'ది మేజిక్ ఆఫ్ శిరి' వెబ్ సిరీస్ హిందీలో రూపొందింది. దివ్యాంక త్రిపాఠి .. జావేద్ జాఫెరీ .. నమిత్ దాస్ .. నిశాంక్ వర్మ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, 'జియో సినిమా'లో నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు ఇతర భాషలలోను అందుబాటులోకి వచ్చింది. బిర్సాదాస్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 10 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: ఈ కథ 1996లో మొదలవుతుంది. ఢిల్లీలో శిరి (దివ్యాంక త్రిపాఠి) ఫ్యామిలీ నివసిస్తూ ఉంటుంది. భర్త నవీన్ ( నమిత్ దాస్) పిల్లలు సోనూ - మిన్నూ .. ఇదే ఆమె కుటుంబం. శిరి - నవీన్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. నవీన్ తండ్రి (దర్శన్ జరీవాలా) ఓ ప్రభుత్వ బ్యాంకులో పనిచేస్తూ ఉంటాడు. తన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి చూపక పోవడం .. ఒక పంజాబీ యువతిని పెళ్లాడటం ఆయనకి నచ్చదు. అందువలన ఆ ఫ్యామిలీతో వీరికి మాటలు ఉండవు.
నవీన్ ఒక ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఇల్లొదిలి వెళ్లిపోతాడు. తనని వెతికే ప్రయత్నం చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని లెటర్ రాసి పెడతాడు. అలాంటి పరిస్థితుల్లో చిన్నప్పుడు తనకి తండ్రి నేర్పిన 'మేజిక్'ను ఆశ్రయించాలని ఆమె అనుకుంటుంది. తన తండ్రి గొప్ప మెజీషియన్ కావాలని కలలు కనడం గుర్తొస్తుంది. అతనికి ఆత్మ శాంతి కలిగేలా, ఆ రంగంలో తాను పేరు తెచ్చుకుని తన కుటుంబాన్ని పోషించాలని నిర్ణయించుకుంటుంది.
నవీన్ ఇల్లొదిలి వెళ్లిపోవడంతో పిల్లలిద్దరినీ తీసుకుని తమ ఇంటికి వచ్చేయమని శిరి అత్తా మామలు ఒత్తిడి చేస్తారు. అయినా తన పిల్లలను తానే పోషించాలని శిరి భావిస్తుంది. తండ్రి ఊరెళ్లాడని పిల్లలకు అబద్ధం చెబుతూ రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. ఈ సమయంలోనే ఇంద్రజాల విద్యలో ఆరితేరిన సలీమ్ ( జావేద్ జాఫెరీ) .. బిజినెస్ మెన్ ఆకాశ్ (నిశాంక్ వర్మ) ఆమె జీవితంలోకి అడుగుపెడతారు. ఫలితంగా ఏం జరుగుతుంది? ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అనేది కథ.
విశ్లేషణ: ఈ కథ 6 ప్రధానమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. చిన్న చిన్న ఫ్లాష్ కట్స్ తో ఈ కథ 1960 .. 70 .. 80ల నుంచి 90లలోకి వచ్చి అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథ. ఎక్కడ ఎలాంటి అభ్యంతరకరమైన సన్నివేశాలుగానీ .. సంభాషణలు గాని లేని కథ. మొదటి నుంచి చివరివరకూ ఎక్కడా బోర్ అనేది లేకుండా ఈ కథ నడుస్తుంది. అతిగా .. సినిమా టిక్ గా అనిపించే సన్నివేశాలు ఎక్కడా కనిపించవు.
స్క్రీన్ ప్లే చాలా నీట్ గా అనిపిస్తుంది. పాత్రలను ప్రవేశ పెట్టిన తీరు .. వాటిని నడిపించిన విధానం .. ముగించిన పద్ధతి సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తూ ఉంటుంది. ఆత్మాభిమానం .. అహంభావం అంటూ పెద్దల మధ్య జరిగే గొడవల్లో పిల్లలు మానసికంగా ఎంతగా దెబ్బతింటారనేది దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలలో పెద్దలు జోక్యం చేసుకోవడం వలన, అవి మరింత పెద్దవిగా ఎలా మారతాయనేది చూపించిన విధానం బాగుంది.
