'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్' (సోనీ లివ్) వెబ్ సిరీస్ రివ్యూ!

Freedom at Midnight

Freedom at Midnight Review

  • హిస్టారికల్ పొలిటికల్ డ్రామా నేపథ్యంలో సాగే సిరీస్
  • సహజత్వానికి దగ్గరగా అనిపించే కంటెంట్
  • ప్రధానమైన పాత్రలలో ఆర్టిస్టుల నటన హైలైట్
  •  ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • కాలం .. పాత్రల స్వభావం కారణంగా నిదానంగా అనిపించే కథనం

ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ నేపథ్యంతో కూడిన కథలను అందించడంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు పోటీపడుతున్నాయి. ఈ తరహా కంటెంట్ కి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఓ హిస్టారికల్ పొలిటికల్ డ్రామా సిరీస్ ప్రేక్షకులను పలకరించింది. ఆ సిరీస్ పేరే 'ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్'. మోనీషా అద్వానీ .. మధు బోజ్వాని నిర్మించిన ఈ సిరీస్ కి నిఖిల్ అద్వాని దర్శకత్వం వహించాడు.

చిరాగ్ వోరా .. సిద్ధాంత్ గుప్తా .. రాజేంద్ర చావ్లా .. ల్యూక్ మెక్ గిబ్నే కీలకమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ ను 7 ఎపిసోడ్స్ గా అందించారు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ .. బెంగాలీ .. మరాఠీ భాషలలో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. అశుతోష్ పాఠక్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

200 ఏళ్లపాటు ఆంగ్లేయుల అణచివేతకు గురైన భారతీయులు గుండెల నిండుగా స్వాతంత్య్ర కాంక్షను నింపుకుని తమ పోరాటాన్ని కొనసాగిస్తారు. ఈ పోరాటంలో ఎంతోమంది ఉద్యమకారులు .. మరెంతోమంది త్యాగధనులు నేలకొరుగుతారు. అహింసా సిద్ధాంతాన్ని ఆయుధంగా చేసుకుని మహాత్మ గాంధీ సాగించిన పోరాటం అనేక మలుపులు తీసుకుని, చివరికి ఆంగ్లేయులు వెనుదిరిగే  పరిస్థితిని తీసుకురావడం దగ్గర నుంచి ఈ కథ మొదలవుతుంది.

కథ: వైశ్రాయ్ లార్డ్ మౌంట్ బాటెన్ అప్పటివరకూ భారతదేశంపై ఉన్న తమ అధికారాలను వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తాడు. అయితే దేశాన్ని విభజన చేసి ఇవ్వడానికి ఆయన రంగాన్ని సిద్ధం చేస్తాడు. పాకిస్థాన్ .. పశ్చిమ బెంగాల్ .. పంజాబ్ ప్రాతాల విషయంలో తర్జనభర్జనలు జరుగుతూ ఉంటాయి. భారతదేశం నుంచి ఏ ప్రాంతాన్ని విభజించడానికి కూడా తాము ఒప్పుకోమని మహాత్మ గాంధీ .. జవహర్ లాల్ నెహ్రూ .. సర్దార్ వల్లభాయ్ పటేల్ బలంగా చెబుతారు. 

అయితే మహ్మద్ అలీ జిన్నా మాత్రం, ముస్లిమ్స్ కోసం ఒక ప్రత్యేకమైన దేశం కావాలనీ, పాకిస్థాన్ ను ప్రత్యేకమైన దేశంగా ప్రకటించవలసిందేనని తేల్చి చెబుతాడు. ఈ విషయంలో తాము అనుకున్నట్టుగా జరగకపోతే, ఆయుధాలు పట్టడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని హెచ్చరిస్తాడు. ఆయన చేసిన మరికొన్ని వ్యాఖ్యల కారణంగా అనేక ప్రాంతాలలో అల్లర్లు మొదలవుతాయి. 

మహ్మద్ అలీ జిన్నాతో అధికారం పంచుకోవడం కంటే కూడా, అతను అడిగింది ఇవ్వడమే మంచిదని నెహ్రూకి సలహా ఇస్తాడు వల్లభాయ్ పటేల్. ఈ విషయంలో గాంధీజీని ఒప్పించడం కష్టమని నెహ్రూ అంటాడు. ఆ బాధ్యత ఆయనదేనని చెబుతాడు వల్లభాయ్ పటేల్. దాంతో గాంధీజీని కలిసుకుంటాడు నెహ్రూ. వాళ్లిద్దరి మధ్య చోటుచేసుకునే సన్నివేశం ఎలాంటిది? ఆ తరువాత జరిగే పరిణామాలు ఎలాంటివి? అనే అంశాల దిశగా ఈ సిరీస్ సాగుతుంది.

