తిరువీర్ ప్రధానమైన పాత్రధారిగా 'మోక్షపటం' సినిమా రూపొందింది. రాహుల్ వనజ రాజేశ్వర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, నేరుగా ఓటీటీకి వచ్చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: అర్జున్ (తిరువీర్) హైదరాబాదులో పాస్ పోర్టు ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు. డబ్బుకోసం అతను నకిలీ పాస్ పోర్టులు కూడా తయారు చేస్తూ ఉంటాడు. అతను 'మేఘన' అనే యువతిని ప్రేమిస్తూ ఉంటాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఆమె, ఎదుటివారిని మోసం చేయడానికి ఎంతమాత్రం ఆలోచన చేయదు. అలాంటి ఆమెకి 'షాను' తారసపడుతుంది. 'షాను' శ్రీమంతురాలు .. అయితే ఆమె ఆస్తిపాస్తులు భర్త గుప్పెట్లో ఉంటాయి. అతను ఆమెను అనునిత్యం అనుమానంతో వేధిస్తూ ఉంటాడు. 

ఇక 'గాయత్రి' ఒక మధ్యతరగతి ఇల్లాలు. ఆమె భర్త 'మహేశ్' క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఒక్కగానొక్క కొడుక్కి మంచి చదువు ఇవ్వాలనే ఉద్దేశంతో పెద్ద స్కూల్లో చేర్పిస్తారు. అత్తగారి మతిమరుపు ఆమెను ఇబ్బందిపెడుతూ ఉంటుంది. తాము ఎంతో కష్టపడి దాచుకున్న 10 లక్షలను స్నేహితుడికి ఇచ్చినందుకు, మహేశ్ పై తరచూ రుసరుసలాడుతూ ఉంటుంది. ఇల్లు గడవడం కోసం ఒక స్టార్ హోటల్లో పనిచేస్తూ ఉంటుంది.

తన స్నేహితుడిని నకిలీ పాస్ పోర్టుతో విదేశాలకి పంపించడం కోసం .. తాను చేసిన అప్పు తీర్చడం కోసం అర్జున్ ప్రయత్నిస్తూ ఉంటాడు. భర్త ప్రేమకి నోచుకోలేకపోయిన 'షాను'కి 'విసు'ను పరిచయం చేస్తుంది మేఘన. హోటల్లో పెద్దమొత్తంలో డబ్బు ఉన్న ఒక బ్యాగ్ గాయత్రి కంటపడటంతో, ఆమె దానిని రహస్యంగా ఇంటికి తీసుకుని వెళుతుంది. డబ్బు కోసం తప్పుడు మార్గంలో ముందడుగు వేసిన వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది కథ. 


విశ్లేషణ: అర్జున్ .. గాయత్రి .. మేఘన .. షాను అనే నాలుగు పాత్రల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఈ నాలుగు పాత్రలను టచ్ అవుతూ ఈ కథ ముందుకు వెళుతూ ఉంటుంది. ప్రధానమైన పాత్రలు .. వారి జీవితంలో వాళ్లకి ఎదురవుతున్న సమస్యలతో ఫస్టు పార్టు కొనసాగుతుంది. ఆ సమస్యలకు డబ్బు మాత్రమే పరిష్కారమని భావించిన దగ్గర నుంచి సెకండాఫ్ నడుస్తుంది. 

జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కొంతమంది మంచి రోజుల కోసం వెయిట్ చేస్తారు. తమ కష్టాలను నిజాయితీతో అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది మాత్రం ఇక మరో మార్గమే లేదన్నట్టుగా అడ్డదారిలో ముందుకు వెళతారు. అలాంటివారు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది దర్శకుడు తనదైన స్టైల్లో చెప్పడానికి ప్రయత్నించాడు. 

 ఓ నాలుగు పాత్రలను తీసుకుని, ఆ పాత్రలను ఒకే లైన్ తో కలుపుతూ వెళ్లడం వంటి కథలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఆ తరహాలో అల్లుకున్న కథనే ఇది. కథలో కొత్తదనం కనిపించదు .. కథ కోసం కేటాయించిన బడ్జెట్ కూడా తక్కువే. అందువలన ఆ పరిధిలో కథను ఆసక్తికరంగా అందించడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం, ఓ మాదిరి మార్కులను మాత్రమే  తెచ్చుకుంటుంది. 

పనితీరు: ఒకరిద్దరు తప్ప ఈ సినిమాలో చాలావరకూ కొత్త ముఖాలే కనిపిస్తాయి. తమ పాత్రలకు గల ప్రాధాన్యతను బట్టి ఎవరికి వారు తమ పరిధిలో నటించారు. కథ - స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే, ఆకట్టుకునే ట్విస్టులేమి కనిపించవు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకు తగినట్టుగానే సాగుతాయి. 'మోక్షపటం' అనే టైటిల్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. కానీ ఆ స్థాయి సన్నివేశాలు .. ఎత్తుకు పైయ్యెత్తులు ఈ కథలో లేవు.