కీలకమైన పాత్రల స్వరూప స్వభావాలను దర్శకుడు మలచిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే ప్రధానమైనదిగా కనిపించే 'శిరి' పాత్ర విషయంలోనే ప్రేక్షకులకు క్లారిటీ లోపిస్తుంది. ఆ పాత్ర వ్యక్తిత్వం విషయంలో అయోమయం ఏర్పడుతుంది. ఆ పాత్ర ఒకానొక సందర్భంలో 'నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు' అంటుంది. సరిగ్గా ఆ పాత్ర విషయంలో ఆడియన్స్ కి అదే అభిప్రాయం కలుగుతుంది. కుటుంబాన్ని పోషించాలి .. తండ్రి కలను నిజం చేయాలి అనేంతవరకూ ఓకే, కానీ ఆకాశ్ తో కూడిన ఆమె ట్రాక్ ఆంతర్యం అర్థం కాదు. ఆమె ఉద్దేశం ఏమిటనేది చివరివరకూ ప్రేక్షకులకు స్పష్టత రాదు.
పనితీరు: 'శిరి' పాత్రలో దివ్యాంక త్రిపాఠి ఒదిగిపోయింది. ఈ సిరీస్ కి ఆమె పాత్రనే హైలైట్ .. ఆమె రూపమే ప్రత్యేకమైన ఆకర్షణ. ఎక్కడా నటిస్తున్నట్టుగా అనిపించకుండా ఆమె ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఆమె భర్త పాత్రలో నమిత దాస్ నటన ఆకట్టుకుంటుంది. అసమర్థుడైన భర్తగా .. నిలకడలేని స్వభావం కలిగిన వ్యక్తిలా తన పాత్రలో ఆయన జీవించాడు. అలాగే భర్తకు దూరమైన శిరికి దగ్గర కావటానికి ప్రయత్నించే ఆకాశ్ పాత్రలో నిశాంక్ వర్మ నటన మెప్పిస్తుంది. మిగతా వాళ్లంతా చాలా బాగా చేశారు.
ఈ సిరీస్ కి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను సంచిత్ గుప్తా, ప్రియదర్శి శ్రీవాత్సవ అందించారు. వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉండటం వలన ఈ కథ వెంటనే కనెక్ట్ అవుతుంది. ప్రతి ఎపిసోడ్ .. ఆ తరువాత ఎపిపోడ్ పై ఆసక్తిని పెంచుతూ ఎండ్ కావడం వలన చివరి వరకూ ప్రేక్షకులు ఫాలో అవుతారు. పై మూడు అంశాలు ఈ సిరీస్ కి మూడు పిల్లర్స్ అని చెప్పచ్చు.
శుభంకర్ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ప్రతి దృశ్యం తెరపైన కాకుండా మన మధ్యలో జరుగుతున్నట్టుగా ఆయన ఆవిష్కరించారు. దిప్తార్క్ బోస్ నేపథ్య సంగీతం, కథను ప్రేక్షకుల హృదయాలకు మరింత దగ్గరగా తీసుకుని వెళుతుంది. బోధాదిత్య ఎడిటింగ్ వర్క్ చాలా నీట్ గా అనిపిస్తుంది. శిరి పాత్రను డిజైన్ చేసిన విషయంలోని సందేహాలను అలా ఉంచితే, ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ సిరీస్ మార్కులు కొట్టేస్తుంది.
'ది మేజిక్ ఆఫ్ శిరి' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!
The Magic of Shiri Review
- హిందీలో రూపొందిన 'ది మేజిక్ ఆఫ్ శిరి'
- 10 ఎపిసోడ్స్ తో పలకరించిన సిరీస్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- ఆకట్టుకునే సన్నివేశాలు
- ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే కంటెంట్
Movie Name: The Magic of Shiri
Release Date: 2024-11-14
Cast: Divyanka Tripathi , Jaaved Jaaferi , Namit Das, Nishank Verma, Darshan Jariwala
Director:Birsa Dasgupta
Producer: Jyoti Deshpande
Music: Diptarka Bose
Banner: Jio Studios
Review By: Peddinti
Rating: 3.00 out of 5
Trailer