'కిష్కింద కాండం' (హాట్ స్టార్) మూవీ రివ్యూ!

Kishkindha Kaandam

Kishkindha Kaandam Review

  • మలయాళంలో రూపొందిన 'కిష్కింద కాండం'
  • సెప్టెంబర్ 12న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • 7 కోట్లతో 70 కోట్లకు పైగా కొల్లగొట్టిన కంటెంట్
  • ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్
  • స్క్రేన్ ప్లే - లొకేషన్స్ హైలైట్

మలయాళంలో ఈ ఏడాది ప్రథమార్థంలో వరుస బ్లాక్ బస్టర్లు నమోదవుతూ వచ్చాయి. ద్వితీయార్థంలోను అదే జోరు కనిపిస్తూ ఉండటం విశేషం. ద్వితీయార్థంలో వచ్చిన సినిమాల జాబితాలో 'కిష్కింద కాండం' ఒకటి. దింజిత్ అయ్యతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. అసిఫ్ అలీ - అపర్ణ బాలమురళి - విజయ్ రాఘవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అది ఫారెస్టు ప్రాంతానికి ఆనుకుని ఉన్న విలేజ్. గతంలో ఆర్మీలో పనిచేసిన అప్పూ పిళ్లై ( విజయ్ రాఘవన్) తన కొడుకు అజయ్ చంద్ర (అసిఫ్ అలీ) కోడలు ప్రవీణ (వైష్ణవి రాజ్) మనవడు చాచూ (ఆరవ్)తో కలిసి నివసిస్తూ ఉంటాడు. అజయ్ ఫారెస్టు ఆఫీవర్ గా పనిచేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వలన ప్రవీణ చనిపోతుంది. చాచూ కనిపించకుండా పోతాడు. చాచూ గురించిన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది.

ఎలక్షన్స్ దగ్గర పడుతూ ఉండటంతో లైసెన్సుడ్ గన్స్ కలిగిన వాళ్లంతా తమ గన్స్ ను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో సరెండర్ చేయాలని స్టేషన్ నుంచి అప్పూకి కాల్ వస్తుంది. అయితే అప్పటికే అతని గన్ కనిపించకుండాపోయి చాలా రోజులవుతుంది. చివరి నిమిషంలో ఈ విషయాన్ని స్టేషన్ లో చెబుతాడు అజయ్. ఆ గన్ నుంచి ఒక్క బుల్లెట్ బయటికి వచ్చినా అందుకు వాళ్లు బాధ్యత వహించవలసి ఉంటుందని పోలీస్ ఆఫీసర్ హెచ్చరిస్తాడు.   

ఈ నేపథ్యంలోనే అపర్ణ (అపర్ణ బాలమురళి)ని అజయ్ వివాహం చేసుకుంటాడు. అర్థాంగిగా ఆమెను ఇంటికి తీసుకుని వస్తాడు. తన మావగారు అప్పూ పిళ్లై మెమరీ లాస్ తో బాధపడుతున్నాడని ఆమె తెలుసుకుంటుంది. కనిపించకుండా పోయిన 'చాచూ' ఏమైపోయి ఉంటాడని ఆలోచన చేస్తూ ఉంటుంది. అలాగే తన మావగారి గన్ ఎలా మిస్సయ్యి ఉంటుందా అనే ఒక సందేహం ఆమెకి కుదురులేకుండా చేస్తూ ఉంటుంది. 

అప్పూ ప్రవర్తన .. ఆయన వ్యవహార శైలి అపర్ణకు అనుమానాన్ని కలిగిస్తుంది. గన్ మాయం కావడానికీ .. 'చాచూ' కనిపించకుండా పోవడానికి వెనుక అప్పూ పిళ్లై హస్తం ఉండొచ్చని భావిస్తుంది. ఆయన తన గదిలోకి ఎవరినీ రానీయకపోవడం .. అప్పుడప్పుడు ఏవేవో వస్తువులు ఇంటికి దూరంగా తీసుకెళ్లి తగలబెడుతుండటం ఆమె అనుమానాన్ని మరింత బలపరుస్తాయి. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె అన్వేషణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి? అనేది కథ.

