తెలుగు తెరను ఎన్నో ప్రేమకథలు పలకరించాయి. అలాంటి ఒక సినిమాగా 'లవ్ రెడ్డి' కనిపిస్తుంది. అంజన్ రామచంద్ర - శ్రావణి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి స్మరణ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 18వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రేమకథ యూత్ ను ఎంతవరకూ ఆకటుకుందనేది చూద్దాం.
కథ: ఆంధ్ర - కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ కథ నడుస్తుంది. నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) ఓ మధ్యతరగతి ఫ్యామిలీకి చెందిన యువకుడు. అదే గ్రామానికి చెందిన కేశవరెడ్డి కూతురు దివ్య ( శ్రావణి)ని చూసి మనసు పారేసుకుంటాడు. నారాయణ రెడ్డి పక్కనే ఉన్న ఊళ్లో గార్మెంట్స్ కి సంబంధించిన బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. దివ్య కూడా ఆ పక్కనే ఉన్న ఊళ్లో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
అలా నారాయణ రెడ్డి - దివ్య ప్రతి రోజూ బస్సులో వెళ్లి వస్తూ ఉండటం వలన, ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. నారాయణ రెడ్డి మాత్రం ఆమెను ప్రేమిస్తూ ఉంటాడు. అతనికి అరుణ్ అనే తమ్ముడు ఉంటాడు. రవళి అనే యువతిని అరుణ్ లవ్ చేస్తూ ఉంటాడు. అన్నపెళ్లి అయితే, తమ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పచ్చుననే ఆలోచనలో అతను ఉంటాడు. దివ్యతో లవ్ మేటర్ చెప్పమని నారాయణరెడ్డిని తొందర చేస్తూ ఉంటాడు.
దివ్యకు తన మనసులోని మాటను చెప్పవలసిన అవసరం లేదనీ, ఆమె అర్థం చేసుకుని ఉంటుందని నారాయణరెడ్డి భావిస్తాడు. ఆ సమయంలోనే మరో యువకుడితో దివ్యకి ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందనే విషయం నారాయణ రెడ్డికి తెలుస్తుంది. దివ్య మరొకరితో పెళ్లికి ఒప్పుకోవడానికి కారణం ఏమిటి? అందుకు దారితీసిన పరిస్థితులు ఎలాంటివి? ఆమె నారాయణ రెడ్డికి దక్కుతుందా లేదా? అనేది కథ.
విశ్లేషణ: ప్రతి ప్రేమకథలోను ఒక యుద్ధం ఉంటుంది. అది ఏ వైపు నుంచి అనేది ఆ ప్రేమకు కొత్తదనాన్ని .. కొత్త అందాన్ని తీసుకుని వస్తుంది. ఈ ప్రేమకథలోను ఆ యుద్ధం కనిపిస్తుంది. అయితే ఆ యుద్ధంలో పెయిన్ లేకపోవడం ఇక్కడ ప్రేక్షకులకు అసంతృప్తిని కలిగిస్తుంది. ఆ యుద్ధంలో బలం లేకపోవడం .. సహజత్వం లోపించడం ప్రధానంగా కనిపిస్తాయి.
హీరో - హీరోయిన్ మధ్య పరిచయం - ప్రేమకి సంబంధించిన సన్నివేశాల కోసం దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. అన్నపెళ్లి అయితే తాను ప్రేమించిన అమ్మాయిని తాను పెళ్లి చేసుకోవచ్చని తమ్ముడు కంగారుపడే తీరు కాస్త అతిగా అనిపిస్తుంది. తీరా చూస్తే ఆ వైపు నుంచి ఒక ట్విస్ట్ ఉంది. కాకపోతే ఆ ట్విస్ట్ వాస్తవానికి చాలా దూరంగా .. సినిమా టిక్ గా కనిపిస్తుంది. ప్రేమకి సంబంధించిన సందర్భాలుగానీ, ఫ్యామిలీ వైపు నుంచి ఎమోషన్స్ గాని ప్రేక్షకులను పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి.
