సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో 'C.D' సినిమా రూపొందింది. అదా శర్మ - విశ్వంత్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, కృష్ణ అన్నం దర్శకత్వం వహించాడు. గిరిధర్ నిర్మించిన ఈ సినిమా, మే 24వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
సిటీలో వరుసగా టీనేజ్ అమ్మాయిల కిడ్నాప్ లు జరుగుతుంటాయి. ఈ కిడ్నాప్ లు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అనే ఈ కేసును ఛేదించడానికి పోలీస్ ఆఫీసర్ ప్రకాశ్ (భరణి శంకర్) రంగంలోకి దిగుతాడు. టీనేజ్ అమ్మాయిలను టార్గెట్ చేయడం .. రెడ్ కలర్ తో 'ఐ విల్ కిల్ యూ' అని కిడ్నాపర్ రాయడం చేస్తుంటాడు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు ఆలోచనలో పడతారు.
అదే సిటీలో సిద్ధూ (విశ్వంత్) తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. శ్రీమంతుల కుటుంబంలో జన్మించిన సిద్ధూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. తల్లిదండ్రులు ఓ ఫంక్షన్ కి వెళ్లడంతో ఇంట్లో అతను ఒంటరిగా ఉంటాడు. అందువలన 'డెవిల్' అనే ఒక సినిమా సీడీ తెచ్చుకుని చూస్తాడు. ఆ సినిమా చూస్తూ అతను చాలా భయపడతాడు. అప్పటి నుంచి ఆ ఇంట్లో తాను కాకుండా మరెవరో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది.
ఆ సీడీ తన దగ్గర ఉన్నంతవరకూ అలాగే అనిపిస్తూ ఉంటుందని భావిస్తాడు. వెంటనే వెళ్లి దానిని షాపులో ఇచ్చేస్తాడు. అయితే ఇంటికి వచ్చినప్పటికీ, అతనికి చిత్రమైన అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. దెయ్యాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించడం ఎలా అనే ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఆ పుస్తకంలో ఉన్నట్టుగా ప్రయోగాలు చేసిన అతను, ఆ ఇంట్లో దెయ్యం ఉందనే నిర్ధారణకు వస్తాడు.
అదే సమయంలో సిద్ధూ బయట జరుగుతున్న కిడ్నాపుల గురించిన న్యూస్ వింటాడు. ఇంతలో ఎదురింటి అంకుల్ - ఆంటీ ఇంటికి వచ్చిన ఓ యువతి రక్ష (అదా శర్మ) సిద్ధూ ఇంటి తలుపు తడుతుంది. వాళ్లు వచ్చే వరకూ తమ ఇంట్లో ఉండొచ్చునని అతను అంటాడు. ఆ తరువాత నుంచి ఆమె ధోరణి అతనికి భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. దెయ్యమే ఆమె రూపంలో వచ్చిందని టెన్షన్ పడుతుంటాడు. అదే సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.
ఈ కథ ప్రధానంగా ఒకే ఇంట్లో .. రెండు పాత్రల మధ్య నడుస్తూ ఉంటుంది. మరో మూడు నాలుగు పాత్రలు ఇలా వచ్చి అలా మాయమవుతూ ఉంటాయి. ఇల్లు దాటుకుని ఈ కథ బయటికి వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ. ఒక వైపున సిటీలో కిడ్నాప్ లు జరుగుతూ ఉంటే, పోలీసులు ఆ సైకోను పట్టుకోవడానికి తాపీగా ఆధారాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. మరో వైపున తన ఇంట్లో దెయ్యం ఉందని చెప్పేసి సిద్ధూ నానా హడావిడి చేస్తూ ఉంటాడు.
ఇక్కడ దెయ్యం కథ ఏమిటి? అక్కడి సైకో ఎవరు? అనే ఉత్కంఠ ఆడియన్స్ లో ఎంతమాత్రం కలగదు. అందుకు కారణం ఆ స్థాయిలో కంటెంట్ లేకపోవడమే. ఈ కథను కాసేపు ఫాలో కాగానే, రెండు గంటల పాటు ఒకే ఇంట్లో కాలక్షేపం చేయించడానికి అల్లుకున్నదనే విషయం అర్థమైపోతుంది. అందువలన ప్రేక్షకులు, తెరపై పోలీసుల కంటే కూడా తాపీగా ఉంటారు.
చివరి 15 నిమిషాల దగ్గరికి చేరుకున్నప్పుడు, ఇక్కడ ఏదో కథలాంటిది ఉందే అనిపిస్తుంది. అప్పటివరకూ వేచి ఉండటమంటే కొంచెం కష్టమైన విశేషమే. నేపథ్య సంగీతాన్ని అందించిన ధృవన్ ను కొంతవరకూ మెచ్చుకోవలసిందే. సన్నివేశాల్లలో ఏ మాత్రం బలం లేకపోయినా, ఆయన తనవంతు కృషి చేశాడు. సతీశ్ ముత్యాల ఫొటోగ్రఫీ .. సత్య ఎడిటింగ్ ఫరవాలేదు.
తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో .. మేజర్ పార్టు షూటింగు ఒకే లొకేషన్ లో జరుపుకున్న సినిమాలు చాలానే కనిపిస్తాయి. అయితే కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మిగతా విషయాలను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. అసలు విషయాన్ని చివర్లో చెప్పినా, అప్పటి వరకూ అనవసరంగా టైమ్ వెస్ట్ చేశామేనని అనుకోరు. చివర్లో వచ్చే ట్విస్టులో కూడా పస లేకపోతే నిరాశకి లోనవుతారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు.
'C D' (క్రిమినల్ or డెవిల్) ఆహా మూవీ రివ్యూ!
C D Review
- మే 24న థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
- సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కంటెంట్
- బలహీనమైన కథాకథనాలు
- సిల్లీగా అనిపించే సన్నివేశాలు
Movie Name: C D
Release Date: 2024-10-26
Cast: Adah Sharma, Viswant Duddumpudi, Bharani Shankar, Rohini
Director:Krishna Annam
Producer: Giridhar
Music: RR Dhruvan
Banner: SSCN Productions
Review By: Peddinti
Rating: 2.00 out of 5
Trailer