ఈ మధ్య కాలంలో చిన్న సినిమాల కథలు గ్రామీణ ప్రాంతాల దిశగా పరుగులు తీస్తున్నాయి. ఏ మాత్రం కంటెంట్ ఉన్నా, ఆ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. అలా రూపొందిన సినిమానే 'లగ్గం'. సాయి రోనక్ - ప్రజ్ఞా నగ్రా ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, రమేశ్ చెప్పాల దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, నిన్నటి నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: చైతన్య (సాయి రోనక్) హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని తల్లిదండ్రులు 'జనగామ'లో నివసిస్తూ ఉంటారు. అక్కడ వారికి ఉన్న 40 ఎకరాల పొలం చూసుకుంటూ ఉంటారు. ఆ పక్కనే ఉన్న 'చింతమడక'లో చైతన్య మేనమామ సదానందం (రాజేంద్ర ప్రసాద్) ఆయన కూతురు మానస ( ప్రజ్ఞా) నివసిస్తూ ఉంటారు. ఒకసారి ఒక చిన్న పనిమీద హైదరాబాద్ వచ్చిన సదానందం, అక్కడ చైతన్యను కలుసుకుంటాడు.
అప్పుడే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగుల లైఫ్ స్టైల్ ను దగ్గర నుంచి చూస్తాడు. పల్లెటూరి జీవితం .. వ్యవసాయం పట్ల అతనికి అప్పటి వరకూ ఉన్న అసంతృప్తి మరింత పెరుగుతుంది. సాఫ్ట్ వేర్ జాబ్ అంటే, వారానికి ఐదు రోజులే పని .. లక్షల్లో జీతాలు .. ప్రమోషన్లు .. విదేశాలకు వెళ్లే అవకాశాలు. వీటి గురించి తెలియగానే, చైతన్యకి తన కూతురు మానసను ఇచ్చి వివాహం చేయాలనుకుంటాడు. చెల్లెలు సుగుణ (రోహిణి)కి తన మనసులోని మాటను చెబుతాడు. ఆ వైపు నుంచి కూడా అంగీకారం రాగానే అతను ఫుల్ ఖుషీ అవుతాడు.
మానస చిన్నప్పుడే తల్లిని కోల్పోతుంది. ఆమెకి తల్లి తండ్రి సదానందమే. తల్లిలేదంటూ తన పట్ల ఎవరైనా జాలి చూపించడం మానసకు ఇష్టం ఉండదు. తన చిన్నప్పటి నుంచి తన మేనత్తవాళ్లు అలాంటి జాలి చూపిస్తూనే వస్తున్నారని ఆమె అనుకుంటుంది. అలాంటి జాలితోనే తనని ఆ ఇంటికి కోడలుగా చేసుకోవాలనుకుంటున్నారని భావిస్తుంది. తండ్రి మాట కాదనలేక ఆమె ఆ పెళ్లికి అంగీకరిస్తుంది. దాంతో చకచకా పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతాయి.
పెళ్లి దగ్గర పడుతుండగా చైతన్య తన జాబ్ మానేసి ఇంటికి వస్తాడు. ఇకపై తన ఊళ్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు వాళ్లు హ్యాపీగా ఒప్పుకుంటారు. చైతన్య జాబ్ మానేసి వచ్చిన విషయం తెలియగానే సదానందం కోపంతో రగిలిపోతాడు. వెంటనే ఆ పెళ్లి ఆపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆయన ఏం చేస్తాడు? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే చాలామంది, తమ పనుల పట్ల అసంతృప్తితో ఉంటారు. ఎండల్లో ఎంతకాలం కష్టపడినా మిగిలేది పెద్దగా ఉండదని అసహనాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సిటీ అనేది వారి కంటికి ఒక విలాసవంతమైన నగరంలా కనిపిస్తుంది. వారానికి ఐదు రోజులే పనిచేస్తూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చాలా సుఖపడిపోతున్నారని అనుకుంటారు. ఎపుడు చూసినా ఏసీ గదుల్లో ఉండే అలాంటివారికి పిల్లనివ్వడానికి ఎగబడుతుంటారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి సిటీకి వచ్చి సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసే యువకుల పరిస్థితి వేరుగా ఉంటుంది. హాయిగా ఉండే తమ ఊరుకు దూరంగా వచ్చి, విపరీతమైన టెన్షన్ పడటం అవసరమా అనుకుంటూ ఉంటారు. తమ పేరెంట్స్ గొప్పలకు తాము బలికావల్సి వస్తుందని వేదన చెందుతుంటారు. చివరికి చివరి క్షణాల్లో వారిని చూసే అదృష్టానికి కూడా నోచుకోరు.
ఇదే విషయాన్ని దర్శకుడు ఈ కథలో టచ్ చేశాడు. వ్యవసాయదారులకు పిల్లను ఇస్తే తమ పిల్ల కష్టపడుతుందనీ, సాఫ్ట్ వేర్ కి ఇస్తే సుఖపడుతుందనే కొంతమంది ఆడపిల్లల తండ్రుల అపోహలకు తెరదించే ప్రయత్నం చేశాడు. అలాగే తమ పిల్లలు తమకి అందుబాటులో లేకపోయినా ఫరవాలేదు, నలుగురిలో గొప్ప కోసం వాళ్లను ఫారిన్ పంపించాలని ఆరాటపడే పేరెంట్స్ తీరును ప్రస్తావించిన తీరు కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది.
పనితీరు: సాయి రోనక్ - ప్రజ్ఞా ఇద్దరూ కూడా తమ పాత్రలలో మెప్పించారు. ఇక ఒక ఆడపిల్ల తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. ముఖ్యంగా అప్పగింతలు పాటలో రాజేంద్రప్రసాద్ నటన కన్నీళ్లు పెట్టిస్తుంది. ఆయన చెల్లెలి రోహిణి నటన కూడా ఆకట్టుకుంటుంది. కొడుకు విదేశాల్లో ఉన్నాడని పైకి గొప్పలు చెబుతూ, ఒంటరిగా కుమిలిపోయే రామయ్య పాత్రలో ఎల్బీ శ్రీరామ్ నటన ఆలోచింపజేస్తుంది.
గ్రామీణ నేపథ్యంలోని లొకేషన్స్ ను కవర్ చేయడంలో బాల్ రెడ్డి తన కెమెరా పనితనం చూపించాడు. మణిశర్మ నేపథ్య సంగీతం .. చరణ్ అర్జున్ బాణీలు ఫరవాలేదు. ఇది అందరికీ తెలిసిన కథనే. అయినా తనదైన స్టైల్లో దర్శకుడు ఆవిష్కరించిన తీరు, ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన విధానం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుంది. ఒక చిన్న బడ్జెట్ లో వచ్చిన మంచి సినిమాగా మార్కులు కొట్టేస్తుంది.
'లగ్గం' (ఆహా) మూవీ రివ్యూ!
Laggam Review
- చిన్న బడ్జెట్ లో రూపొందిన 'లగ్గం'
- గ్రామీణ నేపథ్యంలో సాగే కథాకథనాలు
- ఈ నెల 22 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్
- ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునే కంటెంట్
Movie Name: Laggam
Release Date: 2024-11-22
Cast: Sai Ronak, Pragna Nagra, Rajendra Prasad, Rohini, LB Sri Ram
Director:Ramesh Cheppaala
Producer: Venu Gopal Reddy
Music: Mani Sharma- Charan Arjun
Banner: Subishi Entertainment
Review By: Peddinti
Rating: 2.75 out of 5
Trailer