'భలే ఉన్నాడే' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

Bhale Unnade

Bhale Unnade Review

  • సెప్టెంబర్ 13న విడుదలైన 'భలే ఉన్నాడే'
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
  • కథతో సంబంధం లేని టైటల్  
  • ఆసక్తికరంగా లేని కథనం 
  • వినోదానికి దూరంగా నడిచే కంటెంట్       

   

రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన సినిమానే 'భలే ఉన్నాడే'. ఈ సినిమాతోనే మనీషా కందుకూరు కథానాయికగా టాలీవుడ్ కి పరిచయమైంది. కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకి శివసాయి వర్ధన్ దర్శకత్వం వహించాడు. శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, సెప్టెంబర్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

ఈ కథ 'విశాఖ'లో జరుగుతుంది. రాధ (రాజ్ తరుణ్) శారీ డ్రాపర్ గా పనిచేస్తూ ఉంటాడు. శుభకార్యాలకు చీరలు కట్టించడంలో మంచి నైపుణ్యం ఉన్నవాడిగా పేరు తెచ్చుకుంటాడు. అతని తల్లి గౌరీ (అభిరామి) ఒక బ్యాంకులో పనిచేస్తూ ఉంటుంది. ఆ బ్యాంకులో కృష్ణ (మనీషా) కొత్తగా చేరుతుంది. గౌరీతో ఆమెకి మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. గౌరీ క్యారియర్ ను షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన కొడుకు బాగా వంట చేస్తాడని అంటూ, ప్రతి రోజూ ఆమెకి గౌరీ బాక్స్ తీసుకుని వెళుతూ ఉంటుంది. 

రాధ చేసిన వంటల రుచి చూసిన తరువాత, అతని పట్ల తనకి గల  ఇష్టాన్ని కృష్ణ స్లిప్ లపై రాసి ఆ బాక్సులో పెడుతూ ఉంటుంది. దాంతో అతను మరింత స్పెషల్  ఐటమ్స్ చేసి తల్లితో పంపిస్తూ ఉంటాడు. ఈ లోగా ఒక ఫ్రెండ్ ఫంక్షన్ కి సంబంధించి, కృష్ణ ఒక రెస్టారెంట్ లో రాధను కలుస్తుంది. చిన్నపాటి గొడవతోనే ఇద్దరి పరిచయం మొదలవుతుంది. ఆ తరువాత అతను గౌరీ కొడుకేనని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది.      
       
రాధపట్ల తనకి గల ప్రేమను అనేక రకాలుగా కృష్ణ వ్యక్తం చేస్తూ ఉంటుంది. అయితే రాధ అవేమీ పెద్దగా పట్టించుకోడు. రొమాంటిక్ గా అతను ఎంతమాత్రం స్పందించడు .. ఆమె అందాలను ఆరబోసినా చలించాడు. ఇదే విషయాన్ని తన స్నేహితురాలి దగ్గర కృష్ణ ప్రస్తావిస్తుంది. అతని దగ్గర విషయం లేకపోవడం అందుకు కారణం కావొచ్చని ఆ స్నేహతురాలు చెబుతుంది. ఈ విషయంలో తనకి ఎదురైన అనుభవాన్ని ఉదాహరణగా వివరిస్తుంది.  

దాంతో రాధపై కృష్ణకి ఆ వైపు నుంచి సందేహం తలెత్తుతుంది. రాధకి వేరే కారణం చెప్పి, అతణ్ణి వెంటబెట్టుకుని ప్రకృతి వైద్యాన్ని అందించే ఆశ్రమానికి తీసుకుని వెళుతుంది. అక్కడ అనుకోకుండా జరిగిన ఒక సంఘటన కారణంగా అంతా రచ్చ అవుతుంది. కృష్ణను ఆమె తండ్రి మందలించి తీసుకుని వెళ్లిపోతాడు. రాధకి విషయం లేకపోవడం వలన, అతనితో కృష్ణ పెళ్లి జరిగే అవకాశం లేదనే టాక్ గుప్పుమంటుంది.   

ఈ విషయం రాధ తల్లి గౌరిని చాలా బాధపెడుతుంది. అతణ్ణి కృష్ణ అర్థం చేసుకోలేకపోయినందుకు ఆవేదన చెందుతుంది. రాధ అమ్మాయిల విషయంలో ఆసక్తిని చూపించకపోవడం .. ప్రేమించిన అమ్మాయి విషయంలోను చొరవ చూపక పోవడం .. జరిగిన అనర్థానికి కారణమని అతని సన్నిహితులు అంటారు. అతనలా ఉండటానికి కారణం అందరూ అనుకునేదేనా? అని అడుగుతారు. అప్పుడు రాధ ఏం చెబుతాడు? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ. 

 ఈ కథలో హీరో ఓ శారీ డ్రాపర్. ఆడవాళ్లను ఎంతమాత్రం టచ్ చేయడకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఇతని పట్ల ఆకర్షితులైనవారిని కూడా దూరం పెడుతూ ఉంటాడు. ప్రేమించిన యువతి పట్ల కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడు. దాంతో అందిరికీ అతనిపై ఓ రకమైన డౌట్ వస్తుంది. ఈ డౌట్ ను క్లియర్ చేసుకునే పనిలోనే హీరోయిన్ కూడా ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. 

రాధపై హీరోయిన్ కి సందేహం ఉంటుంది. అతని చుట్టుపక్కల వారి కామెంట్లు అలాగే ఉంటాయి. అతని ధోరణి కూడా అలాగే ఉంటుంది. దాంతో ఆడియన్స్ లోను అనుమానం బలపడుతూ ఉంటుంది. రాధ విషయం లేనివాడు అనే ఒక ముద్రతోనే కథ నడుస్తూ ఉంటుంది. హీరో పాత్రను ఇలా డిజైన్ చేయడం వలన, ఆ వైపు నుంచి లవ్ .. రొమాన్స్ కి ఛాన్స్ లేకుండా పోయింది. ప్రేక్షకులకు ఎంజాయ్ చేసే ఛాన్స్ లేకుండా పోయింది.

ఎక్కడి నుంచి అయితే ఎంటర్టైన్ మెంట్ పుడుతుందో .. ఆ దార్లను .. డోర్లను దర్శకుడు లాక్ చేశాడు. పోనీ అలా చేసి కొత్త కథేమైనా చెప్పారా అంటే, అదీ పాత పాటనే. సినిమాల్లో కొన్ని నిజాలను ఏళ్ల తరబడి దాస్తారు . ఎందుకనేది ఎవరికీ తెలియని ప్రశ్న. అదే పద్ధతి ఇక్కడ కూడా కనిపిస్తుంది. హీరో .. అతని తల్లి .. హీరోయిన్ పాత్రలకి తప్ప, వేరే పాత్రలకి ఎలాంటి ప్రాముఖ్యత కనిపించదు. హైపర్ ఆది కామెడీ కూడా అంతంత మాత్రమే. 

ఆర్టిస్టులంతా బాగానే చేశారు. నగేశ్ బనేల్ ఫొటోగ్రఫీ .. శేఖర్ చంద్ర సంగీతం ఫరవాలేదు. శ్రీకాంత్ పట్నాయక్ ఎడిటింగ్ ఓకే. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ .. హీరో పాత్రను డిజైన్ చేసిన తీరు వలన, ఈ కథ వినోదానికి దూరంగా .. నిదానంగా .. నీరసంగా సాగుతుంది. ఎంతగా ఆలోచించినా అర్థం కాని ఒక విషయం మాత్రం ఉంది. ఈ టైటిల్ కీ .. ఈ కథకి ఉన్న సంబంధం ఏమిటా అని!  

Movie Name: Bhale Unnade

Release Date: 2024-10-03
Cast: Raj Tarun, Manisha, Abhirami, Goparaju Ramana, Vtv Ganesh, Hyper Adi
Director:Shivasai Vardhan
Producer: Venkat Kiran Kumar
Music: Shekhar Chandra
Banner: Ravi Kiran Arts

Rating: 2.25 out of 5

Trailer

More Reviews