'నెట్ ఫ్లిక్స్' ఫ్లాట్ ఫామ్ ద్వారా భారీ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. అలా వచ్చిన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ గా 'యే కాళీ కాళీ ఆంఖీన్' కనిపిస్తుంది. జనవరి 14వ తేదీ .. 2022న ఈ సిరీస్ నుంచి 8 ఎపిసోడ్స్ ను ఫస్టు సీజన్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. సీజన్ 2ను 6 ఎపిసోడ్స్ గా ఈ ఏడాది నవంబర్ 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నారు. రీసెంటుగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: విక్రాంత్ (తాహిర్ రాజ్ భాసిన్) 'షికా' (శ్వేతా త్రిపాఠి)ని ప్రేమిస్తాడు .. ఆమెని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే అనుకోకుండా అతని జీవితంలోకి 'పూర్వ' (అంచల్ సింగ్) అడుగుపెడుతుంది. శ్రీమంతుల ఇంటికి విక్రాంత్ అల్లుడైనందుకు అతని ఫ్యామిలీ సంతోష పడుతుంది. అయితే అతని మనసంతా షికా పైనే ఉంటుంది. ఆమెకి అఖిల్ తో పెళ్లి కుదిరినప్పటికీ, తనతో తీసుకుని వెళ్లిపోవాలని భావిస్తూ ఉంటాడు. అంతకుముందు 'పూర్వ'ను చంపించడానికి ప్లాన్ చేయడంతో సీజన్ 1 పూర్తవుతుంది.
'పూర్వ'ను కిల్లర్ చంపలేదనీ .. కిడ్నాప్ మాత్రమే చేశాడని తెలిసి విక్రాంత్ షాక్ అవుతాడు. కిల్లర్ 100 కోట్లు డిమాండ్ చేస్తే, 300 కోట్లు అడుగుతున్నట్టుగా మామగారైన 'అవస్తి'తో విక్రాంత్ చెబుతాడు. 'షికా' పెళ్లి జరిగిన ఇంట్లోనే అవస్తి అనుచరుడైన ధర్మేశ్ ను విక్రాంత్ హత్య చేస్తాడు. తాము అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరిగితే విదేశాలకు పారిపోవడానికి సిద్ధంగా ఉండమని 'షికా' ఫ్యామిలీకి ముందుగానే చెబుతాడు.
'పూర్వ' కిడ్నాప్ డ్రామా అనేక మలుపులు తిరుగుతూ ఉండటంతో, లండన్ నుంచి 'గురు' (గుర్మీత్ చౌదరి)ని అవస్తి పిలిపిస్తాడు. పూర్వను ఎవరు కిడ్నాప్ చేశారు? దాని వెనుక ఎవరున్నారు? అనే విషయాన్ని ఆరా తీయడంపై గురు దృష్టి పెడతాడు. తన గురించిన రహస్యం బయటపడిపోతుందేమోనని విక్రాంత్ భయపడుతూ ఉంటాడు. చివరికి పూర్వను ఎవరు కిడ్నాప్ చేశారో .. ఆమె ఎక్కడ ఉందో గురు కనుక్కుంటాడు. అప్పుడు విక్రాంత్ ఏం చేస్తాడు? పూర్వను వదిలించుకుని షికాతో పారిపోవాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? అనేది కథ.
విశ్లేషణ: మొదటి సీజన్ కి కొనసాగింపుగా సీజన్ 2 కథ నడుస్తుంది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాల పైన ఉంటుంది. 10 ప్రధానమైన పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ కథకి స్క్రీన్ ప్లే ప్రధానమైన బలం అని చెప్పాలి. అన్ని పాత్రలను కలుపుకుంటూ వెళుతూ, ప్రతి ఎపిసోడ్ చివరిలో ఉత్కంఠను రేకెత్తించే బ్యాంగ్ ఇస్తూ వెళ్లారు. దాంతో తరువాత ఎపిసోడ్ లో ఏం జరుగుతుందా అనే ఒక ఆసక్తి ఆడియన్స్ కి కలుగుతుంది.
