆశించిన స్థాయిలో కనిపించవు. చాలా ఏళ్ల క్రితమే హాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్ లతో సినిమాలు వచ్చాయి. అదే కాన్సెప్ట్ ను పేలవంగా అందించిన సిరీస్ ఇది.

కథలో బలం .. కుతూహలాన్ని రేకెత్తించే కథనం ..  ప్రధానమైన పాత్రలపై కసరత్తు .. సన్నివేశాలను సరిగ్గా డిజైన్ చేసుకుని ఉంటే ఈ సిరీస్ ఇంకాస్త బెటర్ గా ఉండేదేమో. నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ, సరైన స్క్రిప్ట్ లేకపోవడమే ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. సన్నివేశాల్లో సారం లేకపోవడం వల్లనే నేపథ్య సంగీతం .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ ప్రభావితం చేయలేకపోయాయని అనిపిస్తుంది. 

Trailer

More Reviews