తెలుగు ప్రేక్షకుల ముందుకు 'ఆహా' ఓటీటీ ద్వారా మరో మలయాళ సినిమా వచ్చింది. అసిఫ్ అలీ - అమలా పాల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది జూలై 26వ తేదీన థియేటర్లకు వచ్చింది. అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 13వ తేదీ నుంచి 'ఆహా'లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
రఘు (అసిఫ్ అలీ) ఒక ఎడారి ప్రాంతంలో రైల్వే గేట్ కీపర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ ఎడారి ప్రదేశంలో చెక్కతో కట్టిన చిన్న ఇల్లు .. ఆ ఇంట్లో అతని ఒక్కడికే సంబంధించిన వస్తువులు ఉంటాయి. దూరంగా ఓ బావి .. ఆ బావిలోని నీరే అతనికి ఆధారం. అతను ఏ వస్తువులు తెచ్చుకోవాలన్నా అక్కడికి 80 మైళ్ల దూరం వెళ్లవలసి ఉంటుంది. మాట్లాడే తోడు లేకపోయినా అతను అక్కడ తన విధులు నిర్వహిస్తూ ఉంటాడు.
ఒక రోజున రైల్ వెళ్లిన తరువాత .. దూరంగా బోగీలో నుంచి ఎవరో దూకేసినట్టుగా అనిపించడంతో అక్కడికి వెళతాడు. అక్కడ పడిపోయిన ఒక యువతిని తన ఇంటికి తీసుకుని వస్తాడు. గాయపడిన ఆమెకి సేవలు చేస్తాడు. ఆమె కాస్త కోలుకున్న తరువాత తన గురించి చెబుతాడు. ఆమెను గురించి అడుగుతాడు. తన పేరు 'చైతాలి' అనీ .. తాను మానసిక వైద్యానికి సంబంధించిన డాక్టర్ ననీ, 'జింజో' అనే ఒక పేషంట్ తన దగ్గరికి వచ్చాడని ఆమె చెబుతుంది. భార్య ఆత్మహత్య చేసుకోవడం వలన, 'జింజో' మానసిక పరిస్థితి దెబ్బతిందని అంటుంది.
'జింజో' సాధారణ స్థితికి వచ్చిన తరువాత తాము ప్రేమలో పడ్డామనీ, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నామని అంటుంది. అయితే అతని నిజస్వరూపం ఆ తరువాత బయటపడిందనీ, అప్పటి నుంచి భయం గుప్పెట్లో బ్రతుకుతూ వస్తున్నానని చెబుతుంది. అతనితో ఉంటే ఏదో ఒక రోజున తనని చంపేస్తాడనీ, అందువలన అతని బారి నుంచి తప్పించుకోవడం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నానని అంటుంది. అలాంటి సమయం రావడం వల్లనే ట్రైన్లో నుంచి దూకేశానని చెబుతుంది.
తనని ఒక ఇంటివాడిగా చూడాలని తన తల్లి ఎంతగానో ఆరాటపడిందనీ, తనకి పెళ్లి చేయాలనే కోరిక తీరకుండానే ఆమె చనిపోయిందని రఘు అంటాడు. అప్పటి నుంచి ఒంటరిగా బ్రతకడం అలవాటైపోయిందని చెబుతాడు. దేవుడే తమని ఒక చోటుకు చేర్చాడనీ, అభ్యంతరం లేకపోతే తన దగ్గర హాయిగా ఉండొచ్చని అంటాడు. ఆమె కోసం ఎవరూ రారనీ, వస్తే తిరిగి వెళ్లరని ధైర్యం చెబుతాడు. అతని ధోరణిని చూస్తూ వచ్చిన ఆమెకి ఆ మాటలు మరింత సంతోషాన్ని ఇస్తాయి.
