తమిళంలో ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న బడ్జెట్ సినిమాలలలో 'పోగుమ్ ఇదమ్ వేగు తూరమిల్లై' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!వేగ తోరమిల్లై' ఒకటి. విమల్ - కరుణాస్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. మైఖేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజునే అమెజాన్ ప్రైమ్ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కుమార్ (విమల్) మార్చురీ వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య మేరీకి డెలివరీ డేట్ దగ్గర పడుతుంది. ఆర్ధికంగా ఇబ్బంది ఉండటం వలన, ఆ పరిస్థితుల్లో కూడా నారాయణ పెరుమాళ్ డెడ్ బాడీని తీసుకుని చిత్తూరులో అప్పగించడానికి కుమార్ అంగీకరిస్తాడు. నారాయణ పెరుమాళ్ పెద్ద భార్య కొడుకు నరసింహనాయుడు (ఆడుకాలం నరేన్). ఇక మునుసామి నాయుడు (పవన్) తాను కూడా నారాయణ పెరుమాళ్ వారసుడినని చెప్పుకుని తిరుగుతూ ఉంటాడు.
తన తల్లికి నారాయణ పెరుమాళ్ తాళి కట్టలేదనే ఒక అసంతృప్తి మునుసామి నాయుడిలో ఉంటుంది. అందువలన ఆయన అంత్యక్రియలు తాను నిర్వహించి, తాను ఆయన సంతానమేననే విషయాన్ని నిరూపించడం కోసం ట్రై చేస్తూ ఉంటాడు. తాను ఉండగా మునుసామి ఎలా తండ్రికి తలకొరివి పెడతాడనే కోపంతో నరసింహనాయుడు ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే నారాయణ పెరుమాళ్ డెడ్ బాడీని తీసుకుని కుమార్ వ్యానులో బయల్దేరతాడు.
ఈ దారి మధ్యలోని ఒక ఊర్లో శేఖర్ అనే శ్రీమంతుడు ఉంటాడు. అతని ఒక్కగానొక్క కూతురు 'పవి' ఓ కుర్రాడితో ఊరొదిలిపోతుంది. శేఖర్ చేతిలో కొంతమంది రౌడీలు ఉంటారు. వాళ్లంతా 'పవి' కోసం గాలిస్తూ ఉంటారు. కుమార్ కొంతదూరం వచ్చిన తరువాత, మూర్తి ( కరుణాస్) లిఫ్ట్ అడుగుతాడు. తాను కూడా చిత్తూరు వరకూ వెళ్లాలని రిక్వెస్ట్ చేస్తాడు. తనకి వెనకా ముందూ ఎవరూ లేరనీ, నాటకాలు ఆడుతూ ఉండేవాడినని మూర్తి చెబుతాడు.
వ్యాను కొంత దూరం వెళ్లిన తరువాత ఇద్దరు ప్రేమికులు లిఫ్ట్ అడుగుతారు. మూర్తి మాటలు కాదనలేక వాళ్లకి కుమార్ లిఫ్ట్ ఇస్తాడు. అలా కొంతదూరం వెళ్లిన తరువాత, శేఖర్ అనుచరులు కుమార్ వ్యాన్ ను తరమడం మొదలుపెడతారు. ఆ సమయంలో తనకి సంబంధం లేదన్నట్టుగా ఉంటే ఆ రౌడీలు ఆ జంటను చంపుతారని భావించిన కుమార్, ఒక్కసారిగా రంగంలోకి దిగుతాడు. ఆ జంటను ప్రాణాలకు తెగించి కాపాడతాడు.
ఆ తరువాత అక్కడి నుంచి బయల్దేరుదామని చూస్తే, ఆ వ్యానులో నుంచి నారాయణ పెరుమాళ్లు డెడ్ బాడీ మాయమవుతుంది. నారాయణ పెరుమాళ్ డబ్బు - పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆయన శవం కనిపించడం లేదంటే, ఆయన వారసులు తనని చంపేస్తారని కుమార్ భావిస్తాడు. శవాన్ని ఎవరు తీసుకుని వెళ్లి ఉంటారు? అది తెలిసిన కుమార్ ఏం చేస్తాడు? నారాయణ పెరుమాళ్ వారసులలో ఎవరు శాంతిస్తారు? అనేది మిగతా కథ.
డబ్బు అవసరమున్న ఓ మార్చురీ వ్యాన్ డ్రైవర్ .. తండ్రికి తలకొరివి పెట్టడానికి అధికారికంగా .. అనధికారికంగా కలిగిన ఇద్దరు కొడుకుల మధ్య పోటీ .. ఇతరులకు ఉపయోగపడటమే ఈ జీవితంలోని పరమార్థం అని గ్రహించిన ఒక స్టేజ్ ఆర్టిస్ట్. ఈ నాలుగు ప్రధానమైన పాత్రల మధ్య ఈ కథ నడుస్తూ ఉంటుంది. మిగతా పాత్రలు సందర్భానుసారంగా వచ్చి వెళుతూ ఉంటాయి. కథ అంతా మార్చురీ వ్యాన్ పట్టుకుని పరిగెడుతూ ఉంటుంది.
దర్శకుడు ఈ కథ వేగాన్ని నిదానంగా పెంచుతూ వెళ్లాడు. లవర్స్ కి లిఫ్ట్ ఇచ్చిన దగ్గర నుంచి కథ పుంజుకుంటుంది. వ్యాన్ లో నుంచి శవం మాయమైన దగ్గర నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది. చివరికి ఏం జరుగుతుందా? అనే ఒక ఉత్కంఠ పెరుగుతూ పోతుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ కథా బలాన్ని మరింత పెంచుతూ కన్నీళ్లు పెట్టిస్తాయి. "నీ కోసం నువ్వు మంచి మార్గంలో ప్రయాణిస్తే మనిషివవుతావు. ఇతురులకు సాయం చేసినప్పుడే దేవుడివవుతావు"అనే సందేశం అంతర్లీనంగా ఉన్న కథ ఇది.
తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో బలమైన కథను ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో, ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. డెమెల్ సేవియర్ ఫొటోగ్రఫీ .. రఘునందన్ నేపథ్య సంగీతం .. త్యాగరాజన్ ఎడిటింగ్ ఈ కథకి హెల్ప్ అయ్యాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా, ఈ కథకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చారు. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ అనేవి అప్పటివరకూ సాగుతూ వచ్చిన కథ వెయిట్ ను అమాంతంగా పెంచేశాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమాల జాబితాలో దీనిని కూడా చేర్చుకోవచ్చు.
'పోగుమ్ ఇదమ్ వేగు తూరమిల్లై ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Pogum Idam Vegu Thooramillai Review
- ఫ్యామిలీ డ్రామా జోనర్లో వచ్చిన సినిమా
- ఎమోషన్స్ ప్రధానంగా సాగే కథ
- ట్విస్టులతో పరిగెత్తే కథనం
- ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ హైలైట్
- ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్
Movie Name: Pogum Idam Vegu Thooramillai
Release Date: 2024-10-08
Cast: Vimal, Karunas , Mery Rickets, Aadukalam Naren, Pawan
Director:Micheal K Raja
Producer: Siva Kilari
Music: N R Raghunanthan
Banner: Shark 9 Pictures
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer