సంక్రాంతి కనుకగా ప్రేక్షకుల ముందుకు మరో వెబ్ సిరీస్ వచ్చింది. క్రైమ్ డ్రామా థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఆ వెబ్ సిరీస్ పేరే 'బ్లాక్ వారెంట్'. విక్రమాదిత్య మోత్వానే - సత్యాన్షు సింగ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను, 7 ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. జహాన్ కపూర్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 10వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. 40 నుంచి 50 నిమిషాల నిడివిగల ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: 1980లలో ఈ కథ నడుస్తూ ఉంటుంది. సునీల్ గుప్తా ( జహాన్ కపూర్) తీహార్ జైలులో జైలర్ గా  పనిచేస్తూ ఉంటాడు. అతనితో పాటు విపిన్ దహియా (అనురాగ్ ఠాకూర్) మంగత్ ( పరం వీర్ సింగ్) కూడా డ్యూటీలో చేరతారు. డిఎస్పీ రాజేశ్ తోమర్ (రాహుల్ భట్) టీమ్ లో వారు పనిచేయవలసి వస్తుంది. ఎంతోమంది కరడుగట్టిన నేరస్థులు అక్కడ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. ఆ సమయంలో అదే జైల్లో చార్లెస్ శోభరాజ్ కూడా ఖైదీగా ఉంటాడు.

సునీల్ కుమార్ గుప్తా ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. బక్క పలచగా .. హైటు తక్కువగా ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచి పోలీస్ ఉద్యోగం పట్ల గల ఆసక్తితో ఆ జాబ్ కొడతాడు. ఆర్ధికంగా కూడా తన ఉద్యోగం తన కుటుంబానికి ఎంత అవసరమనేది అతనికి తెలుసు. అయితే ఒక పోలీస్ కి ఉండవలసిన కండబలం లేకపోవడం వలన అతనికి విమర్శలు ఎదురవుతూ ఉంటాయి. అతని సున్నితమైన స్వభావం గురించి పై అధికారులు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. 

ఆ జైల్లో త్యాగి గ్యాంగ్ .. హడ్డీ గ్యాంగ్ .. సర్దార్ గ్యాంగ్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. మద్యం .. మాదక ద్రవ్యాలు జైలు లోపలికి కూడా వస్తుంటాయి. దానిని అరికట్టాలని సునీల్ గుప్తా అనుకుంటాడు. అలాగే ఆ మూడు గ్యాంగుల మధ్య గొడవలకి ఒక పరిష్కారం కనుగొనాలని నిర్ణయించుకుంటాడు. అనవసరంగా జైల్లో శిక్షను అనుభవిస్తున్న కొంతమంది ఖైదీలను విడుదల చేయించాలని భావిస్తాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడు? అనేది కథ. 

విశ్లేషణ: తీహార్ జైలు మాజీ సూపరింటెండెంట్ సునీల్ గుప్తా, జర్నలిస్ట్ సునేత్ర చౌదరితో కలిసి రాసిన 'బ్లాక్ వారెంట్ - కన్ఫెషన్స్ ఆఫ్ ఏ తీహార్ జైలర్' అనే పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. 1980ల నాటి యథార్థ సంఘటనలతో ఈ కథ ముందుకు వెళుతుంది. కథలో 80 శాతం జైలు గోడల మధ్యనే జరుగుతుంది. పోలీస్ అధికారుల 'ఇగో' సమస్యలు .. గ్యాంగుల మధ్య ఆధిపత్య పోరుతోనే ఈ కథ కొనసాగుతుంది.

1980లలో జరిగిన సంఘటనలను సహజత్వానికి దగ్గరగా అందించడానికి ప్రయత్నించారు. కథ జైలువరకే పరిమితమై ఉండటం వలన, ఆ కాలం నాటి పరిస్థితులను చూపించడానికి ఎక్కువగా కష్టపడలేదు. ఈ కథలో బలమైన అంశం జైలుకు సంబంధించి కొత్త సంస్కరణలు తీసుకురావడానికి సునీల్ గుప్తా ప్రయత్నించడం. మరో అంశం .. జైల్లో మూడు గ్రూపుల మధ్య జరిగే గ్యాంగ్ వార్ లకి పరిష్కారం కనుక్కోవడం. 

ఈ రెండు అంశాలను ఉత్కంఠభరితంగా .. బలంగా ఆవిష్కరించలేకపోయారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించలేకపోయారు. జైలు నుంచి స్టూడెంట్స్ తప్పించుకునే సీన్ తేలిపోతుంది. ఆ ఎపిసోడ్ లో హడావిడి తప్ప మరేమీ కనిపించదు. చార్లెస్ శోభరాజ్ ట్రాక్ కూడా అంతే. సీమ అక్రమ సంబంధం వలన ప్రయోజనం ఏమిటో అర్థం కాదు. అసలైన అంశాలను ఇంట్రెస్టింగ్ గా చెప్పకపోవడం .. మరికొన్ని సీన్స్ అనవసరమైనవిగా అనిపించడం .. దానికి తోడు నిదానంగా స్క్రీన్ ప్లే .. ఈ కారణాలుగా ఈ సిరీస్ యావరేజ్ గా అనిపిస్తుందంతే. 

పనితీరు: యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు. నిదానంగా డ్రామా నడుస్తూ ఉంటుందంతే. ఆసక్తికరమైన సన్నివేశాలతో కథ పరిగెత్తకపోవడం నిరాశ పరుస్తుంది. స్క్రీన్ ప్లే కూడా చెప్పుకోదగిన స్థాయిలో ప్రభావం చూపించలేకపోయింది. ప్రధానమైన నలుగురు పోలీస్ ఆఫీసర్ల పాత్రలకు ఆర్టిస్టులు న్యాయం చేశారు. మిగతా ఆర్టిస్టుల నటన కూడా సహజత్వానికి దగ్గరగానే కనిపిస్తుంది. 

సౌమ్యనంద సాహి ఫొటోగ్రఫీ ఫరవాలేదు. అజయ్ జయంతి నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. తాన్య చాబ్రియా ఎడిటింగ్ ఓకే. యథార్థ సంఘటనలకు ప్రాధాన్యతనిస్తూనే, ఆయా సన్నివేశాలను ఉత్కంఠభరితంగా డిజైన్ చేసుకోవలసింది. ఈ కథ 1980 కాలానికి చెందినదే అయినా, ఈ జనరేషన్ కి తగిన స్పీడ్ ను స్క్రీన్ ప్లేలో చూపించి ఉంటే సిరీస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదేమో అనిపిస్తుంది.