కథ: శ్యామ్ (రాగ్ మయూర్) కి 'సివరపల్లి' పంచాయతీ సెక్రటరీగా జాబ్ వస్తుంది. తన స్నేహితులంతా ఫారిన్ వెళ్లి సెటిల్ అవుతుంటే, తాను పల్లెటూరు వెళ్లవలసి రావడం అతనికి ఇబ్బందిని కలిగిస్తుంది. కానీ తండ్రి మాటను కాదనలేక 'తెలంగాణ'లోని ఆ గ్రామానికి వెళతాడు. ఆ గ్రామానికి సుశీల (రూప లక్ష్మి)సర్పంచ్ గా ఉంటుంది. అయితే అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆమె భర్త సుధాకర్ ( మురళీధర్ గౌడ్) చక్కబెడుతూ ఉంటాడు. వారికి 'అనూ' అనే పెళ్లీడు కొచ్చిన కూతురు ఉంటుంది. 

'సివరపల్లి' పంచాయితీ ఆఫీసులోనే ఒక రూమ్ లో శ్యామ్ ఉంటూ ఉంటాడు. అతనికి అసిస్టెంట్ గా నరేశ్ ఉంటాడు. ఆ విలేజ్ వాతావరణం .. పల్లె మనుషులు ప్రవర్తించే తీరు శ్యామ్ కి చిరాకు కలిగిస్తూ ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా తాను ఫారిన్ వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూ .. అందుకు సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటాడు. అక్కడివారు ప్రభుత్వ విధానాల పట్ల బాధ్యతగా లేకపోవడం అతనిని మరింత ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
     
తనపని తాను చేసుకుంటూ .. చదువుకుని .. ఫారిన్ వెళ్లిపోవాలనే ఆలోచనలో అతను ఉంటాడు. కానీ సర్పంచ్ .. తన అసిస్టెంట్ చేసే పనులు అతనికి తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇదే సమయంలో అతనికి తన కూతురు 'అనూ'ను ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన సర్పంచ్ కి వస్తుంది. అప్పుడు శ్యామ్ ఏం చేస్తాడు? ఫారిన్ వెళ్లాలనే అతని ప్రయత్నం ఫలిస్తుందా? సర్పంచ్ కూతురుతో అతని పెళ్లి అవుతుందా? అనేవి కథలో ఆసక్తిని రేకెత్తించే అంశాలు. 

విశ్లేషణ: ఫారిన్ వెళ్లి అక్కడ హ్యాపీగా ఉండాలనేది శ్యామ్ ఆశ .. ఆలోచన. కానీ అతను 'పంచాయితీ సెక్రటరీ'గా తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చి ఒక పల్లెటూళ్లో పడతాడు. పల్లెటూరి లైఫ్ స్టైల్ అంటే ఎంతమాత్ర ఇష్టం ఉండని అతను, సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి విదేశాలకు వెళ్లిపోవడం కోసం ట్రై చేస్తుంటాడు. ఈలోగా అక్కడ అతనికి ఎదురయ్యే సమస్యలు .. సంఘటనలే ఈ కథ.

'పంచాయితీ ఆఫీసు'ను కేంద్రంగా చేసుకుని ఈ కథ నడుస్తూ ఉంటుంది. విలేజ్ లో పెద్దగా చదువుకోని మనుషులు .. వారి స్వభావాలు .. నమ్మకాలు .. ఆలోచనలను కలుపుకుంటూ సరదా సన్నివేశాలతో ఈ కథ సాగుతుంది. అక్కడి మనుషుల్లోని అమాయకత్వం .. మంచితనం .. ఒక్కోసారి ఇబ్బందిపెట్టే తెలియనితనం .. ఇవన్నీ దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటాయి. 

'సివరపల్లి' .. టైటిల్ కి తగినట్టుగా .. ప్రధానమైన పాత్ర గ్రామానిదే అని చెప్పాలి. ఈ కథ ఊరంతా తిరుగుతుంది. అయినా తక్కువ పాత్రలకే ప్రాధాన్యతనిస్తూ, సహజత్వం దెబ్బతినకుండా కథను పరిగెత్తించిన తీరు మెప్పిస్తుంది. 8 ఎపిసోడ్స్ కూడా ఎక్కడా బోర్ కొట్టకుండా నడుస్తాయి.  సహజత్వానికి దగ్గరగా అనిపించే సన్నివేశాలు సరదాగా నవ్విస్తాయి. 

పనితీరు: పంచాయితీ సెక్రటరీగా రాగ్ మయూర్ .. సర్పంచ్ గా మురళీధర్ గౌడ్ .. ఆయన భార్య పాత్రలో రూపలక్ష్మి .. ఉప సర్పంచ్ గా ఉదయ్ గుర్రాల .. పంచాయితీ సెక్రటరీకి అసిస్టెంట్ గా సన్నీ పల్లె తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఎవరి పాత్రలో వారు ఒదిగిపోయారు. ఒక విలేజ్ లో మనం నేరుగా చూస్తున్న దృశ్యాల మాదిరిగానే ఉంటాయి తప్ప, తెరపై చూస్తున్నట్టుగా అనిపించదు.

దర్శకుడు భాస్కర్ మౌర్య తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ కంటెంట్ ను అందించిన తీరు ఆకట్టుకుంటుంది. తెలంగాణ నేపథ్యంలోని ఒక ఊరు .. తెలంగాణ యాస .. స్వభావాలను ప్రెజెంట్ చేసిన విధానం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. సంభాషణలు చాలా సహజంగా అనిపిస్తాయి. 

వాసు పెండెం కెమెరా పనితనం బాగుంది. విలేజ్ నేపథ్యంలోని లొకేషన్స్ ను తెరపై ఆవిష్కరించిన తీరు నచ్చుతుంది. సింజిత్ ఎర్రమిల్లి నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి హైలైట్ గా నిలిచింది అనే చెప్పాలి. సాయిమురళి ఎడిటింగ్ నీట్ గా అనిపిస్తుంది. ఇది ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి తెలుగు వెబ్ సిరీస్ గా చెప్పుకోవచ్చు.