ఒక రోజున రఘుకి సంబంధించిన పాత పెట్టె ఒకటి ఆమె కంట పడుతుంది. ఆ పెట్టె తెరిచిచూసిన ఆమె షాక్ అవుతుంది. రఘు అనే వ్యక్తి చనిపోయాడనీ, అతని యూనిఫామ్ వేసుకుని అతని పేరుతో ఇతను డ్యూటీ చేస్తున్నాడనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అంతేకాదు .. అతను చాలా దారుణంగా నాలుగు హత్యలు చేశాడని తెలుసుకుని భయంతో వణికి పోతుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.
ఈ కథ .. మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. వాటిలో రెండు పాత్రలు మాత్రమే తెరపై ఎక్కువసేపు కనిపిస్తాయి. మరో మూడు పాత్రలు ఇలా వచ్చి అలా మాయమవుతాయి. ఎడారి భూమి .. చిన్న ఇల్లు .. రెండు పాత్రలు .. కథ ఏముంటుంది? బోర్ కొడుతుందేమో .. అనుకోవడం సహజం. ఒక అరగంటవరకూ ప్రేక్షకుడు అదే భావనతో ఉంటాడు కూడా. ఆ తరువాత నుంచి అసలు కథ మొదలవుతుంది.
అదే ఏడారి .. అదే ఇల్లు .. అవే రెండు పాత్రలు .. కానీ ట్విస్టులపై ట్విస్టులు పలకరిస్తూ వెళుతుంటాయి. నెక్స్ట్ ఏం జరగనుందా అనే ఒక ఉత్కంఠ ప్రేక్షకులలో చోటుచేసుకుంటుంది. చివరి వరకూ ఈ ట్విస్టులు ఆగవు. ఫైనల్ ట్విస్ట్ వీటన్నిటికీ మించి ఉంటుంది. ఇంత చిన్న సినిమాలో .. ఇంత చిన్న కథలో .. ఇంత తక్కువ బడ్జెట్ సినిమాలో ఇన్ని ట్విస్టులా? అని ఆశ్చర్యపోని ప్రేక్షకులు ఉండరనే చెప్పాలి.
దర్శకుడు ఈ కథను పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నాడు. పూర్తి అవగాహనతో పాత్రల స్వరూప స్వభావాలను తీర్చిదిద్దాడు. ఒక గొప్ప స్క్రీన్ ప్లే కథను ఖర్చు లేకుండా ఎలా నడిపించగలదు అనే విషయాన్ని ఈ సినిమా నిరూపిస్తుంది. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు .. కామెడీ మొదలైన హంగులు జోడించకుండానే ప్రేక్షకులను ఎలా కూర్చోబెట్టవచ్చో తెలియజెప్పిన కంటెంట్ ఇది. ఒక మంచి సినిమాను చూశామనే అనుభూతిని మిగుల్చుతుంది.
అప్పు ప్రభాకర్ ఫొటోగ్రఫీ .. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం .. దీపు జోసెఫ్ ఎడిటింగ్ ఈ కథకు మరింత బలాన్ని తెచ్చిపెట్టాయి. దాదాపు ఒకే లొకేషన్ లో .. ఒకే సెట్లో .. రెండు మూడు పాత్రలతో ఇంత ఇంట్రెస్టింగ్ కథను చెప్పిన సినిమా ఈ మధ్య కాలంలో ఇదేనేమో అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశం .. ఒకటి రెండు చోట్ల హింస .. రక్తపాతంతో కూడిన దృశ్యాల కారణంగా ఇది పిల్లలతో కలిసి చూసే సినిమా కాదు.
'లెవెల్ క్రాస్' (ఆహా) మూవీ రివ్యూ!
Level Cross Review
- మలయాళ సినిమాగా 'లెవెల్ క్రాస్'
- సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కంటెంట్
- ప్రధాన పాత్రల్లో అసిఫ్ అలీ - అమలా పాల్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- అడుగడుగునా ఆకట్టుకునే ట్విస్టులు
Movie Name: Level Cross
Release Date: 2024-10-13
Cast: Asif Ali, Amala Paul, Sharaf U Dheen, Lal Jose
Director:Arfaz Ayub
Producer: Ramesh P Pillai
Music: Vishal Chandrashekhar
Banner: Abhishek Films
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer