'దేవర' - మూవీ రివ్యూ!

Devara

Devara Review

  • 'దేవర'గా వచ్చిన ఎన్టీఆర్
  • ఆయన యాక్షన్ హైలైట్ 
  • సెకండాఫ్ లో మెరిసే జాన్వీ కపూర్ 
  • ఎక్కువైపోయిన యాక్షన్ పాళ్లు 
  • కనెక్ట్ కాని ఎమోషన్స్
  • మార్కులు కొట్టేసిన ఫొటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్   

ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' రూపొందింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జనతా గ్యారేజ్' హిట్ కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం .. జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా మారాయి. అనిరుధ్ బాణీలు కూడా జనంలోకి బాగానే పోయాయి. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

అది ఆంధ్ర - తమిళనాడు ప్రాంతం .. ఎర్ర సముద్రతీరం. అక్కడి కొండలపై చాలా కాలంగా కొంతమంది ప్రజలు నివసిస్తూ ఉంటారు. నాలుగు ఊళ్లుగా ఏర్పడిన ప్రజలు, చేపల వేటపై ఆధారపడి తమ జీవితాలను కొనసాగిస్తూ ఉంటారు. వాళ్లకి మార్గనిర్దేశం చేసే నాయకుడిగా 'దేవర' (ఎన్టీఆర్) ఉంటాడు. అయితే అతనంటే పడని భైరా (సైఫ్ అలీ ఖాన్) మరో వర్గానికి నాయకుడిగా తయారవుతూ ఉంటాడు.

ఆ నాలుగు గ్రామాల మధ్య ప్రతి ఏడాది 'ఆయుధపూజ' రోజున కుస్తీ పోటీ ఉంటుంది. ఆ పోటీలో ఒక్కో గ్రామం నుంచి ఇద్దరేసి పాల్గొంటారు. ఎవరు గెలిస్తే వారి గ్రామానికి ఆయుధాలు వెళతాయి. అలా ఆయుధాలు రావడం వలన తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందనేది వారి విశ్వాసం. అయితే చాలా ఏళ్లుగా ప్రతి ఏడాది దేవరనే గెలుస్తూ ఉండటం విశేషం. దేవరపై భైరాకి ద్వేషం పెరగడానికి ఇది కూడా ఒక కారణం. 

అలాంటి పరిస్థితుల్లోనే వాళ్ల జీవితాల్లోకి మురుగన్ (మురళీ శర్మ) అడుగుపెడతాడు. సముద్ర నౌకలలో రవాణా అవుతున్న సరుకును దొంగిలించి తమకి చేరవేయమని దేవర బృందంతో మురుగన్ డీల్ కుదుర్చుకుంటాడు. అతను ఇస్తానన్న డబ్బుకు ఆశపడి భైరాతో సహా చాలామంది యువకులు సముద్రపు దొంగలుగా మారిపోతారు. అలా కొన్నిసార్లు జరిగిన తరువాత, తాము మురుగన్ కి చేరవేస్తున్నది ఆయుధాలనీ, వాటి వలన తమ గ్రామాలకే కాకుండా సమాజానికి చాలా ప్రమాదమనే విషయం దేవరకి తెలుస్తుంది. 

అప్పటి నుంచి దేవర మారిపోతాడు. ఇకపై తాము ఆయుధాల దొంగతనం చేయవద్దనీ, చేపల వేటతో వచ్చిన దానితో సంతృప్తి పడదామని తన మనుషులతో చెబుతాడు. అయితే దేవర చెప్పినట్టు చేయడానికి భైరా .. అతని సన్నిహితులు నిరాకరిస్తారు. మురుగన్ ఇచ్చే డబ్బుకు ఆశపడి, సముద్రంపైకి వెళ్లడానికి సిద్ధపడతారు. దాంతో ప్రతిసారి దేవర వాళ్లను అడ్డుకుంటూ ఉంటాడు. ఇక తాము తమకి నచ్చినట్టుగా బ్రతకాలంటే దేవరను అడ్డు తప్పించాలని భైరా .. అతని అనుచరులు నిర్ణయించుకుంటారు.          

దేవరను చంపడానికి భైరా మనుషులు స్కెచ్ వేస్తారు. అందుకోసం అతనికి అత్యంత సన్నిహితుడైన రాయప్ప (శ్రీకాంత్)ను ఉపయోగించుకుంటారు. ఆ రోజు రాత్రి సముద్రతీరానికి వెళ్లిన దేవర, ఏమైపోయాడనేది ఎవరికీ తెలియదు. సముద్రంపై కావాలిగా ఉంటానంటూ అతను రాసిన నెత్తురు రాతలు మాత్రమే అక్కడి ప్రజలు చూస్తారు. అలా 12 ఏళ్లు గడుస్తాయి. దేవర కొడుకు వర ( ఎన్టీఆర్) ఎదుగుతాడు. అతనిని తంగం (జాన్వీ కపూర్) ప్రేమిస్తూ ఉంటుంది. 

