'జియో సినిమా' అందించిన మరో వెబ్ సిరీస్ 'డాక్టర్స్'. హిందీలో రూపొందిన వెబ్ సిరీస్ ఇది. శరద్ కేల్కర్ .. హర్లిన్ సేథి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ వెబ్ సిరీస్ కి సాహిర్ రజా దర్శకత్వం వహించాడు. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సిరీస్ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. 10 ఎపిసోడ్స్ గా రూపొందిన ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది సిటీలోని పేరున్న కార్పొరేట్ హాస్పిటల్. అక్కడ ఇషాన్ ( శరద్ కేల్కర్) నిత్యా వాసన్ ( హర్లిన్ సేథి) డాక్టర్స్ గా పనిచేస్తూ ఉంటారు. అలాగే నహిదా .. కే .. రాయ్ .. రితిన్ .. లేఖ కూడా డాక్టర్స్ గా వర్క్ చేస్తూ ఉంటారు. జూనియర్ డాక్టర్స్ అందరిని సబీహా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. డాక్టర్ లేఖతో ఇషాన్ కి ఎంగేజ్ మెంట్ అవుతుంది. అనారోగ్య కారణాల వలన నిత్య భర్త మంచానికి పరిమితమవుతాడు.
తన పరిస్థితికి ఇషాన్ కారకుడని భావించిన నిత్య భర్త, అతనిపై కోపంతో ఉంటాడు. ఆమె మాత్రం ఇషాన్ పట్ల మంచి అభిప్రాయంతోనే ఉంటుంది. వృత్తి పట్ల అతనికి గల అంకితభావాన్ని ఆమె గమనిస్తుంది. అతని బృందంతో కలిసి పని చేయాలని ఆరాటపడుతుంది. మొదట్లో ఇషాన్ పెద్దగా ఆసక్తిని చూపకపోయినా, ఆ తరువాత ఆమె పట్ల అతని ధోరణి మారుతుంది. అతని పట్ల నిత్యకి గల అభిమానం ప్రేమగా మారుతుంది.
ఒకానొక ప్రమాదకర పరిస్థితుల్లో తాను ఇక చనిపోతానని భావించిన నిత్య, ఇషాన్ పట్ల మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తుంది. అప్పటి నుంచి ఇద్దరూ దగ్గరవుతారు. లేఖతో జరిగిన ఎంగేజ్ మెంట్ ను ఇషాన్ లైట్ తీసుకుంటాడు. నిత్య - ఇషాన్ సాన్నిహిత్యంగా ఉండటాన్ని లేఖ చూస్తుంది. వాళ్ల మధ్య సంబంధం ఉందనే విషయం అర్థమవుతుంది. అప్పుడు లేఖ ఏం చేస్తుంది? ఆమె తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఈ కథను సిద్ధార్థ్ మల్హోత్రా - శిబిన్ కేష్ కామత్ తయారు చేశారు. వృత్తి పరంగా .. వ్యక్తి గతంగా డాక్టర్స్ చుట్టూ తిరిగే కథ ఇది. లవ్ .. ఎమోషన్స్ చుట్టూ ఈ కథ నడుస్తుంది. లవ్ .. ఎమోషన్స్ తో కూడిన ఈ డ్రామా, ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుంటుందని అడిగితే, అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. శిబి కేష్ కామత్ .. రాధిక ఆనంద్ అందించిన స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయి వేగంతో సాగకపోవడం అందుకు ఒక కారణంగా చెప్పుకోవాలి.
దర్శకుడు ఒక వైపున హాస్పిటల్లోని వాతావరణం .. మరో వైపున డాక్టర్స్ వ్యక్తిగతమైన ఫీలింగ్స్ ను ఆవిష్కరిస్తూ వెళ్లాడు. హాస్పిటల్ కి వచ్చే ప్రమాదకరమైన కేసులు .. స్ట్రెచర్లు .. సైరన్లు .. ఐసీయులు .. ఆపరేషన్లు .. రక్తపాతాలు .. మరణాలు ఈ హడావిడి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఇలాంటి ఒక వాతావరణం చాలామందిలో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. అంబులెన్స్ సైరన్ వినడానికి ఇష్టపడనివారి సంఖ్య చాలా ఎక్కువనే విషయాన్ని మరిచిపోకూడదు.
ఇక చాలామంది హాస్పిటల్ వాతావరణంలో ఉండటానికి ఎంతమాత్రం ఇష్టపడరు. అందువలన మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిపోడ్ వరకూ హాస్పిటల్లోనే సాగే ఈ సిరీస్ ను ఫాలో కావడం కాస్త కష్టమైన విషయమనే చెప్పాలి. కొన్ని ప్రమాదాలు .. రక్తపాతం .. సర్జరీలు నేరుగా చూపించడం కొంతమందికి మరింత కంగారు పెట్టే విషయం. కథనం నిదానంగా సాగడం కూడా అసంతృప్తిని కలిగించే అంశమనే చెప్పాలి.
పనితీరు: ప్రధానమైన పాత్రలకు దర్శకుడు మరింత ప్రత్యేకతను తీసుకురావలసింది. అలాగే ఆ పాత్రల స్వరూప స్వభావాలను మరింత బలంగా ఆవిష్కరించవలసిన అవసరం కనిపిస్తుంది. అలాగే భావోద్వేగాలకు సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఆ ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా లేవు. మొదటి నుంచి చివరివరకూ దర్శకుడుఈ కథను నిదానంగా నడిపిస్తూ వెళ్లాడు. కథ పుంజుకోకపోవడం ఆడియన్స్ డీలాపడేలా చేస్తుంది.
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా పనితనంతో పాటు, వివేన్ సింగ్ ఫొటోగ్రఫీ .. సత్య శర్మ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. కథ అంతా పూర్తి హాస్పిటల్ వాతావరణంలో కొనసాగడం, డాక్టర్స్ వ్యక్తిగతమైన ఎమోషన్స్ కూడా హాస్పిటల్ నేపథ్యంతోనే ముడిపడి ఉండటం వలన ప్రేక్షకులకు రిలీఫ్ అనేది ఉండదు. అక్కడక్కడా కాస్త అభ్యంతరకరమైన సన్నివేశాలైతే ఉన్నాయి. హాస్పిటల్ వాతావరణాన్ని లైట్ తీసుకోలేనివారికి డి ఓకే .. లేదంటే ఇబ్బందే.
'డాక్టర్స్' (జియో సినిమా) వెబ్ సిరీస్ రివ్యూ!
Doctors Review
- హిందీలో రూపొందిన 'డాక్టర్స్'
- ఐదు భాషల్లో అందుబాటులోకి వచ్చిన సిరీస్
- పూర్తిస్థాయి హాస్పిటల్ వాతావరణంలో సాగే కథ
- నిదానంగా సాగే కథనం
- ఆకట్టుకోలేకపోయిన కంటెంట్
Movie Name: Doctors
Release Date: 2024-12-27
Cast: Sharad Kelkar, Harlin Sethi, Amir Ali, Viraf Patel, Vivan Sha
Director:Sahir Raza
Producer: Jyothi Desh Pande
Music: -
Banner: Alchemi Films
Review By: Peddinti
Rating: 2.50 out of 5
Trailer