విక్రాంత్ భార్య ఎంతో శ్రీమంతురాలు .. అతణ్ణి ఆమె ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది. అయినా ఆమెను వదిలించుకుని, 'షికా' అనే ఒక మిడిల్ క్లాస్ యువతితో వెళ్లిపోవాలని అతను ప్లాన్ చేస్తూ ఉంటాడు. 'షికా' భర్త కూడా సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయన ఎంతో మంచివాడైనప్పటికీ, అతణ్ణి మోసం చేసి విక్రాంత్ తో వెళ్లిపోవడానికి ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. ఈ ఇద్దరి డిఫరెంట్ మెంటాలిటీనే ఈ కథలో హైలైట్ గా నిలుస్తుంది.
ఈ కథ స్వేచ్ఛగా పరుగులు తీస్తుంది. ఖర్చుకు కంగారుపడి నాలుగు గోడల మధ్య చుట్టేసే ప్రయత్నం కనిపించదు. మంచు కొండలు .. అడవులు .. ఛేజింగులు.. ఫైరింగులు .. ఇలా ఒక బాలీవుడ్ సినిమాకి ఎంత మాత్రం తగ్గకుండా ఈ సిరీస్ ముందుకు వెళుతుంది. దర్శకుడు ప్రతి పాత్రను చాలా ఇంట్రెస్టింగ్ గా మలిచాడు. ఆ పాత్రల స్వభావం విషయంలో అయోమయం లేకుండా చూసుకున్నాడు.
పనితీరు: బలమైన కథ .. ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు ఎక్కువ మార్కులు కొట్టేస్తాడు. యాక్షన్ .. ఎమోషన్ ను బ్యాలెన్స్ చేసిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. ఇక నిర్మాణ పరంగా కూడా ఇది గొప్ప సిరీస్ అని చెప్పుకోవచ్చు. కథకి తగిన లొకేషన్స్ ఎంపిక, ఈ సిరీస్ కి మరింత హెల్ప్ అయింది. మురళీకృష్ణ ఫొటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది.
ఈ సిరీస్ ను నేపథ్య సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిందని చెప్పాలి. రాజేశ్ పాండే ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. సీజన్ 2లోని 6 ఎపిసోడ్స్ లో ఎక్కడా కూడా అనవసరమైన సన్నివేశాలు కనిపించవు. అలాగే సాగదీసినట్టుగా అనిపించవు. హింస .. రక్తపాతం తాలూకు సన్నివేశాలు తక్కువే. అయితే చూపించవలసి వచ్చినప్పుడు మాత్రం తగ్గలేదు.
నటీనటులంతా మంచి అనుభవం ఉన్నవారు కావడంతో, పాత్రలను సహజత్వానికి చాలా దగ్గరగా తీసుకుని వెళ్లారు. ఈ కారణంగా ఈ కథ తెరపై కాకుండా మన కళ్లముందు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అసభ్యతకి తావు లేకుండా చూసుకున్నారు. కథ - స్క్రీన్ ప్లే - ఫొటోగ్రఫీ - నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి నాలుగు పిల్లర్స్ మాదిరిగా నిలబడ్డాయి. నటీనటుల నటన .. లొకేషన్స్ మరింత సహజత్వాన్ని తెచ్చాయి. ఇంట్రెస్టింగ్ గా అనిపించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లలో ఇది కూడా ఒకటిగా నిలబడుతుందని చెప్పచ్చు.
'యే కాళీ కాళీ ఆంఖీన్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!
Yeh Kaali Kaali Ankhein Review
- హిందీలో రూపొందిన భారీ వెబ్ సిరీస్
- సీజన్ 2గా వచ్చిన 6 ఎపిసోడ్స్
- ఆసక్తికరమైన కథాకథనాలు
- హైలైట్ గా నిలిచే కెమెరా వర్క్ - బ్యాక్ గ్రౌండ్ స్కోర్
- ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచే లొకేషన్స్
Movie Name: Yeh Kaali Kaali Ankhein
Release Date: 2024-11-22
Cast: Tahir Raj Bhasin, Shweta Tripathi, Anchal Singh, Gurmeet Choudhary, Saurabh Shukla
Director:Sidharth Sengupta
Producer: Jyoti Sagar - Sidharth Sengupta
Music: -
Banner: Edgestorm
Review By: Peddinti
Rating: 3.50 out of 5
Trailer