విశ్లేషణ: ఒక తండ్రి .. అతని కొడుకు .. కోడలు .. ఈ మూడు ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. కొత్తగా కాపురానికి వచ్చిన అపర్ణ, కనిపించకుండా పోయిన తన భర్త మొదటి భార్య కొడుకు తిరిగి రావాలని కోరుకుంటుంది. అలా జరిగితే తన భర్త హ్యాపీగా ఉండటం చూడొచ్చని భావిస్తుంది. అయితే ఈ విషయంలో ఆమెకి మావగారిపై అనుమానం కలగడం .. అది బలపడటంతో ఫస్టు పార్టు నడుస్తుంది. 

ఇక మావగారిపై అపర్ణకి గల అనుమానాన్ని నిజం వైపుగా తీసుకుని వెళుతూ కొన్ని ఆధారాలు లభిస్తాయి. ఆ సంఘటనలు .. ఆధారాలు ఆమెను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే మలుపులతో సెకండాఫ్ కొనసాగుతుంది.  నిజానికి ఇది చాలా చిన్నకథ. తక్కువ పాత్రలతో .. తక్కువ పరిధిలో కొనసాగుతుంది. మరికొన్ని పాత్రలు ఉన్నప్పటికీ అవి సందర్భాన్ని బట్టి వచ్చి వెళుతూ ఉంటాయి. కోతులు ఎక్కువగా ఉన్న గ్రామం కావడం వలన ఈ టైటిల్ ను సెట్ చేశారు. 

మావగారి మెమరీ లాస్ .. పిల్లాడు కనిపించకుండా పోవడం .. గన్ మిస్సవ్వడం అనే మూడు కోణాలను ఒకదానికొకటి ముడిపెడుతూ దర్శకుడు ఈ కథనాన్ని నడిపించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఏం జరిగి ఉంటుందనేది చివరివరకూ ఆడియన్స్ గెస్ చేయలేరు. అక్కడే ఈ సినిమా ఎక్కువ మార్కులు కొట్టేసింది. తెరపై అద్భుతాలు జరగవు. సహజత్వానికి దగ్గరగా దర్శకుడు ఈ కథను నడిపించుకుంటూ వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది.         

పనితీరు: సీనియర్ ఆర్టిస్ట్ విజయ్ రాఘవన్ పాత్ర ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. విచిత్రంగా .. అనుమానాస్పదంగా వ్యవహరించే పాత్రలో ఆయన నటన గొప్పగా అనిపిస్తుంది. తండ్రి .. కొడుకు .. భార్య .. ఈ ముగ్గురి మధ్య నలిగిపోయే పాత్రలో అసిఫ్ అలీ నటన ఆకట్టుకుంటుంది. ఇక కొత్తగా వచ్చిన కోడలు ఆ ఇంటిని ఎలా అర్థం చేసుకుంటుంది? ఆ విషయాలను భర్తతో ఎలా పంచుకుంటుంది? అనేది అపర్ణ ఆవిష్కరించిన విధానం చాలా నేచురల్ గా అనిపిస్తుంది. 

కథ - స్క్రీన్ ప్లే ప్రధానమైన బలంగా కనిపించగా, రమేశ్ ఫొటోగ్రఫీ .. ముజీబ్ నేపథ్య సంగీతం .. సూరజ్ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళతాయి. మలయాళ సినిమాలను దగ్గరగా పరిశీలిస్తే, కథను .. లొకేషన్స్ ను కనెక్ట్ చేయడంలోనే వారు సగం సక్సెస్ అవుతారని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఈ ప్రదేశంలో ఇలా జరిగిందేమో అన్నంత సహజంగా ఆ లొకేషన్స్ ఉంటాయి. ఈ సినిమా విషయంలోను లొకేషన్స్ ది పైచేయిగానే కనిపిస్తుంది. 7 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 70 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడానికి కారణం, కథాకథనాలే అనిపిస్తుంది. ఆద్యంతం ఆసక్తికరంగా నడిచే ఈ మిస్టరీ థ్రిల్లర్ ను ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 

Movie Name: Kishkindha Kaandam

Release Date: 2024-11-19
Cast: Asif Ali, Aparna Balamurali, Vijayaraghavan, Jagadish, Ashokan
Director:Dinjith Ayyathan
Producer: Joby George Thadathi
Music: Mujeeb Majeed
Banner: Goodwill Entertainments

Rating: 3.00 out of 5

Trailer

More Reviews