 విశ్లేషణ: స్వాతంత్య్రం రావడానికి కొంత కాలం ముందు నుంచి దర్శకుడు ఈ కథను ఎత్తుకున్నాడు. అవసరమని అనుకున్నప్పుడు అక్కడక్కడా కథలో కాస్త వెన్నక్కి వెళ్లాడు. సాధారణంగా ఈ తరహా కథాంశాలలో ఆనాటి ఉద్యమాలు .. తిరుగుబాట్లు .. రహస్య సమావేశాలు .. ప్రతిదాడులు .. అణచివేతలు వంటి అంశాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. కానీ దర్శకుడు ఈ సినిమా విషయంలో అలాంటివాటిని ఎక్కువగా టచ్ చేయలేదు. 

దేశ స్వాతంత్య్రం అనేది ప్రధానమైన కథాంశమే అయినప్పటికీ, ఇండియా నుంచి పాకిస్థాన్ ను విభజించాలని మహ్మద్ అలీ జిన్నా పట్టుబట్టడం .. అతని డిమాండ్ గురించి నెహ్రూ - సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్జన భర్జనలు పడటం చుట్టూనే ఈ కథ నడుస్తుంది. సన్నివేశాల కంటే కూడా సంభాషణలతోనే ఈ కథ కొనసాగుతుంది. ఎక్కువగా చర్చలు .. సమాలోచనలతోనే కథ ముందుకెళుతూ ఉంటుంది.

 దర్శకుడు తాను అనుకున్న అంశం నుంచి పక్కకి వెళ్లకుండా చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పాడు. పాత్రలను .. సన్నివేశాలను సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళ్లాడు. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ .. వస్తువులు .. వాహనాలు .. నివాసాల వంటివాటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్న తీరు బాగుంది. కథా పరంగా ఎక్కువగా బయటికి వెళ్లకపోవడం కూడా కలిసొచ్చిందనే చెప్పాలి. గాంధీజీ .. నెహ్రూ .. పాత్రల లుక్స్ ఓకే. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ లుక్ ..  పాత్రను డిజైన్ చేసిన తీరు సరిగ్గా కుదరలేదేమో అనిపిస్తుంది.

పనితీరు: దేశ స్వాతంత్య్రం అనే అంశానికి సంబంధించిన కథ విస్తారమైనదే. అయితే అందులో పాకిస్థాన్ విభజన అనే అంశంపైనే దర్శకుడు ఎక్కువగా ఫోకస్ చేశాడు. అందువలన కొన్ని పరిమితమైన ప్రధానమైన పాత్రల చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. గాంధీజీగా చిరాగ్ వోరా .. నెహ్రూ గా సిద్ధాంత్ గుప్తా ..  సర్దార్ వల్లభాయ్ పటేల్ గా రాజేంద్ర చావ్లా .. మహ్మద్ అలీ జిన్నాగా ఆరిఫ్ జకారియా .. మౌంట్ బాటెన్ గా ల్యూక్ మెక్ గిబ్నే నటన సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. 

ప్రకాశ్ ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది. ఆ కాలానికి సంబంధించిన లైటింగ్ ను సెట్ చేసుకుని, ఆ కథలోకి మనలను తీసుకుని వెళ్లగలిగాడు. అశుతోష్ పాఠక్ నేపథ్య సంగీతం, మనలను కథతో ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. సన్నివేశాలలో నుంచి మనలను జారిపోనీయకుండా చూస్తుంది. శ్వేత వెంకట్ ఎడిటింగ్ చాలా నీట్ గా అనిపిస్తుంది.  

ఈ సినిమాలో ఇతర అంశాలకు అవకాశం లేదు. ఆ కాలంలో .. ఆ సందర్భంలో ఏం జరిగి ఉంటుంది? అనేది దృశ్య రూపంగా తెలుసుకోవాలనుకునేవారే ఈ సినిమా పట్ల ఆసక్తిని కనబరుస్తారు. అలాంటివారికి సహజంగా అనిపిస్తూ ఈ కంటెంట్ కనెక్ట్ అవుతుంది. ఆయా పాత్రల స్వభావం .. చర్చలు ఎక్కువగా చోటు చేసుకోవడం .. ఆ కాలంనాటి ఆవిష్కరణ కావడం వలన కథ కాస్త నిదానంగా సాగుతున్నట్టుగా అనిపిస్తుందంతే.

Movie Name: Freedom at Midnight

Release Date: 2024-11-15
Cast: Sidhant Gupta, Chirag Vohra, Rajendra Chawla, Luke McGibney, Cordelia Bugeja
Director:Nikkhil Advani
Producer: Monisha Advani - Madhu Bhojwani
Music: Ashutosh Phatak
Banner: Studio Next - Emmay Entertainment

Rating: 3.00 out of 5

Trailer

More Reviews