ప్రేమకథలు చాలానే వస్తూ ఉంటాయి. అయితే మనం చెప్పే కథలో కొత్త పాయింట్ ఏముందనేదే ఇక్కడ ముఖ్యం. ఆ పాయింట్ సహజత్వానికి దగ్గరగా అనిపిస్తూ, ఫీల్ తో కనెక్ట్ చేయలేకపోతే ఆ ప్రయత్నం ఫలించదు. ఈ సినిమా విషయంలో అలాంటి ఒక లోపమే మనకి కనిపిస్తుంది. 'లవ్ రెడ్డి' అనే టైటిల్లో పొంతనలేని పదాలు ఎలా ఇమడలేదో, రొటీన్ కి ఏ మాత్రం భిన్నంగా లేని ఈ కంటెంట్ కూడా అలాగే ఆడియన్స్ మనసులను పట్టుకోలేకపోతుంది.
పనితీరు: ఇది ఒక విలేజ్ నేపథ్యంలో జరిగే ప్రేమకథ. తక్కువ బడ్జెట్ లో చెప్పడానికి అవకాశం ఉన్న కథ. అయితే ఈ కథ చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న లొకేషన్స్ బాగున్నాయి. కానీ ఆ లొకేషన్స్ లో సాగే కథలో కొత్తదనం లేకపోవడం కనిపిస్తుంది. లవ్ .. రొమాన్స్ వైపు నుంచి యూత్ కి పట్టుకునే సీన్స్ ఏమీ లేకపోవడం ఆ వర్గం ఆడియన్స్ లో అసంతృప్తిని కలిగించే విషయమేనని చెప్పాలి.
హీరో - హీరోయిన్ తో పాటు ఆర్టిసులంతా దాదాపు కొత్తవారే. దానికి తోడు హీరో - హీరోయిన్ మినహా మరే పాత్ర బలమైనదిగా కనిపించదు. పాత్రలలో బలం ఎప్పుడైతే తగ్గుతుందో .. అప్పుడు ఆ పాత్రలకి సంబంధించిన సన్నివేశాలలోను బలం తగ్గుతుంది. ఏదైనా ఒక బలమైన అడ్డంకి ఎదురైనప్పుడు, దానిని ఆ ప్రేమజంట ఎలా అధిగమిస్తుంది? అనే ఒక టెన్షన్ ఆడియన్స్ కి ఉన్నప్పుడే ఆ కథ రక్తి కడుతుంది. అలాంటి టెన్షన్ లేకుండా ఆడియన్స్ తాపీగా చూసే కంటెంట్ ఇది.
ఈ సినిమా కథాకథనాలు రొటీన్ గా అనిపించినా, మనసుకి కాస్త ఊరట కలిగించేవి పాటలేనని చెప్పాలి. ప్రిన్స్ హెన్రీ స్వరపరిచిన బాణీలు ఫీల్ తోనే సాగుతాయి. ఉన్న బడ్జెట్ లో వాటిని చిత్రీకరించిన తీరు కూడా బావుంది. ఈ విషయంలో శివశంకర వరప్రసాద్ - మోహన్ చారికి మంచి మార్కులు పడతాయి. ఇక ఎడిటింగ్ వైపు వెళితే, కోటగిరి వెంకటేశ్వరరావుకి గల అనుభవం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు.
'లవ్ రెడ్డి' (ఆహా) మూవీ రివ్యూ!
Love Reddy Review
- గ్రామీణ నేపథ్యలోని ప్రేమకథగా 'లవ్ రెడ్డి'
- కొత్త ఆర్టిస్టులతో చేసిన ప్రయత్నం
- రొటీన్ గా అనిపించే కథాకథనాలు
- సినిమాటిక్ గా అనిపించే సన్నివేశాలు
- ఫొటోగ్రఫీ - సంగీతం ఫరవాలేదు
Movie Name: Love Reddy
Release Date: 2025-01-02
Cast: Anjan Ramachandra, Shravani Reddy
Director:Smaran Reddy
Producer: Sunanda Reddy- Hemalatha Reddy
Music: Prins Henry
Banner: Geethans Productions
Review By: Peddinti
Rating: 2.25 out of 5
Trailer