'ఆపరేషన్ రావణ్' (ఆహా) మూవీ రివ్యూ!

Operation Raavan

Operation Raavan Review

  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే సినిమా  
  • ఆకట్టుకోని కథ - స్క్రీన్ ప్లే
  • బలహీనమైన సన్నివేశాలు
  • మెప్పించలేకపోయిన కంటెంట్ 
  • సాదాసీదాగా అనిపించే సిల్లీ డ్రామా

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో కొంతకాలం క్రితం థియేటర్లకు వచ్చిన సినిమా 'ఆపరేషన్ రావణ్'. రక్షిత్ .. సంగీర్తన .. రాధిక .. చరణ్ రాజ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 
 
కథ : రామ్ (రక్షిత్) ఓ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ ఆమని(సంగీర్తన)కి అసిస్టెంట్ గా చేరతాడు. ఆమని ఒక రాజకీయ నాయకుడికి సంబంధించిన 100 కోట్ల స్కామ్ పై స్టింగ్ ఆపరేషన్ చేస్తుంది. అయితే ఆమని ఆ వివరాలు బయటపెట్టకుండా డిపార్టుమెంటు పెద్దలు బ్రేకులు వేస్తారు. కొత్తగా వచ్చిన రామ్ ను ఆమెకి అసిస్టెంట్ గా వేస్తారు. ఆమె చేసే పనులను ముందుగా తమకి చెప్పమని అంటారు. అందుకు రామ్ అంగీకరిస్తాడు.

ఆమని అంకితభావం .. ధైర్యం రామ్ కి ఎంతో నచ్చుతాయి. దాంతో అతను ఆమెను ఆరాధించడం మొదలుపెడతాడు. ఆమని వలన రాజకీయనాయకుడు బండారం బయటపడుతుందని భయపడిన ఆమె బాస్ లు, ఆమెకు వేరే ప్రాజెక్టును అప్పగిస్తారు. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న యువతులను ఒక సీరియల్ కిల్లర్ హత్య చేస్తూ ఉంటాడు. ఆ యువతుల రెండు చేతులు నరికేయడం .. వాళ్ల శవాల దగ్గర 'చదరంగం' పావులు పడేసి వెళుతూ ఉంటాడు.

హంతకుడు ఎవరనేది కనిపెట్టడం కోసం రామ్ సాయం తీసుకుంటుంది వెన్నెల. హత్యకి గురైన యువతుల కుటుంబ సభ్యులను కలిసి ఆరా తీయడం మొదలుపెడుతుంది. తన కూతురు అదృశ్యమైపోయిందనీ .. ఆమె ఆచూకీ తెలుసుకోమని ఆమనిని జీవిత (రాధిక) కోరుతుంది. తనవంతు ప్రయత్నం చేస్తానని ఆమని భరోసా ఇస్తుంది. అయితే ఆ వెంటనే ఆమనిని మాస్క్ ధరించిన కిల్లర్ కిడ్నాప్ చేస్తాడు.

అదే సమయంలో పోలీస్ ఆఫీసర్ సుగ్రీవను ఆ కిల్లర్ హత్య చేస్తాడు. సుగ్రీవను హత్య చేసిన కిల్లర్ ను పట్టుకోవాలి .. అతను కిడ్నాప్ చేసిన ఆమనిని రక్షించాలి. దీనికి డిపార్టుమెంటు 'ఆపరేషన్ రావణ్' అనే పేరు పెడుతుంది. అతణ్ణి బంధించడానికి రంగంలోకి దిగుతారు. ఇక మరో వైపున ఆమనిని కాపాడుకోవడానికి రామ్ తన అన్వేషణ మొదలెడతాడు. అప్పడు అతనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? సీరియల్ కిల్లర్ ఎవరు? అతను సైకోగా ఎందుకు మారాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ: ఒక వైపున సైకో వరుస హత్యలు .. పెళ్లి కుదిరిన యువతులను మాత్రమే అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడనేది పోలీసులకు అంతుచిక్కని ప్రశ్న. ఆ విషయాన్ని కనిపెట్టడానికి రంగంలోకి దిగిన టీవీ ఛానల్ రిపోర్టర్ సైతం సైకో చేతికి చిక్కుతుంది. సైకో కేసును డీల్ చేస్తున్న ఏసీపీ సైతం హత్యకి గురవుతాడు. ఏం జరుగుతుందనేది తెలుసుకోవడానికి రిపోర్టర్ లవర్ రామ్ కూడా రంగంలోకి దిగుతాడు. 

ఇలా ఈ కథ అనేక కోణాల్లో ముందుకు వెళుతూ ఉంటుంది. సైకో కిడ్నాప్ చేయడం . మర్డర్ చేయడం .. పోలీసుల ఇన్వెస్టిగేషన్ .. హీరో వ్యూహాలు .. ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా అనిపించినప్పుడే ఇలాంటి కథలు రక్తి కడుతుంటాయి .. ఉత్కంఠను రేకెత్తిస్తూ ఉంటాయి. కానీ పైపైన సన్నివేశాలను అల్లుకుంటూ పోవడం వలన, అవి ఆడియన్స్ కి కనెక్ట్ కాకుండా తేలిపోతుంటాయి. పేలవంగా మిగిలిపోతుంటాయి. 

ఇక ఈ కథ ముందుకు వెళుతున్నా కొద్దీ అంతకుముందు పరిచయమైన పాత్రలన్నీ అదృశ్యమవుతూ ఉంటాయి. 'ఆపరేషన్ రావణ్' మొదలవుతుంది అని సీరియస్ గా చెప్పిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మళ్లీ కనిపించడు. అలాగే 100 కోట్ల స్కామ్ సంగతి కూడా పక్కన పెట్టేశారు. క్లైమాక్స్ ను ప్రేక్షకులు అంచనా వేసేస్తారు. వాళ్లు అనుకున్నట్టుగానే జరుగుతుంది కూడా.

పనితీరు: హీరో - హీరోయిన్ నటన ఓ మాదిరిగా అనిపిస్తుంది. రాధిక పాత్ర చాలా బలంగా ఉంటుందని ఆడియన్స్ అనుకుంటారు. కానీ మిగతా పాత్రల మాదిరిగానే ఆమె పాత్రను కూడా తేల్చేశారు. సెకండాఫ్ లో సైకో ఫ్లాష్ బ్యాక్ పెరిగిపోయి, హీరోతో ఆడియన్స్ కి గ్యాప్ వచ్చేస్తుంది. ప్రీ క్లైమాక్స్ లోని సన్నివేశాలు కూడా చాలా నాటకీయంగా అనిపిస్తాయి. ట్విస్టుల పరంగా గానీ .. స్క్రీన్ ప్లే పరంగా గాని మేజిక్ జరగలేదు. 

నాని ఫొటోగ్రఫీ .. శ్రావణ్ వాసుదేవ్ సంగీతం .. సత్య ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ఇలాంటి కంటెంట్ క్షణక్షణం భయం భయం అన్నట్టుగా సాగాలి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ పుట్టాలి. తెరపై జరుగుతున్నదంతా నిజమేననే భావన ఆడియన్స్ కి కలగాలి. అలాంటి అన్ని అంశాలకు దూరంగా ఉండిపోయిన కంటెంట్ ఇది. 

Movie Name: Operation Raavan

Release Date: 2024-11-02
Cast: Rakshith Atluri, Sangeerthana, Radhika, Charan Raj, Raghu Kunche
Director:Venkata Sathya
Producer: Dhyan Atluri
Music: Sharabana Vasudevan
Banner: Sudhas Media

Rating: 2.00 out of 5

Trailer

More Reviews