'వర' పిరికివాడు కావడం వలన, అతని గురించి భైరా పెద్దగా పట్టించుకోడు. దేవరను సముద్రం మీద నుంచి రప్పించడం కోసం అతను ఒక పథకం వేస్తాడు. అదేమిటి? అతని ప్రయత్నం ఫలిస్తుందా? అసలు దేవర ఏమయ్యాడు? వరను ముగ్గులోకి దింపడం కోసం తంగం ఏం చేస్తుంది? అనేది మిగతా కథ.   
  
కొరటాల శివ రాసుకున్న కథ ఇది. ఫస్టాఫ్ అంతా 'దేవర' పాత్ర .. సెకండాఫ్ అంత 'వర' పాత్ర  తెరపై కనిపిస్తాయి. ఇటు గూడెం .. అటు సముద్ర తీరం .. ఈ రెండింటి మధ్య ఈ కథ నడుస్తుంది. 1996 - బొంబాయి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో, అత్యవసరంగా సమావేశమైన పోలీస్ పెద్దల సమావేశంతో కథ హడావిడిగా మొదలవుతుంది. కథ మొదలైన 20 నిమిషాలకు దేవర పాత్ర ఎంట్రీ ఇస్తుంది. నౌకలోని సరుకుని దొంగిలించే పెద్ద ఆపరేషన్ సీన్ ఇది. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ కి సంబంధించిన ఈ సీన్ చప్పగా ముగియడంతో ప్రేక్షకులు డీలాపడతారు. 

ఆయుధపూజ సెంటిమెంట్ .. సముద్రంపై దొంగతనాలు .. ఊళ్లో భైరా అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. సముద్రంపై కాపలాగా ఉన్న దేవర, తనవాళ్లు ఆయుధాల కోసం రాకుండా అడ్డుకుంటూ ఉంటాడు. ఇక్కడే ఒక సందేహం వెంటాడుతూ ఉంటుంది. దేవర కనిపించకుండా పోయి ఏళ్లు గడుస్తూ ఉంటాయి. అయినా అతను సముద్రంపై ఉన్నాడని అందరూ నమ్ముతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను సముద్రంపై అంతకాలం పాటు ఎక్కడ దాక్కుంటాడు? అదెలా సాధ్యం? అనేది ఆలోచన చేయరు.  

దేవరను సముద్రంపై నుంచి రప్పించడానికి భైరా 12 ఏళ్లు ఓపిక పట్టడం చిత్రంగా అనిపిస్తుంది. ఇక అతని కొడుకు అమాయకంగా కనిపిస్తే భైరా నమ్మేయడం మరో విచిత్రం. అందరూ జాన్వీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందా అని ఎదురుచూస్తే, ఆమె సెకండాఫ్ లో ఇలా వచ్చి .. కాసేపు కనిపించి పోవడం ఆశ్చర్యం. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ .. షైన్ టామ్ చాకో పాత్రలకి ప్రాధాన్యత లేదు. మురళీశర్మ పాత్రలోను విషయం లేదు. యాక్షన్ సన్నివేశాలలో భారీతనం ఉంది .. కానీ వాటిని డిఫరెంట్ గా కంపోజ్ చేయలేకపోయారు. 

నిర్మాణ విలువలు బాగున్నాయి. రత్నవేలు ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలమనే చెప్పాలి. సముద్రం నేపథ్యంలోని సన్నివేశాలు .. నైట్ ఎఫెక్ట్ కి సంబంధించిన సీన్స్ ను .. ఉన్న ఒక్క డ్యూయెట్ ను అందంగా చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం ఓకే. పాటల్లో 'చుట్టమల్లే .. 'బాణీ బాగుంది. మిగతా పాటలు బీట్ పరంగా బాగున్నాయిగానీ, సాహిత్యం అర్థం కాకుండా సంగీతం డామినేట్ చేసింది. నిజానికి కొరటాల మంచి రైటర్ .. కానీ ఈ సినిమాలో గుర్తుండిపోయే డైలాగ్స్ ఒకటి రెండు మాత్రమే వినిపిస్తాయి. ఎక్కువైపోయిన యాక్షన్ సీన్స్ .. కనెక్ట్ కాని ఎమోషన్స్ మిగతా ఆడియన్స్ కి కాస్త అసంతృప్తిని కలిగించినా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్: ఎన్టీఆర్ యాక్షన్ .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం 

మైనస్ పాయింట్స్ : ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం, ముఖ్యమైన పాత్రలలో విషయం లేకపోవడం, కథ మొదలవుతూనే ఎక్కువ పాత్రల పేర్లు చెబుతూ కన్ఫ్యూజ్ చేయడం .. లాజిక్ లేకపోవడం .. యాక్షన్ సీన్స్ లో మేజిక్  కనిపించకపోవడం .. జాన్వీ తెరపై మెరిసింది కాసేపే కావడం. 

Movie Name: Devara

Release Date: 2024-09-27
Cast: Ntr, Janhvi Kapoor, Saif Ali Khan, Prakash Raj, Srikanth, Shine Tom Chacko
Director:Koratala Shiva
Producer: Sudhakar Mikkilineni - Nandamuri Kalyan Ram
Music: Anirudh
Banner: Yuvasudha Arts - NTR Arts

Rating: 2.75 out of 5

Trailer

More Reviews